Telugu Global
Health & Life Style

ఇలాంటి డైట్‌లు... ఆరోగ్యానికి చేటే

ఇలా ప్రత్యేకంగా రూపొందిన డైట్‌లలో ఆరోగ్యానికి హాని చేసే అంశాలు చాలా ఉన్నాయని వైద్యులు, పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి డైట్‌లు... ఆరోగ్యానికి చేటే
X

భోజనం అంటే అన్నం, కూర.. టిఫిన్ అంటే ఇడ్లీలు, దోశలు.. ఇది వరకు రోజుల్లో ఇలాగే ఉండేది పరిస్థితి. ఇప్పుడలా కాదు... పదార్థాల్లోని పోషకాలు, కేలరీలను తెలుసుకుని లెక్కలేసుకుని తింటున్నారు చాలామంది. ఈ క్రమంలో బరువుని తగ్గిస్తాయని, అనారోగ్యాలకు ఔషధాలుగా పనిచేస్తాయనే ప్రచారంతో రకరకాల ఆహార విధానాలు తెరపైకి వస్తున్నాయి. లో కేలరీ డైట్, డిటాక్స్ డైట్, కీటో డైట్... ఇలా రకరకాల పేర్లతో భిన్నమైన ఆహార విధానాలను చూస్తున్నాం. అయితే ఇవన్నీ మంచివేనా... అంటే అవునని చెప్పలేము. ఎందుకంటే... ఇలా ప్రత్యేకంగా రూపొందిన డైట్‌లలో ఆరోగ్యానికి హాని చేసే అంశాలు చాలా ఉన్నాయని వైద్యులు, పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..

కొంతమంది తాము ఎంపిక చేసుకున్న ఆహార పద్ధతిని చాలా నియమ నిష్టలతో కఠినంగా పాటిస్తుంటారు. అయితే ప్రతి డైట్ పద్ధతిలోనూ లోపాలు ఉండే అవకాశం ఉందని, అన్ని పోషకాలున్న బాలన్స్ డైట్ తీసుకోవటమే ఆరోగ్యకరమని సంబంధిత నిపుణులు సలహా ఇస్తున్నారు. వారు చెప్పినట్టుగా ప్రతి ఆహార విధానంలోనూ లోపాలు, నష్టాలు కనబడుతున్నాయి.

కేలరీలు చాలా తక్కువగా ఉండే... లో కేలరీ డైట్

లో కేలరీ డైట్‌గా పిలుస్తున్న ఈ విధానంలో తక్కువ కేలరీలున్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ ఉండటం వలన శరీరానికి కొన్నిరకాల పోషకాలు అందని పరిస్థితి ఏర్పడుతుంది. దీనివలన అలసట, బలహీనత ఏర్పడతాయి. ఈ ఆహార విధానం ఆరోగ్యానికి చాలా హానికరంగా కూడా మారవచ్చు. కండరాల ద్రవ్యరాశిని కోల్పోవటం, రోగనిరోధక శక్తి తగ్గిపోవటం, చాలాకాలంపాటు ఇదే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే అవయవాలు దెబ్బతినటం లాంటి నష్టాలుంటాయి. శరీరానికి అవసరమైన శక్తిని సమకూర్చే ఆహారాలు తీసుకోవటం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

ఫ్యాడ్ డైట్స్

అధిక బరువుని త్వరగా తగ్గించే ఆహార విధానాలుగా వీటిని నిర్వచిస్తుంటారు. పూర్తిగా శాకాహారాలను మాత్రమే తీసుకోవటం, కొన్నిరోజులు లేదా వారాలు పూర్తిగా పండ్ల‌ రసాలను మాత్రమే తాగటం, కార్బొహైడ్రేట్లను పూర్తిగా తగ్గించి ప్రొటీన్లు, కొవ్వులు ఉన్న ఆహారాన్ని మాత్రమే తినటం... ఇలాంటి విధానాలను ఫ్యాడ్ డైట్స్ అంటారు. త్వరగా బరువు తగ్గేందుకు కొన్ని రోజులపాటు చాలా కఠినంగా పాటించే ఆహార విధానాలు ఇవి. ఈ ఆహార విధానాలు త్వరగా ఫలితాలను ఇస్తాయని భావిస్తుంటారు కానీ అందుకు శాస్త్రీయమైన రుజువులు లేవు. అలాగే ఈ పద్ధతులను దీర్ఘకాలం పాటు పాటించడం మంచిది కాదు. అన్నిరకాల పదార్థాలను సమపాళ్లలో తీసుకోకపోవటం, కొన్నిరకాలను పూర్తిగా పక్కన పెట్టేయటం వలన శరీరానికి తగిన పోషకాలు అందని పరిస్థితి ఏర్పడుతుంది.

డిటాక్స్ డైట్

శరీరంలో పేరుకున్న విషాలు, వ్యర్థాలను బయటకు పంపించే ఆహార విధానంగా దీనికి పేరుంది. ఈ విధానం పేరు చాలా బాగుంది కానీ ఇందులోనూ లోపాలున్నాయి. ఈ పద్ధతిలో ఆహారం తీసుకునేవారిలో కొందరు కేవలం పండ్లు, కూరగాయలు తింటారు. కొంతమంది కేవలం పానీయాలు మాత్రమే తాగుతారు. ఈ తరహా ఆహార పద్ధతుల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి ఆహారాలు కొంతమందికి సరిపడవు. దాంతో శక్తిహీనత, రక్తంలో చక్కెరశాతం తగ్గిపోవటం, కండరాల నొప్పులు, అలసట, మగతగా అనిపించడం లాంటి సమస్యలు వస్తాయి. ఈ ఆహారాలతో రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గుతాయనే ఆధారాలు లేవు. అలాగే మధుమేహం ఉన్నవారు ఇలాంటి ఆహారాలను తీసుకోవటం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

కీటోజెనిక్ డైట్

ఈ విధానంలో ప్రధానంగా కొవ్వులున్న ఆహారాలను, తగినంత మోతాదులో ప్రొటీన్లు, చాలా తక్కువగా పిండిపదార్థాలున్న ఆహారాలను తీసుకుంటారు. ఈ తరహా ఆహారం... లో బ్లడ్ ప్రెషర్, కిడ్నీలలో రాళ్లు, మలబద్ధకం, పోషకాల లోపం, గుండెవ్యాధుల ప్రమాదం లాంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. పాంక్రియాస్, లివర్, థైరాయిడ్, గాల్ బ్లాడర్ సమస్యలున్నవారు ఈ విధానంలో ఆహారం తీసుకోవటం క్షేమం కాదు. సరైన వైద్యసలహాలు, పర్యవేక్షణ లేకుండా ఇలాంటి ఆహారం తినటం మంచిది కాదు. దీనివలన పోషకాల లోపం, ఆరోగ్యానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లు సమతౌల్యంలో లేకపోవటం, లివర్, మూత్రపిండాలు వంటివి దెబ్బతినటం లాంటి సమస్యలు సైతం ఉండవచ్చు.

First Published:  11 Aug 2023 5:56 AM GMT
Next Story