Telugu Global
Health & Life Style

ఇంట్లోనే రకరకాల వర్కవుట్స్.. ఇలా ప్లాన్ చేయొచ్చు!

వ్యాయామాల కోసం బయటకు వెళ్లలేని వాళ్లు ఇంట్లో ఉంటూనే ఫిట్‌గా ఉండేందుకు బోలెడు మార్గాలున్నాయి.

ఇంట్లోనే రకరకాల వర్కవుట్స్.. ఇలా ప్లాన్ చేయొచ్చు!
X

వ్యాయామాల కోసం బయటకు వెళ్లలేని వాళ్లు ఇంట్లో ఉంటూనే ఫిట్‌గా ఉండేందుకు బోలెడు మార్గాలున్నాయి. ఇంట్లోనే ఉంటూ రకరకాల స్టైల్స్‌లో వ్యాయామాలు చేసుకోవచ్చు. అదెలాగంటే..

వ్యాయామాలు చేసేవాళ్లలో చాలారకాల వాళ్లుంటారు. శరీరాన్ని అందంగా ఉంచుకోడానికి, కండలు పెంచడానికి జిమ్‌కు వెళ్లేవాళ్లు కొందరైతే...రెగ్యులర్‌‌గా యోగా క్లాసులకు వెళ్లేవాళ్లు మరికొందరు. అలాగే ఒబెసిటీ, షుగర్ లాంటి సమస్యలు ఉన్నవాళ్లు చాలామంది పార్క్‌ల్లో రోజూ వాకింగ్, రన్నింగ్ చేస్తుంటారు. అయితే.. ప్రతిరకమైన వర్కవుట్‌ను ఇంట్లోనుంచే చేసుకోవచ్చు.

షుగర్ పేషెంట్లకు..

ఒబెసిటీ, షుగర్ సమస్యలు ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయాలి. ముఖ్యంగా వయసు పైబడిన వాళ్లు వాకింగ్‌కు వెళ్లే వీలు లేనప్పుడు.. ఇంట్లోనే ట్రెడ్‌మిల్ వ్యాయామం చేసుకోవచ్చు. అదీ కుదరకపోతే ‘జాగ్‌ ఇన్‌ ప్లేస్, జంపింగ్ జాక్స్, స్టెయిర్ కేస్ ఎక్సర్‌‌సైజ్’లాంటి సింపుల్ కార్డియో వ్యాయామాలు చేసుకోవచ్చు. ఒకవేళ సైకిల్ అందుబాటులో ఉంటే సైక్లింగ్ కూడా మంచి ఆప్షనే.

వెయిట్ ట్రైనింగ్

యాభై ఏళ్ల లోపు ఉన్నవాళ్లు ట్రెడ్‌మిల్, సైక్లింగ్, కార్డియో వ్యాయామాలతో పాటు వెయిట్ ఎక్సర్‌‌సైజులు కూడా మిక్స్ చేసి చేయొచ్చు. డంబెల్స్, కెటిల్ బెల్స్‌తో ‘బేసిక్ చెస్ట్ ప్రెస్, లాటరల్ రైజ్, స్క్వాట్స్’ లాంటి వ్యాయామాలు చేయొచ్చు. వాటితో పాటు రెసిస్టెన్స్ బ్యాండ్‌ను ఉపయోగించి చేసే వ్యాయామాలు కూడా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అయితే వీటితో పాటు వామప్ కింద స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం మర్చిపోవద్దు

