Telugu Global
Health & Life Style

కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతాయంటే..

కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయ్యి, ప్రాణాలు పోయే ప్రమాదముంది . కాబట్టి కిడ్నీల ఆరోగ్యం మీద ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి.

కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతాయంటే..
X

శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ కూడా ఒకటి. కిడ్నీలు కూడా గుండె లాగానే ఇరవై నాలుగు గంటలూ పనిచేస్తూనే ఉంటాయి. కిడ్నీలు పనిచేయకపోతే శరీరం నడవదు. ఎందుకంటే శరీరానికి ఫిల్టర్ చేసిన రక్తాన్ని అందించేవి అవే. అందుకే కిడ్నీలను హెల్దీగా ఉంచుకోవడం ఎంతైనా అవసరం.

కిడ్నీలు శరీరానికి ఫిల్టర్ల వంటివి. ఒకరోజు క్లీన్ చేయకపోతే ఇల్లంతా ఎలా మురికిగా తయారవుతుందో శరీరం కూడా అంతే. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే.. రక్తంలోని మలినాలన్నీ అలాగే ఉండిపోయి లేనిపోని రోగాలన్నీ వచ్చి చేరతాయి. అందుకే కిడ్నీలను హెల్దీగా ఉంచుకోవడం ముఖ్యం. అసలు కిడ్నీలు బాగుండాలంటే ఏం చేయాలి? కిడ్నీలు ఎందుకు ఫెయిల్ అవుతాయి? నే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కీడ్నీలు చేసే ముఖ్యమైన పని రక్తాన్ని క్లీన్ చేయడం. ఇవి రోజుకు సుమారు 150 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్‌‌ చేస్తాయి. దాదాపు రెండు లీటర్ల యూరిన్‌ను బయటకు పంపిస్తాయి. కిడ్నీలు విటమిన్‌– డి తయారుచేయడంలో కూడా కీ రోల్ పోషిస్తాయి. అలాగే కిడ్నీలు ఎరిత్రోపాయిటిన్‌ను ఉత్పత్తి చేస్తూ హిమోగ్లోబిన్‌, రక్తకణాల తయారీకి హెల్ప్ చేస్తాయి. శరీరంలో సోడియం, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్, ఇతర ఎలక్ట్రోలైట్లు బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా చూస్తాయి. శరీరంలో ఏ అవయవమైనా సరిగ్గా పనిచేయాలంటే వాటిని ఫిల్టర్ చేసిన రక్తం అందాలి. అలా అందకపోతే అందులో ఉండే మలినాలు గుండె, మెదడులోకి చేరి ప్రాణాల మీదకు వస్తుంది. అందుకే కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అత్యంత ప్రమాదకరమైన సమస్య.

కిడ్నీలు దెబ్బతింటున్నప్పుడు ఫస్ట్ స్టేజ్‌లో ఎలాంటి లక్షణాలూ కనిపించవు. రోజులు గడిచేకొద్దీ డ్యామేజ్ మరింత ఎక్కవ అయ్యి చివరకి చేతులెత్తేస్తుంటాయి. కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయ్యి, ప్రాణాలు పోయే ప్రమాదముంది . కాబట్టి కిడ్నీల ఆరోగ్యం మీద ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. కిడ్నీల ఆరోగ్యంపై అవగాహన లేకపోవడం వల్ల సమస్య చివరి స్టేజ్‌కు చేరుకునేంతవరకూ సమస్యను గుర్తించలేకపోతారు చాలామంది. దానివల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే వరకూ తెచ్చుకుంటున్నారు. కిడ్నీల్లోని నెఫ్రాన్లు పూర్తిగా దెబ్బతిని చివరికి కిడ్నీలు ఆగిపోయే స్థితి వస్తే దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు డయాలసిస్‌ లేదా కిడ్నీ మార్పిడి లాంటివి చేయాల్సి ఉంటుంది. మనదేశంలో రోజూ డయాలసిస్‌ చేయించుకుంటున్న పేషెంట్లు లక్షల్లో ఉంటారు. అలాగే కిడ్నీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు, క్రానిక్ కిడ్నీ డిసీజ్, యూరినరీ ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలు కూడా ఎక్కువే.

కారణాలివే..

కిడ్నీల పనితీరు దెబ్బ తినడానికి చాలా కారణాలుంటాయి. వాటిలో డయాబెటిస్, బీపీ వల్ల ఎక్కువమంది కిడ్నీ జబ్బుల బారిన పడుతున్నారు. రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరిగితే కిడ్నీల్లో ఉండే రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదముంది. గ్లూకోజ్ ఎక్కువగా ఉన్న రక్తాన్ని ఫిల్టర్ చేయడం వల్ల కిడ్నీల కెపాసిటీ తగ్గిపోతుంది.

