Telugu Global
Health & Life Style

కాళ్ల నొప్పులతో రాత్రి నిద్రపట్టడం లేదా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి

రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ లక్షణాలు తేలికపాటి నుంచి భరించలేని విధంగా ఉంటాయి. ఒకవైపు మొదలై రెండో వైపునకు పాకవచ్చు.

కాళ్ల నొప్పులతో రాత్రి నిద్రపట్టడం లేదా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
X

కాళ్ల నొప్పులు.. మనిషిని ఎంత ఇబ్బంది పెడతాయో వాటిని అనుభవించిన వాళ్లకు తెలుస్తుంది. గతంలో కొంత మందికే పరిమితం అయిన ఈ కాళ్ల నొప్పులు.. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి వస్తున్నాయి. కొద్ది దూరం కూడా నడవలేక అవస్థలు పడే వాళ్లు కొంత మందైతే.. కూర్చున్నా, నిలబడ్డా.. చివరకు పడుకున్నా ఈ నొప్పులు వేధిస్తుంటాయి. దీంతో చాలా మంది రాత్రి పూట సరిగా నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. ఈ కాళ్ల నొప్పుల కారణంగా కూర్చొన్న కాసేపటికే నిలబడాలని, నిద్రపోతే కాళ్లు కదిలిస్తూ ఉంటారు. దీన్ని రెస్ట్‌లెస్ లెక్స్ సిండ్రోమ్‌గా పేర్కొటారు. వైద్య పరిభాషలో విల్లిస్-ఎక్‌బోమ్ వ్యాధినే సాధారణంగా రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్‌గా పిలుస్తుంటారు.

ఒక వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా కాళ్లు కదిలించాలనే కోరిక ఏర్పడుతుంది. ఇది కాలి నొప్పులకు సంబంధించిన సంకేతాలు మెదడుకు వెళ్లడం వల్లే ఇది జరుగుతుంది. తరుచుగా నిద్రలో జరుగుతున్నందు వల్ల దీన్ని నిద్ర రుగ్మతగా పేర్కొటారు. నిద్రలేమిని కలిగించడం వల్ల సదరు వ్యక్తి అలసిసోయినట్లుగా కనిపిస్తాడు. అందుకే రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ అని అంటారు. ఇది అన్ని వయసుల వారికి వచ్చే రుగ్మతే అయినా.. వయసు పెరుగుతున్ కొద్దీ వ్యాధి తీవ్రత పెరుగుతుంది.

రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ లక్షణాలు తేలికపాటి నుంచి భరించలేని విధంగా ఉంటాయి. ఒకవైపు మొదలై రెండో వైపునకు పాకవచ్చు. దురద, లాగడం, భరించలేని నొప్పి, పాదాలను సూదులతో గుచ్చినట్లు అవడం ఈ సిండ్రోమ్ ఉన్న వారిలో కనిపించే సాధారణ లక్షణాలు. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో నిర్దిష్ట కారణాన్ని ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేదు. కానీ, జన్యు సంబంధమైనదిగా వైద్యులు పేర్కొటున్నారు. రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తి కుటుంబంలో చాలా మంది ఇవే లక్షణాలతో కనిపిస్తుంటారు. ఇక ఐరల్ లోపం, మూత్ర పిండాల వైఫల్యం, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది.

యాంటిడిప్రెసెంట్స్, యాంటీ సైకోటిక్స్, యాంటి హిస్టామైన్‌లను కలిగి ఉండే జలుబు, అలర్జీ మందులను ఎక్కువగా వాడినా రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ వస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు.. మద్యపానం, ధూమపానం, శారీరిక శ్రమ లేకపోవడం వల్ల కూడా ఈ వ్యాధి రావొచ్చు. రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్‌ను నిర్ధారించడానికి పరీక్షలు ఏవీ లేవు. కానీ వైద్యులకు మన లక్షణాలు చెప్పడం ద్వారా వాళ్లు గుర్తిస్తారు.

రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్‌కు నిర్దిష్ట వైద్య చికిత్స లేదు. కానీ మన జీవన శైలి, ఆహారంలో మార్పుల ద్వారా ఈ రుగ్మతను తగ్గించవచ్చు. లక్షణాలు తక్కువగా ఉన్న వాళ్లు 20 నుంచి 30 నిమిషాల సేపు ప్రతీ రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కెఫిన్, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. పగలు నిద్ర తగ్గించి.. రాత్రి పూట పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. మందులు వాడకుండా అప్పుడప్పుడు లెగ్ మసాజ్‌లు చేయించుకోవడం, ఐస్ ప్యాక్, ఆవిరి స్నానాల వల్ల కూడా రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే తగ్గకపోతే అప్పుడు వైద్యులు సూచించే మందులను వాడాల్సి ఉంటుంది.

ప్రతీ రోజు నడక, వ్యాయామాల వల్ల ఈ సిండ్రోమ్ లక్షణాలు తగ్గుతాయి. నిర్దిష్టమైన సమయాల్లోనే నిద్రపోయేలా షెడ్యూల్ మార్చుకోవాలి. సాయంత్రం పూట కండరాలు మసాజ్ చేయాలి. పడుకునే ముందు వేడి నీటిలో కాసేపు కాళ్లను ఉంచాలి. లక్షణాలు ఎక్కువగా ఉన్నప్పుడు హీటింగ్ ప్యాడ్ లేదా ఐస్ ప్యాక్ ఉపయోగించవచ్చు. పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలి.

Next Story