జిమ్‌కు వెళ్లేవాళ్లు

జిమ్‌కు వెళ్లేవాళ్లలో యూత్ ఎక్కువగా ఉంటారు. కొవ్వు కరిగించడం కోసం, కండలు పెంచడం కోసం చాలామంది జిమ్ వర్కవుట్స్‌ను ఎంచుకుంటారు. అయితే జిమ్‌లో చేసే హెవీ వర్కవుట్లను ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. డంబెల్స్, కెటిల్ బెల్స్, వెయిట్ లిఫ్టింగ్ లాంటి పరికరాలతో ఇంట్లోనే చాలారకాల జిమ్ వర్కవుట్లు చేసుకోవచ్చు. ఒకవేళ ఎలాంటి ఎక్విప్‌మెంట్ లేకపోతే.. హై ఇంటెన్సిటీ వర్కవుట్స్ ఎలాగూ ఉన్నాయి. ‘మూవింగ్ ప్లాంక్, బర్పీస్, స్కిప్పింగ్, మౌంటెన్ క్లైంబర్స్, పుషప్స్, పులప్స్, సిటప్స్, ఎయిర్‌‌స్క్వాట్స్’ లాంటి వ్యాయామాలతో టోటల్ బాడీకి కావల్సిన వ్యాయామం అందుతుంది.

కార్డియో కోసం..

వ్యాయామాలన్నింటిలో కార్డియో వ్యాయామాలు చాలా ప్రత్యేకం. టీనేజ్ నుంచి వయసు పైబడే దాకా అందరికీ కార్డియో వ్యాయామాలు పనికొస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని మిస్ చేయకూడదు. కార్డియో వ్యాయామాల కోసం అన్నింటికంటే ట్రెడ్ మిల్, హై ఇంటెన్సిటీ వ్యాయామాలు బెస్ట్ ఆప్షన్స్. వాటితో పాటు స్విమ్మింగ్ కూడా అన్ని వయసులవారికి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది వ్యాయామం చేస్తున్నట్టయితే ఏరోబిక్ వ్యాయామాలు కూడా ట్రై చేయొచ్చు. ఏరోబిక్ మ్యూజిక్ ప్లే చేస్తూ.. ఇంట్లోనే ఏరోబిక్ వ్యాయామాలు చేసుకోవచ్చు. ఏరోబిక్ డ్యాన్స్ వీడియోలు చూస్తూ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు.

జాగ్రత్తలు ఇలా..

ఇంట్లో వ్యాయామం చేసేటప్పుడు ఎక్కడపడితే అక్కడ చేయకుండా వ్యాయామం కోసం డెడికేటెడ్‌గా ఒక ప్లేస్‌ను కేటాయించాలి. రోజూ అదే ప్లేస్‌లో వ్యాయామం చేయాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజులకు ఆ ప్లేస్.. వర్కవుట్స్ ప్లేస్ లాగా అలవాటైపోతుంది. అక్కడికెళ్లగానే ఆటోమేటిక్‌గా కొంత మోటివేషన్ వస్తుంది.

వ్యాయామం చేసేచోట జిమ్ మ్యూజిక్, వర్కవుట్ మోటివేషన్ మ్యూజిక్ లేదా యోగా రిలాక్సింగ్ మ్యూజిక్స్ లాంటివి ప్లే చేస్తే..జిమ్ లేదా యోగా సెంటర్‌‌లో వ్యాయామం చేస్తున్న ఫీల్ వస్తుంది.

అలాగే వ్యాయామం కోసం రోజూ కచ్చితంగా ఒక టైంను కేటాయించాలి. రోజూ అదే టైంలో వ్యాయామం చేసేలా ప్లాన్ చేసుకోవాలి. వీలైనంత వరకూ తెల్లవారు జామున వ్యాయామాలు చేయడం బెటర్.

వ్యాయామానికి ముందు మంచి నీళ్లు, తర్వాత తీసుకోవాల్సిన డైట్ కూడా పక్కాగా ప్లాన్ చేసుకుని వర్కవుట్లు చేస్తే ఇంకా బాగుంటుంది.

వీటితోపాటు లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కడం, ఇంటి పనులు, తోటపని లాంటి వాటి వల్ల కూడా శరీరానికి కొంత వ్యాయామం అందుతుంది.

First Published:  10 Aug 2023 4:30 AM GMT
Next Story