Telugu Global
Health & Life Style

కాలేయ ఆరోగ్యం.. ఇలా పదిలం!!

కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అందరికీ అందుబాటులో ఉండే గొప్ప ఆయుర్వేద గుణాలు ఉన్న ఔషధాలు, దినుసులు ఉపయోగించుకోవచ్చు.

కాలేయ ఆరోగ్యం.. ఇలా పదిలం!!
X

మానవ శరీర వ్యవస్థ అంతా అద్భుతమే. అందులో ఒక్కో అవయవం పనితీరు, ఆ అవయవం ప్రాధాన్యతను తెలుపుతుంది. ఇది వ్యర్థం అని చెప్పడానికి ఈ శరీరంలో ఏదీ లేదు. ఈమధ్య కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న శారీరక సమస్యలలో కాలేయ సంబంధిత సమస్యలు కూడా ఉంటున్నాయి. కాలేయం శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం.

◆ కాలేయం మానవశరీరంలో శంఖు ఆకారంలో ఎరుపు, గోధుమ రంగుల కలయికలో ఉంటుంది. ఇది ప్రధానంగా పైత్యరసాన్ని తయారుచేస్తుంది.

◆ పైత్యరసం పిత్తాశయంలో నిల్వచేయబడి ఉంటుంది. ఆహారం జీర్ణం కావడంలో ఈ పైత్యరసమే ప్రధానపాత్ర పోషిస్తుంది.

◆ శరీరానికి అవసరమైన పోషకాలను నిల్వచేయడం కాలేయం చేసే మరొక ముఖ్యమైన పని.

◆ ఇది శరీరంలో రక్తాన్ని శుద్ధిచేస్తుంది. శరీరంలో ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్ లను తయారుచేస్తుంది.

◆ రక్తకణాల కాలపరిమితి ముగియగానే వాటిని విచ్చిన్నం చేసి శరీర రక్తవ్యవస్థను కాపాడుతుంది.

◆ శరీరంలో గ్లూకోజ్ నిల్వలను నియంత్రిస్తుంది.

ఇన్ని పనులను చేస్తూ శరీర ఆరోగ్యాన్ని కాపాడే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

"మన శరీరంలో కాలేయం ఒక అద్భుతమైన అవయవం. తీసుకునే ఆహారం, తాగే ద్రవాలు, పీల్చే గాలి మొదలైనవాటి వల్ల కాలేయం పాడైపోవడం ఈమధ్య కాలంలో ఎక్కువగా జరుగుతోంది. అందుకే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి" అని ప్రముఖ కేరళ ఆయుర్వేద వైద్యుడు "డాక్టర్ అర్చన సుకుమారన్" చెప్పారు. దాంతోపాటు కాలేయ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఆయుర్వేద ఔషధాలు, ఇంట్లోనే అందుబాటులో ఉండే దినుసులు సూచించారు.

త్రిఫల!!

◆ మూడు అద్భుతమైన ఆయుర్వేద ఫలాల కలయిక త్రిఫల.

◆ఆమ్లా లేదా అమలకి అని పిలువబడే ఉసిరికాయ, కరక్కాయ లేదా హరితకి, తానికాయ లేదా బిబితకి ఈ మూడింటిని ఆయుర్వేదంలో త్రిఫలాలు అంటారు.

◆ త్రిఫల చూర్ణంగానూ, టాబ్లెట్స్ రూపంలోనూ, లేహ్యం రూపంలోనూ లభ్యమవుతాయి.

◆ ఇది ప్రధానంగా పైత్య సంబంధ గందరగోళాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

◆ కాలేయం సరైన విధంగా పనిచేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందుకే ప్రతిరోజు త్రిఫల చూర్ణం లేదా త్రిఫల టాబ్లెట్స్ వాడటం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

పసుపు!!

◆ గోల్డెన్ స్పైస్ అని పిలుచుకునే పసుపు సాధారణంగానే గొప్ప యాంటీ బయాటిక్, యాంటీ ఇన్ప్లమెటరీ గుణాలు కలిగిఉంటుంది.

