Telugu Global
Health & Life Style

తులసి ఆకుల చాయ్.. ఎన్నో ప్రయోజనాలు

Tulsi Tea: తులసి టీ ఒక స్ట్రెస్ బస్టర్ లాగా పని చేస్తుంది. ప్రతీ రోజు ఈ టీని తాగడం వల్ల డిప్రెషన్ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇందులో ఉండే పొటాషియం మన మెదడులోని సెరోటినిన్ లెవెల్స్‌ను పెంచుతుంది.

Tulsi Tea
X

తులసి ఆకుల చాయ్.. ఎన్నో ప్రయోజనాలు

మన దేశంలో తులసి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. చాలా మంది హిందువుల ఇళ్లలో తులసి చెట్టుకు ప్రతీ రోజు పూజ చేస్తారు. అయితే తులసి కేవలం పవిత్రమైన మొక్క మాత్రమే కాదు. ఇది ఆరోగ్యప్రదాయిని అని ఆయుర్వేదం చెబుతోంది. తులసి ఆకులు, కాండం, విత్తనాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా తులసి ఆకులతో టీ చేసుకొని తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తామని నిపుణులు చెప్తున్నారు. తులసి ఆకుల్లో ఉండే అడాప్టోజెనిక్, యాంటీ ఆర్థరైటిక్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే రోజుకు ఒక్క సారైనా తులసి టీ తాగడం అందరికీ మంచింది.

తులసి టీ ఒక స్ట్రెస్ బస్టర్ లాగా పని చేస్తుంది. ప్రతీ రోజు ఈ టీని తాగడం వల్ల డిప్రెషన్ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇందులో ఉండే పొటాషియం మన మెదడులోని సెరోటినిన్ లెవెల్స్‌ను పెంచుతుంది. దీని వల్ల ఒత్తిడి లక్షణాలు తగ్గుతాయి. తులసి టీ నుంచి వచ్చే సువాసన కూడా ప్రశాంతతను అందిస్తుంది. ఈ టీలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్, యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలు పలు క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడతాయి. ఇక తులసిలో ఉండే యాంటీ-ఫంగల్ ప్రాపర్టీస్ చర్మ వ్యాధులను తగ్గిస్తాయి. అంతే కాకుండా దంతాలు పుచ్చిపోకుండా కాపాడుతుంది. నోటిలో పాచి కలిగించే బ్యాక్టీరియాను తొలగించి, నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. యాంటీ-బ్యాక్టీరియల్ లక్షణాలు అంటు వ్యాధులు రాకుండా కాపాడతాయి. గొంతు నొప్పిని కూడా తులసి టీ దూరం చేస్తుంది.

ప్రతీ రోజు ఒక కప్పు తులసి టీ తీసుకుంటే శ్వాసకోశ రుగ్మతలు తొలగిపోతాయి. అంతే కాకుండా అందులో ఉండే యాంటీ-వైరల్ లక్షణాలు దగ్గు, జలుబు, వైరల్ ఫివర్ తగ్గడానికి దోహదపడతాయి. సైనసైటిస్, తలనొప్పిని దూరం చేసే లక్షణాలు తులసి టీలో ఉన్నాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి తులసి టీ ఉపయోగపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి తులసి టీ అద్భుతమైన ఔషధంగా పని చేస్తుంది. నిద్రలేమి వల్ల అనేక అనారోగ్యాలు వస్తాయి. అయితే ఈ టీని తీసుకోవడం వల్ల చక్కని నిద్ర పట్టడమే కాకుండా.. మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

తులసి టీ తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు :

తాజా తులసి ఆకులు 6-7

అల్లం ముక్క చిన్నది 1

నిమ్మరసం 1 టేబుల్ స్పూన్

పచ్చి ఏలకులు 2

తేనె 2 టేబుల్ స్పూన్లు

నీళ్లు రెండున్నర కప్పులు

తయారీ విధానం

ముందుగా నీటిని కొంచెం వేడి చేయాలి. ఆ తర్వాత తేనె తప్ప మిగిలిన పదార్థాలు అన్నీ వేసి రెండు నుంచి మూడు నిమిషాలు మరిగించాలి. స్ట‌వ్‌ ఆపేసి అందులో తేనె వేసి కలిపి వేడిగా తాగాలి.

హెచ్చరిక

అధిక రక్తస్రావం, విపరీతమైన ఆకలి, కడుపు నొప్పితో బాధపడేవాళ్లు తులసి టీని తాగవద్దని నిపుణులు చెబుతున్నారు.

First Published:  4 Oct 2022 2:00 PM GMT
Next Story