Telugu Global
Health & Life Style

పోషకాలను భర్తీచేద్దామిలా!!

సరైన పోషకాహారం శరీరానికి అందనప్పుడు జీవనశైలి చాలా అస్తవ్యస్తమవుతుంది. అది శరీరాన్ని అనారోగ్యంవైపు నడిపిస్తుంది. శరీరానికి తగిన శక్తి, శరీరంలో తగినంత రోగనిరోధకశక్తి ఉంటేనే ఇప్పట్లో ఎదురవుతున్న అనారోగ్యాలను తట్టుకుని వాటిని నయం చేసుకోగలుగుతాము.

Nutrients,  Foods you must add to your diet
X

ఇంటి పెరట్లోనో, లేదా చిన్న కుండీలలోనో రెండు మొక్కలు నాటి, వాటిలో ఒకదానికి ప్రతిరోజు నియమానుసారంగా నీళ్లుపోయడం, అప్పుడప్పుడు ఎరువులు వేయడం, చుట్టూ పెరిగే కలుపుమొక్కలు ఏరేయడం, ఎలాంటి చీడ పట్టకుండా ఆరోగ్యవంతమైన క్రిమిసంహారక మందులు వేయడం వంటివి చేస్తూ, ఇంకొక మొక్క గురించి సరిగ్గా పట్టించుకోకుండా ఉంటే రెండింటిలో ఒకమొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుందని, ఇంకొకమొక్క సరిగ్గా పెరగదని మనకు అర్థమవుతుంది.

మొక్కలకు సరైన పోషణ లేకపోతే ఇలా అవుతున్నప్పుడు మనిషికి సరైన పోషణ లేకపోతే ఎలా??

ఈమధ్య కాలంలో ప్రతిఒక్కరూ బిజిగానే ఉంటారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకు ఉరుకులు పరుగులు తప్పవు. ఉద్యోగం, ఇంటిపని, ఇల్లు చక్కదిద్దుకోవడం, మధ్యమధ్యలో ఎక్కడికైనా వెళ్ళిరావడం, రాత్రి ఎప్పుడో ఇంటికి చేరతారు. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ల మధ్య ప్రయాణం చేసి వెళ్ళొస్తుంటారు. రోజులో ఉద్యోగానిది సగం సమయమైతే ఈ ప్రయాణానిది మరొక పావుభాగం అవుతుంటుంది. వీటి మధ్య ఎప్పుడు తింటారో ఏమి తింటారో ఆ దేవుడికే తెలియాలి. ఈ కారణంగా చాలామంది రోజులో శరీరానికి కావలసినంత పోషకాలను ఆహారం ద్వారా పొందలేకపోతున్నారని నిపుణులు అభిప్రాయం.

సరైన పోషకాహారం శరీరానికి అందనప్పుడు జీవనశైలి చాలా అస్తవ్యస్తమవుతుంది. అది శరీరాన్ని అనారోగ్యంవైపు నడిపిస్తుంది. శరీరానికి తగిన శక్తి, శరీరంలో తగినంత రోగనిరోధకశక్తి ఉంటేనే ఇప్పట్లో ఎదురవుతున్న అనారోగ్యాలను తట్టుకుని వాటిని నయం చేసుకోగలుగుతాము. అందుకే రోజువారిజీవితంలో పోషకారం ఎంతో ముఖ్యమైనపాత్ర పోషిస్తుందని ప్రముఖ పోషకార నిపుణుడు కవితా దేవగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రోజుమొత్తానికి అవసరమైన పోషకాహారాన్ని శరీరానికి అందించడానికి అయిదు మంచి మార్గాలను సూచించారు.

అల్పాహారం వదులుకోకూడదు!!

◆ అందరూ బ్రేక్ఫాస్ట్ గా పిలిచే ఈ అల్పాహారం రోజులో ఎంతో ముఖ్యమైనది. చాలామంది ఉదయం గ్లాసుడు పాలు తాగి రోజువారీ పనులలో పడిపోతారు. మధ్యాహ్నం వరకు ఆ పాలతోనే గడుపుతారు. దానివల్ల పనులు చేసేటప్పుడు నీరసం, మెదడు భారంగా మారడం, తలనొప్పి, చిరాగ్గా ఉండటం వంటి సమస్యలు ఎదుర్కుంటారు.

◆ ఉదయాన్నే అల్పాహారం తీసుకునేవారిని, తీసుకోనివారిని గమనిస్తే, అల్పాహారం తీసుకునేవారు చురుగ్గా, అధికబరువు లేకుండా, మంచి జ్ఞాపకశక్తితో, రోజుమొత్తం చలాకీగా అన్ని పనులను సమర్థవంతంగా చేయగలిగే స్థాయిలో ఉంటారు.

