Telugu Global
Health & Life Style

పసివాళ్లకు ఫోన్... వారిలో పెరుగుదల పోస్ట్ పోన్

ఇప్పుడు ఫోనంటే ఏమిటో తెలియని పసిపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ తో విపరీతమైన అనుబంధం పెంచుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఇస్తే కానీ అన్నం తినని పిల్లలుంటున్నారు. అలాగే ఫోన్ చేతిలో పెడితే తల్లిని ఏడిపించకుండా దాంతోనే ఆటలు ఆడుతున్నారు.

పసివాళ్లకు ఫోన్... వారిలో పెరుగుదల పోస్ట్ పోన్
X

పసివాళ్లకు ఫోన్... వారిలో పెరుగుదల పోస్ట్ పోన్

ఇప్పుడు ఫోనంటే ఏమిటో తెలియని పసిపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ తో విపరీతమైన అనుబంధం పెంచుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఇస్తే కానీ అన్నం తినని పిల్లలుంటున్నారు. అలాగే ఫోన్ చేతిలో పెడితే తల్లిని ఏడిపించకుండా దాంతోనే ఆటలు ఆడుతున్నారు. అయితే సంవత్సరం వయసున్న చిన్నారులకు ఫోన్ ని ఇస్తే వారిలో కమ్యునికేషన్, సమస్యా పరిష్కార నైపుణ్యం ఆలస్యమవుతాయని రెండునుండి నాలుగేళ్ల వయసులో ఈ ప్రభావం కనబడుతుందని ఓ నూతన అధ్యయనం వెల్లడించింది.

సంవత్సరం వయసున్న చిన్నారులు రోజుకి నాలుగు గంటలకు మించి ఫోన్, టీవీ, టాబ్, లాప్ టాప్ వంటివి చూస్తే... అంటే వారి స్క్రీన్ టైమ్ నాలుగు గంటలకు మించి ఉంటే వారిలో మెదడు అభివృద్ధి, శారీరక పెరుగుదల ఆలస్యమవుతాయని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ పిల్లల విభాగపు జర్నల్ లో ప్రచురితమైన నూతన అధ్యయనం వెల్లడించింది. 7097మంది తల్లీబిడ్డల జంటలతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. పిల్లలు ఎన్నిగంటల పాటు స్క్రీన్ లను చూస్తున్నారు, వారిలో పెరుగుదల ఎలా ఉంది అనే వివరాలను తల్లుల ద్వారా తెలుసుకుని అధ్యయనం నిర్వహించారు.

రెండేళ్ల వయసులో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ గంటల కాలం స్క్రీన్లతో ఉన్న చిన్నారుల్లో కమ్యునికేషన్, సమస్యా పరిష్కార నైపుణ్యాలు అలవడేందుకు అసలు సమయం కంటే మూడింతల ఎక్కువ సమయం పడుతున్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. ఈ పిల్లల్లో సామాజిక నైపుణ్యాలు, వస్తువులను చేతులతో పట్టుకోవటం, నడక, పరుగు లాంటి మోటార్ స్కిల్స్ తక్కువగా ఉండటం గమనించారు. నాలుగేళ్ల వయసు వచ్చేసరికి వారిలో ఆ లోపాలు చక్కబడినట్టుగా కనబడుతున్నా సంవత్సరం వయసున్న పిల్లలకు ఫోన్ ఇవ్వటం అనేది వారి మెదడుకి ఏమాత్రం మంచిది కాదని పరిశోధకులు సూచిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాడ్రిక్స్ ...రెండునుండి ఐదేళ్ల వయసున్న చిన్నారులకు గంటకు మించి ఎలక్ట్రానిక్ డివైస్ లను ఇవ్వవద్దని సూచించాయి. స్క్రీన్ టైమ్ ని తగ్గించడం వలన వారిలో శారీరక చురుకుదనం, నిద్ర నాణ్యత పెరుగుతాయి. దీనివలన వారిలో శారీరక మానసిక పెరుగుదల బాగుంటుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అయితే 18 నెలలు అంతకంటే తక్కువ వయసున్న చిన్నారులకు అసలు స్క్రీన్లను చూసే అవకాశమే ఇవ్వవద్దని చెప్పింది.

ఇదిలా ఉండగా ఎక్కువ సమయం ఎలక్ట్రానిక్ డివైస్ లను వాడుతున్న చిన్నారుల తల్లులు వయసులో చాలా చిన్నవారయి ఉండటం, లేదా వారికి అధ్యయనంలో పాల్గొన్న బిడ్డ తొలిసంతానం అయి ఉండటం, ఇంటికి వచ్చే ఆదాయం తక్కువగా ఉండటం, వారు ప్రసవం తరువాత డిప్రెషన్ కి గురయి ఉండటం లేదా వారికి చదువు తక్కువగా ఉండటం లాంటి అంశాలను పరిశోధకులు గుర్తించారు. అంటే తల్లి స్థితిగతులు, తెలివితేటలకు బిడ్డ ఫోన్ వాడకానికి సంబంధం ఉన్నదని కూడా అధ్యయనంలో తేలింది. అలాగే పిల్లల చదువుకి సంబంధించిన వీడియోలు చూడటం, ఊరికే మెదడుకి పనిచెప్పకుండా రీల్స్ వంటి వీడియోలు చూస్తూ ఉండటం ఒకటి కాదని కూడా పరిశోధకులు చెబుతున్నారు.

ఏదిఏమైనా పిల్లల స్క్రీన్ టైమ్ కి వారిలో శారీరక మానసిక పెరుగుదలకు సంబంధం ఉందని కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్ సిస్కో యూనివర్శిటీలో పీడియాట్రిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జేసన్ నగటా అన్నారు. కాబట్టి తల్లిదండ్రులందరూ ఈ విషయాలను గుర్తుంచుకోవటం మంచిది.

First Published:  24 Aug 2023 5:30 AM GMT
Next Story