Telugu Global
Health & Life Style

సమంతకు 'మయోసైటిస్'.. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స ఏంటో తెలుసా?

సమంత డబ్బింగ్ చెప్పే సమయంలో చేతికి సెలైన్ బాటిల్ ఉండటం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. 'మయోసైటిస్'అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నానని, దానికి చికిత్స కూడా తీసుకుంటున్నట్లు సమంత పేర్కొన్నది.

సమంతకు మయోసైటిస్.. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స ఏంటో తెలుసా?
X

సినీ నటి సమంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కొంత కాలంగా వార్తలు వచ్చాయి. అమెరికాలో చికిత్స తీసుకుంటుందని కూడా చర్చ జరిగింది. కానీ ఏనాడూ తన అనారోగ్యంపై సమంత స్పందించలేదు. తాజాగా యశోద సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అందులో సమంత కీలకమైన పాత్ర పోషించింది. ఈ సినిమాకు సమంత ప్రస్తుతం డబ్బింగ్ చెబుతోంది. అయితే సమంత డబ్బింగ్ చెప్పే సమయంలో చేతికి సెలైన్ బాటిల్ ఉండటం అభిమానులను ఆందోళనకు గురి చేసింది.'మయోసైటిస్'అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నానని, దానికి చికిత్స కూడా తీసుకుంటున్నట్లు సమంత పేర్కొన్నది. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగుపడిందని.. త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని కూడా చెప్పింది. అయితే అసలు ఈ 'మయోసైటిస్' వ్యాధి లక్షణాలు ఏంటి? ఇది ఎలా వస్తుంది? దీని చికిత్స పద్దతులు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.

మన శరీరం కొన్ని అరుదైన లక్షణాలను చూపిస్తుంటుంది. ఆటో ఇమ్యూన్ కారణంగా ఏర్పడే కొన్ని లక్షణాల కలయికను 'మయోసైటిస్' అని పిలుస్తుంటారు. దీని వల్ల కండరాలు బలహీనంగా మారడమే కాకుండా త్వరగా అలసట రావడం, నొప్పి ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కండరాలకు వచ్చే ఇన్‌ఫెక్షన్‌నే 'మయోసైటిస్' అని వైద్యులు చెప్తారు. దీని వల్ల వాపు కూడా ఉంటుంది.

'మయోసైటిస్' ఏ వయసు ఉన్న వారికైనా రావొచ్చు. పిల్లల్లో కూడా దీని లక్షణాలు కనిపిస్తుంటాయి. భుజాలు, నడుము, తొడ కండరాలు ఎక్కువగా 'మయోసైటిస్'కు గురవుతాయి. ఒక్కోసారి 'మయోసైటిస్' తీవ్రత పెరిగితే అది శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. చర్మం, ఊపిరితిత్తులు, గుండెపై ఈ వ్యాధి ప్రభావం ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన వారికి ఒక్కోసారి ఊపిరి తీసుకోవడం, మింగడం కష్టంగా మారుతుంది.

'మయోసైటిస్' రెండు రకాలు. ఒకటి పాలీ మయోసైటిస్, డెర్మటోమయోసైటిస్. పాలీమయోసైటిస్ కారణంగా కండరాలు ఇన్‌ఫెక్షన్‌కు గురవుతాయి. దీని వల్ల బాడీలోని ఇతర భాగాలపై పెద్దగా ప్రభావం ఉండదు. అయితే డెర్మటామయోసైటిస్ కారణంగా చర్మంపై తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఒక్కోసారి ఇది శరీరంలోని ఇతర భాగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

లక్షణాలు :

- అలసిన, బలహీన పడిన కండరాలు. దీని వల్ల మెట్లు ఎక్కడం, వాహనాలు ఎక్కి దిగడం కష్టంగా అనిపిస్తుంది. జుట్టు దువ్వుకోవడం కూడా బాధకరంగా ఉంటుంది.

- కండరాలు తీవ్రంగా నొప్పి పెడుతుంటాయి.

- కండరాలు ఒక్కోసారి వాపునకు గురికావడం.

- ఏదో అనారోగ్యంతో ఉన్న ఫీలింగ్ కలగడం.

- బరువు తగ్గడం.

- రాత్రి పూట విపరీతమైన చమటలు పట్టడం

- కనురెప్పలు, ముఖం, మెడ, చేతుల వెనుక, వేళ్లపై ఎరుపు లేదా గులాబి వర్ణంలో రాషెస్ ఏర్పడతాయి.

- కళ్ల చుట్టూ వాపు, కలర్ మారడం జరుగుతుంది.

ఎలా గుర్తిస్తారు :

- బ్లడ్ టెస్ట్‌ల ద్వారా డ్యామేజ్‌ అయిన కండరాలను గుర్తించవచ్చు.

- బాడీలోని ఇన్‌ఫ్లమేషన్ లెవెల్స్ పరీక్షించడం ద్వారా

- యాంటీ బాడీస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడం ద్వారా

- ఎలక్ట్రోమయోగ్రఫీ పరీక్ష ద్వారా

- మజిల్ బయాప్సీ ద్వారా కూడా ఈ వ్యాధిని గుర్తించవచ్చు.

చికిత్స ఎలా:

'మయోసైటిస్' వ్యాధి తగ్గాలంటే తొలి దశలోనే స్టెరాయిడ్స్‌ను హై డోస్‌లో ఇస్తారు. ట్యాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్ల రూపంలో పేషెంట్‌కు అందిస్తారు. దీని వల్ల మజిల్ పెయిన్ తగ్గి.. బాడీ రిలీఫ్ అవుతుంది. అయితే కొంత మందికి హై డోస్ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. అందుకే సొంత వైద్యం కాకుండా పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందులు వాడాల్సి ఉంటుంది. దీంతో పాటు బోన్స్ ఎఫెక్ట్ కాకుండా కొన్ని మందులు, విటమిట్ సప్లిమెంట్స్ కూడా వాడాలి.

నిత్యం ఎక్సర్‌సైజ్ చేయడంతో పాటు ఫిజియోథెరపిస్ట్ చికిత్స కూడా తీసుకోవాలి. కండరాలు గట్టి పడటానికి, రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి వ్యాయామం తప్పనిసరి.

Next Story