◆ ఉదయాన్నే అల్పాహారం తిననివారికి గ్యాస్ ట్రబుల్ సమస్యలు చాలా వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

అందుకే ప్రతిరోజు రాత్రిపడుకునే ముందు మరుసటిరోజు అల్పాహారం కోసం ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా అల్పాహారం సిద్ధం చేసుకోవచ్చని కవితా దేవగన్ చెప్పారు.

ప్రణాళిక!!

◆అల్పాహారం విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. సగటు మధ్యతరగతి కుటుంబాలలో తల్లులు పిల్లలకు వండినట్టు తాము వండుకుని తినలేరు.

◆ పోషకాలు అందాలంటే పెద్దపెద్ద కసరత్తులు చేయాల్సిన అవసరం లేదని, వంటింట్లో ఎన్నోరకాల కూరగాయలను అల్పాహారంతో భాగం చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు తెలిపారు.

◆ ఉల్లిపాయ, టమాటా, క్యారెట్, కీరదోస మొదలైనవాటిని పచ్చిగా సలాడ్లలో ఉపయోగిస్తారు. నిజానికి ఉడికించి, వేపి చేసుకుని తినే టిఫిన్ ల కంటే ఈ పచ్చి కూరగాయలు ఎంతో పోషకాలను శరీరానికి అందిస్తాయి.

◆ బంగాళాదుంపలు, చిలగడదుంపలు ఆకలిని భర్తీచేయడంలో చాలాబాగా సహాయపడతాయి. కాబట్టి వాటిని ఇంట్లో నిల్వవుంచుకోవడం మంచిది.

కాయధాన్యాలు!!

◆ కాయధాన్యాలలో ఫైబర్, ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు కూడా ఉంటాయి. కొన్నిరకాల పోషకాలు భర్తీ చేయడానికి కాయధాన్యాలు బాగా సహాయపడతాయి.

◆ బఠానీ, మొక్కజొన్న వంటివి ఆహారంలో జోడించుకోవచ్చు. టమాటా, పుదీనా, కొత్తిమీర చెట్నీలు చాలా తొందరగా మంచి రుచితో, మంచి పోషకాలతో సిద్ధం చేసుకోవచ్చు.

◆ శనగలు, పెసలు, వంటివి మొలకెత్తించి తినడం ఎంతో గొప్ప పోషకాలను అందిస్తుంది.

◆ గోధుమలు, జొన్నలు వంటివి రొట్టెలుగా చేసుకుని తినడం ఎప్పటి నుండో చూస్తున్నాం.

రంగులతో అద్భుతం!!

కూరగాయలకు, ఆహారానికి రంగు వేయమని కాదు దీని అర్ధం. తీసుకునే ఆహారంలో అన్ని రంగుల కూరగాయలు, ఆకుకూరలకు చోటివ్వాలని.

◆ సాధారణంగా కూరగాయల రంగును బట్టి వాటిలో విటమిన్లు ఉంటాయి. అందుకే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నారింజ వంటి రంగురంగుల కూరగాయలు, ఆకుకూరలను తీసుకోవాలి. అప్పుడు అన్నిరకాల పోషకాలు శరీరానికి దొరికినట్టు అవుతుంది.

◆ ఆకుకూరలను, కూరగాయలను తాజాగా వండుకుని తినడం మంచిది. వండుకుని నిల్వచేసుకోకూడదు.

పూర్తిగా తినాలి!!

అన్నీ ఉన్నా తినకపోతే అప్పుడు ఆహారానిది కాదు మనదే తప్పవుతుంది.

◆ పనులున్నాయని, సమయం లేదని, ఆలస్యమవుతుందని కారణాలు చెప్పుకుని కంచంలో పెట్టుకున్న ఆహారాన్ని సగం సగం తిని లేవడం వల్ల శరీరానికి కూడా సగం సగం పోషకాలే అందుతాయి.

◆ కొంతమంది రుచుల కోసం ఆరాటపడతారు. నిజానికి రంగు ఎక్కువ మారకుండా వండుకునే కూరల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అవి రంగుపొతే రుచి వస్తుందేమో కానీ పోషకాలు తక్కువ ఉంటాయి. కాబట్టి రుచి చూసి తినకుండా వదిలేయద్దు. ఆరోగ్యం కోసం తినాలి మరి.

కవితా దేవగన్ పై మార్గాలను చెప్పడమే కాకుండా ఆహారంలో వాడుకునే నూనెలు, మసాలా దినుసులు, కూరగాయలు, ఆకుకూరలు, తినే పండ్లు మొదలైనవి తాజాగాను, రసాయనాలు లేనివిగాను ఉంటే పోషకాలను భర్తీ చేసుకోవడం సులభమని తెలిపారు. మరి మీ పోషకాలకోసం మీరు పాటించేయండి.

First Published:  25 July 2022 9:53 AM GMT
Next Story