Telugu Global
Health & Life Style

కొత్త వేరియంట్‌ను ఇలా ఎదుర్కోవచ్చు!

మిగతా దేశాలతో పోలిస్తే మనదేశం కొవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంది.

కొత్త వేరియంట్‌ను ఇలా ఎదుర్కోవచ్చు!
X

మిగతా దేశాలతో పోలిస్తే మనదేశం కొవిడ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంది. మన ఆహారపు అలవాట్లు, హెర్డ్ ఇమ్యూనిటీ, వ్యాక్సిన్ల కారణంగా కొవిడ్‌పై త్వరగానే పైచేయి సాధించాం. అయితే అంతమాత్రాన కొవిడ్‌ అన్ని వేరియెంట్లను మనం ఎదర్కోగలం అని కాదు. కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్లపై వ్యాక్సిన్లు పూర్తి స్థాయి ప్రభావాన్ని చూపలేకపోవచ్చు. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు కొత్తగా ‘ఒమిక్రాన్ బిఎఫ్‌7 (BF7)’ అనే వేరియంట్ విజృంభిస్తుంది. దీన్ని ఎదుర్కొనేందుకు ఎలా సిద్ధమవ్వాలంటే..

తేలికగా వ్యాప్తి చెందే బిఎఫ్‌7 వేరియెంట్‌ను ఎదుర్కొనేందుకు ఎప్పటిలాగే మాస్క్ పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్. అలాగే మునుపటి లాగే భౌతిక దూరాన్ని పాటించడం, జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం లాంటి జాగ్రత్తలను మర్చిపోవద్దు.

కొత్త వేరియంట్‌కు కూడా శ్వాసకోస ఇన్ఫెక్షన్‌, జలుబు , దగ్గు, జ్వరం లాంటి లక్షణాలే ఉంటాయి. కొందరిలో విరోచనాలు, జీర్ణ సమస్యలు కూడా ఉండొచ్చు. అయితే గర్భిణులు, వృద్ధులు, శ్వాస సమస్యలు ఉన్నవాళ్లపై ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండే వీలుంది. కాబట్టి వీళ్లు అప్రమత్తంగా ఉండాలి.

కొత్త వేరియంట్‌ను తిప్పికొట్టాలంటే అప్రమత్తంగా ఉండడం అవసరం. జ్వరం, దగ్గు లాంటివి రెండు రోజులకు మించి ఉంటే వెంటనే డాక్టర్‌‌ను కలిసి టెస్ట్‌లు చేయించుకోవాలి. శ్వాస ఇబ్బందులు తలెత్తినా, ఆయాసం, గొంతునొప్పి లాంటివి మొదలైనా వెంటనే జాగ్రత్తపడాలి.

కొవిడ్ టైంలో పాటించిన ఆహార నిమయాలను మరోసారి గుర్తుచేసుకోవాలి. ఇమ్యూనిటీ పెంచే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. బయటి ఫుడ్, మాంసాహారాన్ని తగ్గించాలి. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్, డ్రైఫ్రూట్స్‌ తీసుకోవాలి. వేడి నీళ్లు తాగుతుండాలి. జలుబు చేస్తే ఆవిరి పట్టుకోవాలి. క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయాలి. ఎన్ని కొత్త వేరియంట్లు వచ్చినా ముందు జాగ్రత్తలతోనే వాటిని ఎదుర్కోగలమని గుర్తుంచుకోవాలి.

First Published:  6 Jan 2023 2:00 PM GMT
Next Story