Telugu Global
Health & Life Style

పాతికేళ్లకే కీళ్ల నొప్పులు.. భారత్‌లో ముదురుతున్న కేసులు..

పాతికేళ్లకే కీళ్ల నొప్పులు.. భారత్‌లో ముదురుతున్న కేసులు..
X

పాతికేళ్ల యవ్వనం కాస్తా అనారోగ్యాలకు మూలంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు సరిగా లేకపోతే జీవితం దుర్భరంగా మారే ప్రమాదం ఉందని అంటున్నారు. అరవైలో రావాల్సిన కీళ్ల నొప్పులు ఇప్పుడు పాతికేళ్లకే బయటపడటం దీనికి సంకేతంగా చెబుతున్నారు. ఊబకాయ సమస్యతో బాధపడుతున్న భారతీయ యువత ఇప్పటికే ఈ సమస్యను అనుభవిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది కీళ్ల సమస్యల బారినపడే ప్రమాదముందని చెబుతున్నారు. ప్రస్తుతం భారత దేశంలో కోటి 40 లక్షల మంది చిన్నారులు ఒబెసిటీతో బాధపడుతున్నారు. వీరంతా భవిష్యత్తులో తీవ్రమైన కీళ్ల నొప్పుల బారినపడే అవకాశముందని చెబుతున్నారు నిపుణులు.

కారణాలేంటి..?

- శారీరక శ్రమలేని జీవన విధానం

- నిలబడటం, కూర్చునే విధానాల్లో సరైన పద్ధతి పాటించకపోవడం

- అధిక బరువు, ఊబకాయం

- విటమిన్ డి, బి-12 లోపం

- హార్మోనల్ సమస్యలు, వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధులు

- సరైన శిక్షణ లేకుండా ఎలా పడితే అలా వ్యాయామం చేయడం

- కీళ్ల దగ్గర గాయాలు

- షుగర్ లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు

- ఇన్ఫెక్షన్లు

- జాయింట్లు జారిపోవడం..

వీటివల్ల 25 నుంచి 30 ఏళ్ల వయసులోనే కీళ్లనొప్పులు వచ్చే అవకాశం ఉంది.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయొద్దు..

- ఉదయం లేవగానే అరగంటకు పైగా కీళ్లు గట్టిగా ఉండటం, కదల్చలేకపోవడం..

- కీళ్ల వాపు, ఎముకలు బలహీనంగా ఉన్నట్టు అనిపించడం

- కీళ్ల నొప్పితోపాటు, కూర్చున్నప్పుడు లేచినప్పుడు కీళ్ల వద్ద శబ్దం రావడం

- నీరసం, నిస్సత్తువ

- నడిచేటప్పుడు కీళ్లనొప్పి

చిన్న వయసులో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. యుక్త వయసులో వచ్చే ఇలాంటి కీళ్లనొప్పులకు సరైన చికిత్స అందిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు వైద్యులు.

ముందు జాగ్రత్తలు

- అతి వ్యాయామం వద్దు

- ఆరోగ్యకరమై ఆహారపు అలవాట్లు

- శరీరానికి తగినంత విశ్రాంతి

- ఒకేచోట అలాగే కూర్చుని ఉండే వర్కింగ్ లైఫ్ స్టైల్ ఉన్నవారు టైమ్ గ్యాప్ తీసుకుని కాస్త శరీరాన్ని కదుల్చుతుండాలి.

- కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు సరైన భంగిమలో ఉండాలి

First Published:  19 July 2022 8:07 AM GMT
Next Story