Telugu Global
Health & Life Style

కేరళలో పెరుగుతున్న హెపటైటిస్-A కేసులు..మనమూ జాగ్రత్తపడదామిలా

వైద్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఏ బారిన పడే ప్రమాదం ఉంది. హెపటైటిస్ ఎ వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది.

కేరళలో పెరుగుతున్న హెపటైటిస్-A కేసులు..మనమూ జాగ్రత్తపడదామిలా
X

దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో హెపటైటిస్ ఏ విజృంభిస్తోంది. కేరళ ఈ వైరస్‌తో ఎంత తీవ్రంగా పోరాడుతోందంటే ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2024 సంవత్సరం మొదటి నాలుగున్నర నెలల్లో మొత్తం 1,977 హెపటైటిస్ ఎ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ఇప్పటికీ 12 మంది మరణించారు. మరో 5,536 అనుమానిత కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మలప్పురం, ఎర్నాకులం, కోజికోడ్‌, త్రిసూర్‌లలో ఈ కేసులు పెరుగుతున్నాయి. కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ఇంతకీ ఈ హెపటైటిస్ A అంటే ఏమిటి, ఈ వ్యాధి ఎలా ప్రాణాంతకంగా మారుతుంది ? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వైద్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఏ బారిన పడే ప్రమాదం ఉంది. హెపటైటిస్ ఎ వైరస్ కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే కామెర్లకు దారితీస్తుంది. ఇన్ ఫెక్షన్ ముదిరి కాలేయ వైఫల్యానికి కారణమవుతుంది. పరిస్థితి ముదిరితే కాలేయ మార్పిడి అవసరమవుతుంది. అయితే కొంతమంది బాధితుల్లో మాత్రం హెపటైటిస్ లక్షణాలు పెద్దగా కనిపించవని, వేగంగా కోలుకుంటారని డాక్టర్లు చెప్పారు కలుషితమైన ఆహారం, నీటి ద్వారా లేదా అంటువ్యాధి ఉన్న వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఇది వ్యాపిస్తుంది. రక్త మార్పిడి ద్వారా, గర్భిణి నుంచి పుట్టబోయే పిల్లలకు సంక్రమిస్తుంది. కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న వారితో పాటు మద్యపానం అలవాటు ఉన్న వారికి హెపటైటిస్ ఏ తో ముప్పు ఎక్కువ.

లక్షణాలు, జాగ్రత్తలు..

ఈ వ్యాధి వస్తే అలసట, కడుపునొప్పి, జ్వరం, వికారం, వాంతులు, విరేచనాలు, ఆకలి లేకపోవడం, దురద, కామెర్లు చర్మం, గోర్లు, కళ్లు, మూత్రం పసుపు రంగులోకి మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాచి చల్లార్చిన నీరు తాగడం, ఆహారం తీసుకోవడానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హైపటైటిస్ ఏ ను దూరం పెట్టొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

First Published:  18 May 2024 10:18 AM GMT
Next Story