Telugu Global
Health & Life Style

తలస్నానం ఇలా చేస్తే జుట్టు పాడవ్వదు!

జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో తలస్నానం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అసలు తలస్నానం ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? రోజూ చేయొచ్చా? అనే విషయాల్లో చాలామందికి సందేహాలు ఉంటాయి.

తలస్నానం ఇలా చేస్తే జుట్టు పాడవ్వదు!
X

తలస్నానం ఇలా చేస్తే జుట్టు పాడవ్వదు!

జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో తలస్నానం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అసలు తలస్నానం ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? రోజూ చేయొచ్చా? అనే విషయాల్లో చాలామందికి సందేహాలు ఉంటాయి. వాటిని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం.

తలస్నానం విషయంలో చాలామందికి అపోహలు ఉంటాయి. కొందరికి రోజూ తలస్నానం చేసే అలవాటుంటే మరికొంతమంది వారానికి ఒకసారి తలస్నానం చేస్తుంటారు. అయితే తలస్నానం ఎప్పుడు చేయాలన్నది జుట్టు తత్వాన్ని బట్టి నిర్ణయించాలని నిపుణులు చెప్తున్నారు.

రోజూ బయటకు వెళ్లేవాళ్లు, పొల్యూషన్‌కు ఎక్స్‌పోజ్ అయ్యేవాళ్లు ఏరోజుకారోజు తలకు ఆయిల్‌ పెట్టుకుని తలస్నానం చేయడం మంచిది. అలాగే మాడు నుంచి తరచూ జిడ్డుకారుతుంటే లేదా రోజువారీ పనిలో తలలో చెమటలు పడుతుంటే రోజూ తలస్నానం చేయాలి. అయితే రోజూ తలస్నానం చేసేవాళ్లు షాంపుతో కాకుండా సాధారణ నీటితో తలను కడగాలి లేదా షీకాయ, కుంకుడుకాయ పొడి వాడుకోవచ్చు. అలాగే రోజూ తలస్నానం చేసేవాళ్లు రాత్రిళ్లు లైట్‌గా నూనె అప్లై చేసుకుంటే జుట్టు పొడిబారకుండా ఉంటుంది.

ఇంట్లో ఉండే వాళ్లు పదేపదే జుట్టుని కడగడం వల్ల... జుట్టు పొడిగా మారి క్రమంగా జుట్టు రాలడం ఎక్కువవుతుంది. ఇంట్లో ఉన్నా మాడు జిడ్డుగా మారుతున్న వాళ్లు వీలుని బట్టి రెండ్రోజులకోసారి తలస్నానం చేయొచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉన్నవాళ్లు సాధారణంగా మూడు రోజులకోసారి తలస్నానం చేస్తే మంచిదని నిపుణుల సలహా. ఒకవేళ తలలో ఎవైనా ఇన్ఫెక్షన్‌ల వంటివి ఉంటే డాక్టర్ సలహా మేరకు రోజూ తలస్నానం చేయొచ్చు.

ఇకపోతే తలస్నానానికి చాలామంది వేడినీళ్లు వాడుతుంటారు. దీనివల్ల కుదుళ్లు పలుచబడి జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తలస్నానానికి చన్నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లు బెటర్. వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల మాడుపై ఉండే సెన్సిటివ్ చర్మం పాడవుతుంది. నూనె గ్రంధులు పాడయ్యి, జుట్టు రఫ్‌గా తయారవుతుంది.

తలస్నానం చేసేటప్పుడు వీలైనంత తక్కువ షాంపూ వాడాలి. తలపై షాంపూని 30 సెకన్ల కంటే ఎక్కువసేపు ఉంచకూడదు. వేళ్లతో కుదుళ్లను రుద్దుతూ తలస్నానం చేయాలి. అలా చేయడం వల్ల కుదుళ్లలోని మట్టి వదులుతుంది. తలస్నానానికి షాంపూ కంటే నేచురల్ ప్రొడక్ట్స్ మంచివి. వీటితో ఎక్కువసేపు తలస్నానం చేసినా సమస్య ఉండదు.

First Published:  3 Oct 2023 1:32 PM GMT
Next Story