బీపీ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. కిడ్నీలకు రక్త సరఫరా తగ్గుతుంది. అలాగే హైబీపీ వల్ల కిడ్నీల్లోని నెఫ్రాన్లు కూడా దెబ్బతింటాయి. బీపీని అదుపులో ఉంచుకోకపోతే క్రమంగా కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుంది.

స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్ల వల్ల కూడా కిడ్నీలు దెబ్బ తింటాయి. స్మోకింగ్ వల్ల బీపీ పెరుగుతుంది. కొన్నిసార్లు రక్తంలో గడ్డలు లాంటివి ఏర్పడతాయి. అలాగే ఆల్కహాల్ వల్ల శరీరంలో ఎలక్ట్రోలైట్ల బ్యాలెన్స్ దెబ్బతింటుంది. దానివల్ల కిడ్నీల పనితీరు మందగిస్తుంది.

బరువు కంట్రోల్‌లో లేనివారికి బీపీ, డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. వాటి ఎఫెక్ట్ నేరుగా కిడ్నీలపై పడుతుంది. కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే బరువు అదుపులో ఉండాలి.

జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఈ రాళ్లు యూరిన్ ప్రవాహానికీ అడ్డుపడి ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చు.

ఇవి కాకుండా కొంతమందికి జన్యుపరంగా పుట్టుకతోనే కిడ్నీల్లో నీటి తిత్తులుంటాయి. దానివల్ల కూడా కిడ్నీలూ దెబ్బతినొచ్చు. అలాగే కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కూడా జన్యు పరమైన కారణాలు ఉంటాయి.

ఇలా గుర్తించొచ్చు

కిడ్నీలు దెబ్బ తినడం మొదలైనప్పుడు చాలావరకూ ఎలాంటి లక్షణాలు కనిపించవు. సమస్య ముదిరే కొద్దీ కాళ్లు వాయడం, ముఖం ఉబ్బడం, రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సిరావడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో కొన్ని లక్షణాలే కనిపించొచ్చు. ఇలాంటి సింప్టమ్స్ కనిపించినప్పుడు వెంటనే కిడ్నీ టెస్ట్‌లు చేయించుకోవాలి. లక్షణాలు ఉన్నా పట్టించుకోకుండా అలాగే ఉంటే కొంతకాలానికి కాళ్లవాపుతో పాటు ఆకలి మందగించటం, వికారం, వాంతులు, ఆయాసం, ఒళ్లంతా దురదల వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందికి ఫిట్స్‌ లాంటివి కూడా రావొచ్చు.

జాగ్రత్తలు ఇలా..

కిడ్నీల ఆరోగ్యానికి నీళ్లు తాగడం చాలా ముఖ్యం. రోజుకి కనీసం మూడు లీటర్ల నీళ్లు అయినా తాగకపోతే కిడ్నీపై అదనపు భారం పడుతుంది.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ముందు కిడ్నీ పనితీరు ఎలా ఉందో టెస్ట్ చేయించుకోవాలి. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, అల్ట్రా స్కానింగ్ టెస్ట్‌ల ద్వారా కిడ్నీల పనితీరు తెలుసుకోవచ్చు.

కిడ్నీ సమస్యలకు జన్యు పరమైన కారణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ రిలేటెడ్ సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలి.

డయాబెటిస్, బీపీ, ఒబెసిటీ.. ఈ మూడు లేకుండా జాగ్రత్తపడితే చాలావరకూ కిడ్నీ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

డయాబెటిస్ పెషెంట్లు గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. బీపీ పేషెంట్లు బీపీ పెరగకుండా చూసుకోవాలి. క్రమం తప్పకుండా మందులు వాడాలి.

కూర్చొని పనిచేసేవాళ్లు రోజూ కొంత వ్యాయామం చేయాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. రోజుకి ఏడెనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

తీసుకునే ఫుడ్‌లో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోజుకి ఒక ఒక చెంచా ఉప్పు సరిపోతుంది. అలాగే జంక్‌ ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. శరీరంలో జంక్ ఎక్కువైతే ఆ భారం పడేది కిడ్నీలపైనే.

స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్ల వల్ల కిడ్నీల పనితీరు దెబ్బ తినడంతో పాటు కిడ్నీ క్యాన్సర్‌ ముప్పు కూడా పెరుగుతుంది.

First Published:  13 Dec 2023 5:15 AM GMT
Next Story