Telugu Global
Health & Life Style

మహిళల్లో హార్ట్ ఎటాక్ లక్షణాలివే..

ఇంతకుముందు గుండెపోటు పురుషులకే వస్తుంది అనుకునేవాళ్ళం. కానీ మహిళలకు కూడా ఈ ప్రమాదం పెరుగుతోందని గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలే బయటపెడుతున్నాయి.

మహిళల్లో హార్ట్ ఎటాక్ లక్షణాలివే..
X

మహిళల్లో హార్ట్ ఎటాక్ లక్షణాలివే..

ఇంతకుముందు గుండెపోటు పురుషులకే వస్తుంది అనుకునేవాళ్ళం. కానీ మహిళలకు కూడా ఈ ప్రమాదం పెరుగుతోందని గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలే బయటపెడుతున్నాయి. తాజాగా కన్నడ నటుడు విజయ రాఘవేంద్ర భార్య ఇదే సమస్యతో మరణించినట్టు తెలుస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ చర్చ తెరమీదకి వచ్చింది. కరోనా తరువాత చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే మహిళల సంఖ్య దాదాపు 35 శాతం పెరిగినట్టు నిపుణులు చెబుతున్నారు.

జీవనశైలిలో మార్పులు, జన్యు లోపాలే దీనికి కారణం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించే మహిళలు కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. 50 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఉన్న పురుషులతో పోలిస్తే మహిళల్లోనే గుండెపోటు కారణంగా మరణించే వాళ్ళ సంఖ్య రెట్టింపు. అంతేకాదు ప్రతి ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు గుండె జబ్బుతోనే మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.

రక్తం చిక్కగా మారడం, శారీరక మానసిక ఒత్తిడితో పాటు హార్మోన్ల అసమతుల్యత దీనికి ప్రధాన కారణమని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు స్త్రీలలో కనిపించే లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

గుండెపోటుకు సంబంధించి పురుషులు, స్త్రీలల్లో లక్షణాల్లో స్వల్పంగా తేడాలుండవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గుండెకు రక్తం సరిగ్గా ప్రవహించలేనప్పుడు, చేతిలో బలహీనత మొదలవుతుంది. అప్పుడు చేతులు, కాళ్ళలో తిమ్మిరి, వంటి సమస్యలను వస్తాయి. తరచుగా ఇలా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

మాటల్లో స్పష్టత లోపించడం, విపరీతమైన ఆందోళన, అకస్మాత్తుగా అలసట, నీరసం కూడా గుండె పోటు లక్షణాలే.

దీర్ఘకాలిక మైగ్రేన్లు, స్ట్రోక్ ప్రమాదాన్ని 50 శాతం పెంచుతుంది. ఎప్పుడైనా అకస్మాత్తుగా భరించలేని తలనొప్పిని ఎదుర్కొంటే వెంటనే కార్డియాలజిస్ట్‌ను కూడా సంప్రదించవలసిందే.

గుండె జబ్బులకు సంబంధించి పురుషులతో పోలిస్తే మహిళలకు ఉండే లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. అలాగే మహిళలు తమకు వచ్చే ఈ నొప్పిని పెద్ద సీరియస్గా తీసుకోరు. ఇంటి పనులు ఆగిపోతాయని, పిల్లలకు ఇబ్బంది అవుతుందని, అబ్బా తగ్గిపోతుందిలే అని ఏదో చిన్న మాత్ర వేసేసుకొని గడిపేస్తారు. ఇలా ఉండటంవల్లే మహిళలలో ముప్పు పెరుగుతోంది అంటున్నారు నిపుణులు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నా లేకపోయినా, గుండె ఆరోగ్య విషయంలో ముందు నుంచి శ్రద్ధ వహిస్తూ ఆరోగ్యకరమైన జీవనసాగిన పాటిస్తే గుండె జబ్బులను దూరం పెట్టచ్చు అని చెబుతున్నారు.

First Published:  18 Aug 2023 5:15 AM GMT
Next Story