Telugu Global
Health & Life Style

గర్భాశయ క్యాన్సర్‌ టీకా ఎప్పుడు వేయించుకోవాలంటే..

తాజాగా బాలీవుడ్ నటి శృంగార తార, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పూనమ్ పాండే కూడా ఈ కాన్సర్ తోనే మృతి చెందారు.

గర్భాశయ క్యాన్సర్‌ టీకా ఎప్పుడు వేయించుకోవాలంటే..
X

సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించేందుకు 9-14 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్ అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తన తాత్కాలిక బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్‌ తర్వాత భారతీయ మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య గర్భాశయ క్యాన్సర్‌ కాబట్టి . భారతదేశంలో ప్రతి ఎనిమిది నిమిషాలకి ఓ మహిళ గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తున్నట్లు అంచనా, అధిక మరణాల రేటుకి ప్రధాన కారణం ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలను గుర్తించకపోవడమే.

తాజాగా బాలీవుడ్ నటి శృంగార తార, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన పూనమ్ పాండే కూడా ఈ కాన్సర్ తోనే మృతి చెందారు. గర్భాశయ క్యాన్సర్ అనేది 30 ఏళ్లు పైబడిన మహిళల్లో వస్తుంది. హ్యూమన్ పాపిల్లో అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ HPV అనేది లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులలో ఒకటి. అయితే ఇది రాకుండా చూడాలంటే లైంగిక సంపర్కం జరగకముందే ఈ వ్యాక్సిన్ వేస్తే ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అందుకే టీనేజ్‌లో ఉన్నవారికి ఇది వేస్తే సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. ఈ కారణంతోనే 9-14 ఏళ్ల బాలికలకు వ్యాక్సినేషన్ ఇవ్వటం సరైన ముందు జాగ్రత్త చర్య.


ఇక లక్షణాల విషయానికి వస్తే..

నెలసరి సమయంలో యోని నుండి అధిక రక్తస్రావం, వెజైనల్ డిశ్చార్జి దుర్వాసనతో ఉండటం, లైంగిక చర్యలో పాల్గొన్న తర్వాత తీవ్రమైన నొప్పి, మూత్రవిసర్జన చేసే సమయంలో ఇబ్బంది, సంభోగం తర్వాత, పీరియడ్స్ మధ్య, పెల్విక్ పరీక్ష తర్వాత రక్తస్రావం. వ్యాక్సినేషన్ వేయించుకోకుండా క్యాన్సర్​ బారిన పడితే.. క్యాన్సర్​ను తొలగించడానికి శస్త్రచికిత్స చేయాల్సి వస్తుంది. మందులు, కిమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ మందులు ఉంటాయి. రేడియేషన్ థెరపీని కూడా చికిత్సలో భాగమే. అయితే ఈ క్యాన్సర్ ప్రారంభంలో దాని లక్షణాలు బయటపడవు. సమస్య పెరిగేకొద్ది దాని సంకేతాలు, లక్షణాలు బయటపడతాయి.

క్యాన్సర్ ను ఎలా గుర్తించాలంటే ..

గర్భాశయ క్యాన్సర్ ను గుర్తించటానికి కొన్ని పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో పాపానికోలౌ పరీక్ష దీనినే పాప్ స్మియర్ టెస్ట్ గా పిలుస్తారు. హై రిస్క్ (HR) HPV పరీక్ష ఇలా రెండు పరీక్షల ద్వారా దానిని గుర్తించవచ్చు. దీనిలో లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడతాయి కాబట్టి చాలా మంది మహిళలకు ఈ వ్యాధి వచ్చినట్లు కూడా తెలియదు.



గర్భాశయ క్యాన్సర్ కు టీకాలు..

ఆడపిల్లలు చిన్న వయసులోనే టీకాలు తీసుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తొమ్మిది సంవత్సరాల నుండి పదిహేనేళ్ల లోపు ఆడపిల్లలకు రెండు డోసుల టీకాలను వేయించాలి. పదిహేను సంవత్సరాల వయసు దాటిన ఆడపిల్లలు మూడు డోసులు తీసుకోవాలి. మొదటి డోసు తరవాత రెండు నెలలకు ఒకటి, ఆరునెలలకు మరొకటి చొప్పున మూడు డోసులు తీసుకోవాలి. సర్వైకల్‌ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను 45 ఏళ్ల వయసులోనూ తీసుకోవచ్చు అయితే పెళ్లికి ముందు ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

First Published:  2 Feb 2024 8:10 AM GMT
Next Story