Telugu Global
Health & Life Style

వర్షాకాలంలో చెవి సమస్యలకు చెక్ పెట్టేద్దాం ఇలా!!

వర్షంలో తడిచినప్పుడు నీరు చెవుల్లోకి దిగడం వల్ల, చల్లని వాతావరణం వల్ల చెవులు తొందరగా ఇన్ఫెక్షన్ లకు లోనవుతాయి.

వర్షాకాలంలో చెవి సమస్యలకు చెక్ పెట్టేద్దాం ఇలా!!
X

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కానీ నిజానికి మనిషికి ఉన్న ఇంద్రియాలలో ప్రతి ఒక్కటి ముఖ్యమైనదే. చూడగలగటం, వినడం, మాట్లాడటం మనం రోజూ చేసేపనులు. వీటిలో దేనికైనా ఆటంకం కలిగితే చాలా ఇబ్బంది పడవలసివస్తుంది. వేసవికాలం వచ్చి తన ప్రతాపం చూపించి వెళ్లినతరువాత అందరినీ పలకరించే వర్షాలు ఎంతో హాయిగా అనిపిస్తాయి. కానీ ఆ వర్షాలలో తడుస్తూ, తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉండేవాళ్లకు మాత్రం కొన్నిసమస్యలు ఎదురవుతాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల చెవి సంబంధ సమస్యలు ఎదురుకావడం కాస్త కలవరపెడుతున్న అంశం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ ఈ వానలు జలుబు, చెవి పోటు ఇబ్బందులు పలకరిస్తూనే ఉంటాయి. మరి వీటినుంచి ఏలా బయటపడాలి.

Advertisement

వర్షంలో తడిచినప్పుడు నీరు చెవుల్లోకి దిగడం వల్ల, చల్లని వాతావరణం వల్ల చెవులు తొందరగా ఇన్ఫెక్షన్ లకు లోనవుతాయి. తలస్నానం చేసినప్పుడు కానీ, వర్షంలో తడిచినప్పుడు కానీ తేమను సరిగ్గా తుడుచుకోకపోవడం వల్ల చెవులలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు తొందరగా వచ్చేస్తాయి. ఇవి చిన్నవయసు పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. అలా అని పెద్దవారికి రావనికాదు.. అందరిలో సాధారణంగా కనిపించే సమస్యే ఇది. మరి చెవిసంబంధిత సమస్యల గురించి, వాటికిగల కారణాలు, ఆ సమస్యలు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలైనవి తెలుసుకుందాం.

Advertisement

చెవి ఇన్ఫెక్షన్లకు కారణాలు!!

◆ చాలావరకు చెవిసంబంధ సమస్యలు జలుబు ద్వారా వస్తున్నవేనని వైద్యుల దగ్గరకు వస్తున్న కేసులు స్పష్టం చేస్తున్నాయి.

◆ జలుబు ఎక్కువైనప్పుడు తుమ్మడం, పదే పదే గట్టిగా చీదటం వల్ల చెవిలోపల ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి.

◆ స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా వంటి బాక్టీరియాలు చెవి ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి.

సాధారణ సమయాలలో చెవి సంబంధ సమస్యలు ఉన్నా వర్షాకాలంలో ఈ సమస్యల రేటు మరింత పెరుగుతుంది.

లక్షణాలు!!

◆ చెవి ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు చెవులు దిమ్మగా మూసుకుపోయినట్టు ఉంటాయి.

◆ చెవినొప్పి, చెవులలో నీరు కారడం వంటివి చోటుచేసుకుంటాయి.

◆ తలతిరగడం, తీవ్రమైన తలనొప్పి, జ్వరం మొదలైన సమస్యలుంటాయి.

◆ అన్నిటికంటే ముఖ్యంగా వినికిడి స్థాయి తగ్గినట్టు అనిపించడం గుర్తించవచ్చు.

చెవిసమస్యల నుండి దూరంగా ఉండటానికి జాగ్రత్తలు!!

సమస్యలు వచ్చిన తరువాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే సమస్యకు దూరంగా ఉండటం మొదట అందరూ చేయాల్సినది.

◆ చెవులు శుభ్రపరుచుకోవడం కోసం ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాలి.

◆ తలస్నానం చేయడానికి వెళ్ళేటప్పుడు కొబ్బరినూనెలో ముంచి పిండిన కాటన్ బాల్ ను చెవిలో పెట్టుకోవాలి, స్నానం తరువాత తీసేయాలి.

◆ తలస్నానం చేసినప్పుడు వర్షంలో తడిచినప్పుడు చెవులను శుభ్రంగా తుడుచుకోవాలి. మెత్తటి పొడిబట్టతో చెవి బయట భాగాన్ని శుభ్రం చేసుకోవాలి.

◆ అందరూ చేసే పెద్ద తప్పు చెవిలో గులిమి తీయడానికి ఇయర్ బడ్స్ ను వాడటం. అవి వాడటం మానుకోవాలి.

◆ చల్లని వాతవారణంలో కూర్చోకూడదు. కూర్చునే పరిస్థితి వస్తే చెవులకు వెచ్చగా ఏదైనా కప్పుకోవాలి.

◆ శీతల పానీయాలు, చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి.

◆ ఉప్పునీటితో నోటిని పుక్కిలించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే వెచ్చగా ఉన్న నీటిని తాగడం మంచిది.

◆ ఈమధ్య ప్రతి ఒక్కరూ ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. ఇయర్ ఫోన్స్ ఒకరి నుండి మరొకరు తీసుకుని వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

◆ చెవినొప్పి, చెవి నుండి నీరు కారడం, వినికిడి తగ్గడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు నేరుగా వైద్యుని దగ్గరకు వెళ్ళాలి. సొంతవైద్యం చేసుకోకూడదు.

◆ జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కు చీదడాన్ని నియంత్రించుకోవాలి.

◆ చెవి, ముక్కు, గొంతు సంబంధ సమస్యలలో ఏదైనా ఒకటి వస్తే మిగిలిన వాటికి ఆ ఇన్ఫెక్షన్ సోకె ప్రమాదం ఎక్కువ ఉంటుంది. నీటి ఆవిరి పట్టడం వల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తికాకుండా చేయడమే కాదు సమస్యను నివారించుకోవచ్చు.

రోజులో మన పనులు అన్నీ సాఫీగా జరిగిపోతున్నాయంటే అందరితో కమ్యూనికేషన్ సవ్యంగా జరగడమే. దానికి వినికిడి ఎంతో తోడ్పడుతుంది. అదే చెవిసంబంధ సమస్యలు ఏవైనా వచ్చి వినికిడిలోపం ఏర్పడితే చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది. అందుకే ఈ వర్షాకాలంలోనే కాదు మిగతా అన్ని కాలాలలో కూడా చెవిసంబంధ సమస్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Next Story