Telugu Global
Health & Life Style

గుండెపోటు అవకాశాలు పెంచే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్... తాజా అధ్యయనం

8 గంటల సమయ నియంత్రిత ఆహారం తీసుకొనే వారిలో హృదయ సంబంధిత మరణాల ముప్పు 91 శాతం ఉన్నట్టు వెల్లడైంది.

గుండెపోటు అవకాశాలు పెంచే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్... తాజా అధ్యయనం
X

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. ఇంగ్లీష్ పేరు పెద్దగా వెనకపోవచ్చు గానీ పరిమితం సమయంలోనే ఉపవాసం అంటే అందరికీ తెలుసు. ఇంకా సులువుగా అర్థం కావాలంటే బరువు తగ్గడానికి చేసే సమయ నియంత్రిత ఆహారపు అలవాటు. ఈ పధ్ధతి పాటించేవారు వీరు రోజులో 8 గంటలు మాత్రమే ఆహారం తీసుకుంటారు. మిగతా 16 గంటలు ఏమీ తీసుకోరు.. అంటే అదొకరకం ఉపవాసం ఉంటారన్నమాట. ఇలాంటి వ్యక్తులు హృదయ సంబంధిత వ్యాధులతో చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌ తాజా అధ్యయనం పేర్కొంది. భోజన సమయాలను రోజుకు కేవలం ఎనిమిది గంటల వ్యవధికి పరిమితం చేయడం వల్ల గుండె జబ్బుల వల్ల మరణించే ప్రమాదం 91శాతం పెరుగుతుందని ఏహెచ్ఏ పేర్కొంది.

సమయ నియంత్రిత ఆహారం అంటే..

బరువు తగ్గిందుకు జీవనశైలిపరంగా అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో ఇది ఒకటి. ఈ ప్రక్రియలో నిర్దిష్ట సమయంలో మాత్రమే ఆహారం తీసుకుంటారు. అంటే రోజులో 8 గంటల్లోనే ఆహారాన్ని తీసుకోవడం ముగిస్తారు. అంటే మిగతా 16 గంటలు కడుపును ఖాళీగా ఉంచుతారు. ఇలా చేయడం వల్ల రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయులు వంటి అనేక కార్డియోమెటబాలిక్ ఆరోగ్య చర్యలు మెరుగవుతాయని విశ్వసిస్తారు. అయితే తాజా అధ్యనంలో అదంతా నిజం కాదని తేలింది.

షాంఘై జియావో టోంగ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన విక్టర్ జాంగ్ నేతృత్వంలోని పరిశోధకులు, సర్వే ద్వారా సుమారు 20వేల మంది పెద్దల నుంచి డేటాను విశ్లేషించారు. ఈ అధ్యయనంలో 2003 నుంచి 2019 వరకు మరణాల డేటాతో పాటు అనేక అంశాలను పరిశీలించారు. 8 గంటల సమయ నియంత్రిత ఆహారం తీసుకొనే వారిలో హృదయ సంబంధిత మరణాల ముప్పు 91 శాతం ఉన్నట్టు వెల్లడైంది.

గుండె జబ్బులు, కేన్సర్ వంటి వాటితో బాధపడే వ్యక్తుల్లో గుండె సంబంధిత మరణాలు సంభవిస్తాయని తేలింది. అధ్యయనంలో పాల్గొన్నవారిలో సగం మంది పురుషులు కాగా.. వారి సగటు వయస్సు 48 ఏళ్లు. ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతూ 8 గంటల ఆహార నియమం పాటిస్తే వారిలో గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వాటితో మరణించే ముప్పు 10 గంటల ఆహార నియమం పాటించే వారితో పోలిస్తే 66 శాతం ఎక్కువ. ఏది ఏమైనా సమయ నియంత్రిత ఆహారం మరణముప్పును ఏమాత్రం తగ్గించలేదని అధ్యయనం తేల్చింది. మొత్తానికి సమయ నియంత్రిత ఆహారంపై ఇటుంటి కఠిన వాస్తవాలు వెల్లడైనప్పటికీ దీనిపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

First Published:  20 March 2024 12:30 AM GMT
Next Story