Telugu Global
Health & Life Style

ఆఫీస్ లో రొమాన్స్.. తేడా వస్తే కెరీర్ గల్లంతే..

ఆఫీస్ లో సంబంధాలు కంపెనీకి ఇబ్బంది లేనంతకాలం సవ్యంగా సాగుతాయి. వాటికి యాజమాన్యం కూడా అడ్డు చెప్పాలనుకోదు.

ఆఫీస్ లో రొమాన్స్.. తేడా వస్తే కెరీర్ గల్లంతే..
X

స్కూల్ లో ప్రేమ కథల్లో పసితనం ఉంటుంది, కాలేజీ ప్రేమల్లో ఆకర్షణ ఉంటుంది, ఆఫీస్ ప్రేమల్లో జీవితంలో స్థిరపడాలనే కోరిక ఎక్కువగా కనపడుతుంది. అయితే ఆఫీస్ లో జరిగే ప్రేమ కథలన్నిటికీ శుభం కార్డ్ పడుతుందని అనుకోలేం. తేడా వస్తే కెరీర్ గల్లంతయ్యే ప్రమాదం కూడా ఉంది.

ఆఫీస్ లో కొలీగ్స్ ప్రేమలో పడితే బాస్ లు ఆనందిస్తారు అనే ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. ప్రేమలో ఉన్నోళ్లు ఆఫీస్ లో పనిగంటలు పూర్తయినా అక్కడే ఉండటానికి ఇష్టపడతారు, ఎక్కువగా పనిచేస్తారు, ఆఫీస్ కోసం కష్టపడతారు అని అంటారు.


ఇలాంటి వ్యవహారాల వల్ల ఎక్కడా ఎవరికీ ప్రమాదం లేదు. కానీ ఏదయినా శృతిమించితేనే వ్యవహారం తేడా కొడుతుంది. ఆఫీస్ ప్రేమలు వికటిస్తే మీటూ అనే ప్రమాదం లేకపోలేదంటున్నారు నిపుణులు. ఫలానా వారు నన్ను వేధించారు, నాతో సంబంధం పెట్టుకునేందుకు బలవంతం చేశారనే ఆరోపణలు కూడా చాలానే వినిపిస్తున్నాయి. అలాంటి కారణాలతోనే మెక్ డొనాల్డ్స్ సంస్థ సీఈఓ, సీఎన్ఎన్ సంస్థ ప్రెసిడెంట్ తమ ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. దీనికి తోడు సమాజంలో చీదరింపులు అదనం. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఆఫీస్ లో సంబంధాలు కంపెనీకి ఇబ్బంది లేనంతకాలం సవ్యంగా సాగుతాయి. వాటికి యాజమాన్యం కూడా అడ్డు చెప్పాలనుకోదు. కానీ ఆ సంబంధాల వల్ల ఆఫీస్ కి ఇబ్బంది ఎదురవుతుందనుకుంటే మాత్రం వారిని ఎంతమాత్రం ఉపేక్షించదు.

అక్రమ సంబంధాలే ఎక్కువ..

ఆఫీసుల్లో కనిపించే వాటిలో ఎక్కువ అక్రమ సంబంధాలే ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 1990 కాలంలో 38శాతం అక్రమ సంబంధాలు ఆఫీసుల్లో కనిపిస్తే ఆ తర్వాత అది 50శాతానికి పెరిగింది.

ఆఫీసుల్లో కొలీగ్స్ మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నవారు చాలామందే కనిపిస్తారు. తమ జీవిత భాగస్వామిని మోసం చేస్తున్నామనే ఉద్దేశం వారికి ఎంతమాత్రం ఉండదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు.

ఆఫీస్ పరిచయాలను కుటుంబ సభ్యులు ఏమాత్రం గమనించరు అనే ధీమా కూడా చాలామందిలో ఉంటుంది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో ఎక్కడా ఏ రహస్యాన్ని దాచి ఉంచలేని పరిస్థితి. అందుకే ఆఫీస్ లో ప్రేమలు వెంటనే బయటపడిపోతుంటాయి. కాలం కలిసొచ్చినంతకాలం అంతకు మించిన ఆనందం మరొకట ఉండదు. వ్యవహారం తేడా కొడితే మాత్రం కెరీర్ కి అది ఓ మాయని మచ్చలా మారిపోతుంది.

First Published:  18 May 2023 6:23 AM GMT
Next Story