Telugu Global
Health & Life Style

మెంటల్ హెల్త్ మెరుగు పరుచుకోవడానికి ఈ ఆహారం తీసుకోండి

మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా మెంటల్ హెల్త్‌ను మెరుగు పరుచుకోవచ్చు. ఆందోళనలు తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారం ప్రతీ ఒక్కరికీ అవసరమే.

మెంటల్ హెల్త్ మెరుగు పరుచుకోవడానికి ఈ ఆహారం తీసుకోండి
X

మనిషికి శారీరిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. మానసిక ఆరోగ్యం (మెంటల్ హెల్త్) కూడా అంతే ముఖ్యం. ప్రస్తుత బిజీ లైఫ్‌లో ప్రతీ ఒక్కరి జీవితాలు ఒత్తిడితో కూడుకున్నవే. విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ బాధ్యతల వల్ల నేటి తరం ఎంతో ఒత్తిడికి గురవుతోంది. దీంతో కొంత మంది డిప్రెషన్‌కు గురై మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దీని వల్ల శారీరిక ఆరోగ్యం కూడా దెబ్బ తిని అనేక సమస్యలకు దారి తీస్తోంది. కాబట్టి, ప్రతీ ఒక్కరు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మనం తీసుకునే ఆహారం ద్వారా కూడా మెంటల్ హెల్త్‌ను మెరుగు పరుచుకోవచ్చు. ఆందోళనలు తగ్గించి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారం ప్రతీ ఒక్కరికీ అవసరమే. నేటి హడావిడి జీవితంలో కొన్ని ఆహార నియమాలు పాటించడం అంత సులభమేమీ కాదు. కానీ, మన ఆరోగ్యం కోసం కాస్త సమయాన్ని కేటాయించడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. మెదడు ఆరోగ్యాన్ని పెంచే ఆహారం తీసుకుంటే, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.

నాడీ వ్యవస్థకు మెగ్నీషియం చాలా అవసరం. దీనికి శాంత పరిచేగుణం ఉంటుంది. ఆందోళన, భయం, చంచలత్వం, చిరాకు నుంచి ఉపశమనానికి మెగ్నీషియం తోడ్పడుతుంది. వాల్‌నట్స్, అరటిపండ్లు, ఆప్రికాట్లు, పొద్దుతిరుగుడు విత్తనాలు, ఆకు కూరల్లో ఈ ఖనిజం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం ఉన్న పదార్థాలను మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

ఒమేగా 3 ఫాట్స్ మన శరీరానికి అవసరం. దీనిలో ఉండే ఎఎల్ఏ, ఈపీఏ, డీహెచ్ఏ, పీఏ వంటివి ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా చేపలు, చియా విత్తనాలు, అవిసె గింజలు, నెయ్యిలో ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల మెదడుపై ఒత్తిడి తగ్గుతుంది.

బీ విటమిన్లు నాడి వ్యవస్థను మెరుగుపరిచి, ఒత్తిడి తగ్గించడంలో చక్కగా సహాయపడుతాయి. బీ6, బీ9, బీ12 ఉండే ఆహారాన్ని తీసుకుంటే మన నాడీ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది. వేరు శెనగ, చిక్కుడు, పచ్చి ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఈ విటమిన్లు మన శరీరానికి అందుతాయి.

మన శరీరంలో సరిపడినంత జింక్ లేకపోతే అది జీఏబీజఏ, గ్లూటామేట్ స్థాయిలను తగ్గిస్తుంది. దీని వల్ల శరీరంలోఒత్తిడి పెరుగుతుంది. అందుకే జింక్ ఎక్కువగా ఉండే గార్డెన్ క్రేస్ సీడ్స్/హలీమ్ గింజలను తీసుకోవాలి. పప్పుల్లో కూడా జింక్ ఉంటుంది. ఆకుకూర పప్పు చేసుకొని తినడం వల్ల జింక్ లోపం నుంచి బయటపడవచ్చు.

విటమిన్ డీ లోపం కారణంగా మానసిక స్థితి సరిగా ఉండదు. మానసిక వ్యాధులతో బాధపడే వారికి డి విటమిన్ లోపం ఉన్నట్లు చాలా అధ్యయనాలు వెల్లడించాయి. గుడ్డు సొన, పుట్ట గొడుగులు, పాల ఉత్పత్తుల్లో డి విటమిన్ లభిస్తుంది. అలాగే ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ఎండకు కాసేపు తిరగడం వల్ల కూడా డి విటమిన్ సహజ సిద్ధంగా మన శరీరానికి అందుతుంది. ఇది మన మానసిక స్థితిని మెరుగు పరుస్తుంది. జంక్ ఫుడ్‌, ఆల్కహాల్, స్మోకింగ్, కార్బొనేటెడ్ డ్రింక్స్‌కు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

First Published:  18 Nov 2022 9:43 AM GMT
Next Story