Telugu Global
Health & Life Style

పరుగుతో... డిప్రెషన్ పరుగో పరుగు

వ్యాయామం లో భాగంగా చేసే రన్నింగ్ వలన అనేక రకాల ఆరోగ్యలాభాలుంటాయని మనకు తెలుసు. అయితే రన్నింగ్ తో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చక్కబడుతుందని, పరుగుతో డిప్రెషన్, యాంగ్జయిటీలనుండి బయడపడవచ్చని ఓ అధ్యయనంలో తేలింది.

పరుగుతో... డిప్రెషన్ పరుగో పరుగు
X

వ్యాయామం లో భాగంగా చేసే రన్నింగ్ వలన అనేక రకాల ఆరోగ్యలాభాలుంటాయని మనకు తెలుసు. అయితే రన్నింగ్ తో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చక్కబడుతుందని, పరుగుతో డిప్రెషన్, యాంగ్జయిటీలనుండి బయడపడవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. యాంటీ డిప్రెసెంట్ మందుల కంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా పరిగెత్తటం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆ అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు.

అధ్యయనం కోసం డిప్రెషన్ యాంగ్జయిటీ ఉన్న 141 మంది వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు. రన్నింగ్ చేయటం లేదా మందులు వేసుకోవటం రెండింటిలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోమని వారికి చెప్పారు. వారిలో 45మంది యాంటీ డిప్రెసెంట్ మందులను ఎంపిక చేసుకోగా 96మంది రన్నింగ్ థెరపీని ఎంపిక చేసుకున్నారు. వీరంతా 16వారాలపాటు ఈ అధ్యయన సూచనలను పాటించారు. రన్నింగ్ ని ఎంచుకున్నవారు వారానికి రెండులేదా మూడుసార్లు 45 నిముషాలపాటు పరిగెత్తెలా నిర్వాహకులు శ్రద్ధ తీసుకున్నారు. అలాగే ఆనందాన్ని పెంచే సెరటోనిన్ హార్మోనుని పెంచే మందులను... యాంటీ డిప్రెసెంట్లను ఎంపిక చేసుకున్నవారికిచ్చారు.

పరుగుని ఎంపిక చేసుకున్నవారిలో 52శాతం మాత్రమే సవ్యంగా, సూచించిన విధంగా రన్నింగ్ చేశారు. యాంటీ డిప్రెసెంట్ మందులను ఎంపిక చేసుకున్నవారిలో 82శాతం మంది మందులను సవ్యంగా వాడారు. ఫలితాలను పరిశీలించగా రెండు గ్రూపుల్లోనూ 44శాతం మందిలో డిప్రెషన్ యాంగ్జయిటీ లక్షణాలు తగ్గటం పరిశోధకులు గుర్తించారు. రన్నింగ్ ని ఎంపిక చేసుకున్నవారు పూర్తిస్థాయిలో దానిని చేయలేకపోయినా డిప్రెషన్ యాంగ్జయిటీల నుండి మందులను వాడినవారితో సమానంగా ఉపశమనం పొందారు.

మరిన్ని లాభాలు...

రన్నింగ్ చేసినవారిలో డిప్రెషన్ తగ్గటంతో పాటు వారి బరువు, నడుము చుట్టుకొలత కూడా తగ్గాయి. అలాగే గుండె పనితీరు మెరుగుపడింది. యాంటీ డిప్రెసెంట్ మందులు వాడినవారిలో ఇలాంటి ఫలితాలు రాలేదు. డిప్రెషన్, యాంగ్జయిటీలతో బాధపడుతున్నవారు రన్నింగ్ లేదా యాంటీ డిప్రెసెంట్ మందుల వాడకం... ఈ రెండింటిలో తమకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించడం ధ్యేయంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్టుగా పరిశోధకులు వెల్లడించారు. డిప్రెషన్ కి చికిత్సగా మందులకు బదులుగా వ్యాయామమే చేయాలని చాలామంది ఆశిస్తుంటారనే వాస్తవం ఈ అధ్యయనం ద్వారా వెల్లడైందని, అయితే వ్యాయామం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ దానిని ఆచరణలో పెట్టటం చాలామందికి సవాలుగా మారుతోందని కూడా పరిశోధకులు తెలిపారు.

డిప్రెషన్, ఆందోళనలతో బాధపడుతున్నవారికి మందులకంటే వ్యాయమమే బాగా పనిచేస్తుందని ఇంతకుముందు కూడా కొన్ని అధ్యయనాలు సూచించాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా మానసిక ఆరోగ్యం బాగుండాలంటే మందులకు బదులుగా ఆచరించదగిన పరిష్కారం వ్యాయామమేనని తెలిపింది.

First Published:  12 Oct 2023 2:00 AM GMT
Next Story