Telugu Global
Health & Life Style

బిడ్డ పుట్టాక తల్లిలో కోపం కనబడితే...?

కొంతమంది మహిళలు ప్రసవం తరువాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కి గురవుతుంటారు.

బిడ్డ పుట్టాక తల్లిలో కోపం కనబడితే...?
X

బిడ్డ పుట్టాక తల్లిలో కోపం కనబడితే...?

కొంతమంది మహిళలు ప్రసవం తరువాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కి గురవుతుంటారు. సుమారు 13శాతం మంది స్త్రీలు ఈ తరహా డిప్రెషన్ కి గురవుతారని తెలుస్తోంది. బిడ్డ పుట్టాక సంవత్సరం లోపు కాలంలో ఈ డిప్రెషన్ లక్షణాలు కనబడుతుంటాయి. అయితే చాలామంది స్త్రీలకు ఇలాంటి డిప్రెషన్ అంటూ ఒకటి ఉంటుందని కూడా తెలియదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో... బిడ్డకు జన్మనిచ్చిన స్త్రీలు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కి గురయినా వారు దానిని అర్థం చేసుకోలేరు. ఎలాంటి చికిత్సని తీసుకోరు. అయితే ఈ తరహా డిప్రెషన్ కి గురయినవారిలో కోపం కూడా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. ఈ అంశం గురించి తెలుసుకుందాం...

సాధారణంగా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కి గురయిన స్త్రీలు ప్రసవం తరువాత బాగా విచారంగా ఉంటారు. అలాగే ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. కొంతమంది ఏడుస్తుంటారు కూడా. వీరిలో అలసట ఆందోళనలు కనబడుతుంటాయి. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ విషయంలో ఈ లక్షణాలను గురించే తరచుగా వైద్యులు చెబుతుంటారు. అయితే ఈ తరహా డిప్రెషన్ కి గురయిన మహిళలలో కోపం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధ్యయనాల్లో తేలింది.

బర్త్ అనే ప్రతిక వెల్లడించిన వివరాల ప్రకారం ప్రసవం తరువాత మహిళకు శక్తి లేనట్టుగా, నిస్సహాయంగా అనిపించినా, మాతృత్వం తాను ఊహించినట్టుగా కాకుండా భిన్నంగా ఉందనిపించినా, ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆమెలో కోపం పెరిగిపోతుంది. దీనిని బట్టి ప్రసవానంతరం స్త్రీలలో కోపం కనబడితే దానిని కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ లక్షణంగానే భావించాలని వైద్యులు చెబుతున్నారు.


పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వలన దానికి గురయిన స్త్రీలు తమ బిడ్డ సంరక్షణ బాధ్యతలను సవ్యంగా నిర్వర్తించలేరు. కనుక తప్పకుండా ఈ సమస్యని గుర్తించి చికిత్స అందించాల్సి ఉంటుంది. వీరిలో కోపం ఎక్కువగా ఉండటం వలన అది డిప్రెషన్ మీద మరింత ఎక్కువ ప్రభావం చూపుతుందని, దీనివలన తల్లీ బిడ్డ ఇతర కుటుంబ సభ్యులే కాకుండా తల్లి తాలూకూ వివాహ బంధం కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బర్త్ అనే జర్నల్ లో ప్రచురితమైన వివరాలు, బ్రిటీష్ కొలంబియా యూనివర్శిటీ పరిశోధన ఫలితాలు ఈ అంశాలను వెల్లడించాయి.

సాధారణంగా కోపాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గా గుర్తించరని దానిని ఆయా మహిళల వ్యక్తిత్వ లక్షణంగా చూస్తారని కానీ అది సరికాదని నిపుణులు అంటున్నారు. ప్రసవించిన తల్లుల్లో కోపం ఉన్నపుడు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తీవ్రత మరింత ఎక్కువగా ఉందని గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.


అంతకుముందు డిప్రెషన్ కి గురయి ఉండటం, జీవనశైలిలో మార్పులు, ఒత్తిడికి గురిచేసే సంఘటనలు, అనుబంధాలు సవ్యంగా లేకపోవటం తదితర అంశాలు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ కి కారణం కావచ్చు.

First Published:  19 Jun 2023 10:10 AM GMT
Next Story