◆ పసుపు హెపాటిక్ కణాలలో విషాన్ని తొలగించడంలో సహాయపడే గొప్ప యాంటీ ఆక్సిడెంట్.

◆ తాజా పసుపుకొమ్ము నుండి ఒక చిన్న ముక్కను తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల కాలేయం శుద్ధి అవడమే కాకుండా, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తపోటును అదుపులో ఉంచుతుంది, రోగనిరోధకశక్తిని పెంచుతుంది, అదనపు బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

నేల ఉసిరి!!

◆ నేల ఉసిరి మొక్క పెద్ద ఉసిరి చెట్టుకు ఉన్న ఆకుల్లానే సన్నని పరిమాణంలో ఆకులను కలిగి ఉంటుంది.

◆ ఇది అన్నిరకాల కాలేయ సంబంధ సమస్యలలో ఉపయోగించబడుతుంది.

◆ముఖ్యంగా కాలేయం పరిమాణం పెరిగిపోవడం, కాలేయం పాడైపోయి అది ఎక్కువరోజులు గమనించుకోకుండా చాలా ప్రమాదస్థాయిలోకి వెళ్లడం వంటి సమస్యలలో కూడా నేల ఉసిరి మొక్క అద్భుతంగా పనిచేస్తుంది.

◆ సంప్రదాయ ఆయుర్వేదంలో కాలేయ సమస్యలకు వైద్యం చేయడానికి నేల ఉసిరి మొక్కను తప్పనిసరిగా ఉపయోగిస్తారు.

◆ ఇది కేవలం కాలేయ సమస్యలను తగ్గించడమే కాకుండా ఆ సమస్య మళ్లీ ఇంకెప్పుడూ రాకుండా ఉండేలా చేస్తుంది.

అశ్వగంధ!!

◆ఆయుర్వేదంలో అశ్వగంధకు ఉన్న స్థానం చాలాగొప్పది. దుంపల నుండి లభ్యమయ్యే అశ్వగంధ పొడి, టాబ్లెట్స్ రూపంలో లభ్యమవుతుంది.

◆ ఇది కాలేయ వ్యవస్థ సమతుల్యంగా ఉంచడానికి ఉపయోగపడే అద్భుతమైన ఔషధం.

◆ కాలేయ కణాల మీద ఒత్తిడిని, రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడి కాలేయానికి జరిగే నష్టాన్ని నివారిస్తుంది.

◆ పైత్యరస ఎంజైమ్ లు సహజంగా ఉత్పత్తి కావడంలో సహాయపడి జీర్ణక్రియకు దోహదం చేస్తుంది.

◆ అశ్వగంధ టాబ్లెట్స్ లేదా చూర్ణరూపంలో తీసుకోవచ్చు. అశ్వగంధ లేహ్యం కూడా అందుబాటులో ఉంటుంది.

వెల్లుల్లి!!

◆ వంటగదిలో తప్పక అందుబాటులో ఉండే అద్భుతమైన పదార్థం వెల్లుల్లి. ఇది రోగనిరోధకశక్తిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

◆ గొప్ప యాంటీ ఇన్ప్లమెటరీ, యాంటీ ఆక్సిడెంట్ చర్యలను కలిగిఉంటుంది.

◆ అన్నిరకాల కుటుంబ స్థాయిలకు సరసమైన ధరలో లభించే ఔషధం వెల్లుల్లి.

◆ వెల్లుల్లిలో ఉండే రసాయన పదార్థాలు కాలేయ సంబంధ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. కాలేయాన్ని శుద్దిచేయడంలో సహాయపడుతుంది.

ఈవిధంగా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అందరికీ అందుబాటులో ఉండే గొప్ప ఆయుర్వేద గుణాలు ఉన్న ఔషధాలు, దినుసులు ఉపయోగించుకోవచ్చు.

First Published:  27 July 2022 7:00 AM GMT
Next Story