Telugu Global
Health & Life Style

జుట్టు రాలుతోందా.. చుండ్రు సమస్య కూడా అధికంగా ఉందా? ఈ హెయిర్ మాస్క్ మీకు మంచి పరిష్కారం

మాస్క్ వేసుకోవడం వల్ల సిల్కీ, మెరిసే, మృదువైన జుట్టు మన సొంతం అవుతుంది. దీంతో పాటు చుండ్రు కూడా తగ్గిపోతుంది. ఈ మాస్క్ మన జుట్టుకు మంచి పోషణను కూడా అందిస్తుంది.

జుట్టు రాలుతోందా.. చుండ్రు సమస్య కూడా అధికంగా ఉందా? ఈ హెయిర్ మాస్క్ మీకు మంచి పరిష్కారం
X

అందమైన, పొడవాటి, నిగనిగలాడే జుట్టు కావాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. ఒకప్పుడు కేవలం స్త్రీలే జుట్టుపై శ్రద్ధ పెట్టే వాళ్లు. కానీ ఇప్పుడు పురుషులు.. ముఖ్యంగా యువకులు జుట్టుపై చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే, జుట్టుకు సంబంధించి అనేక సమస్యలు మనకు ఎదురవుతుంటాయి. బయట ఎండ, దుమ్ము, ధూళిలో తిరగడం వల్ల పలు సమస్యలు వస్తాయి. నగరాల్లో పొల్యూషన్, లేట్‌నైట్ వర్క్, స్ట్రెస్ కారణంగా కూడా జుట్టు ఊడిపోతుంటుంది. అంతే కాకుండా చాలా మందిలో చిన్న వయసులోనే తెల్లని వెంట్రుకలు కనపడుతాయి. జుట్టుకు సంబంధించిన మరో పెద్ద సమస్య చుండ్రు. దీని వల్ల నెత్తిలో దురద కూడా వస్తుంటుంది. అయితే, ఈ సమస్యలను మన ఇంటిలోనే పరిష్కరించుకునే వీలుంది.

మనకు చాలా తక్కువ ధరకు లభించే కరివేపాకు జుట్టుకు సంబంధించిన పలు సమస్యలను తగ్గిస్తుంది. ప్రతీ రోజు కరివేపాకు తినడం వల్ల జుట్టు ఆహార్యం పెరుగుతుంది. అంతే కాకుండా కరివేపాకు మాస్క్‌ను జుట్టుకు వేస్తే చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టును బలంగా మార్చడంలో కరివేపాకు చాలా బాగా సహాయపడుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్, ప్రోటీన్స్ లభిస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని నియత్రిస్తుంటాయి.

కరివేపాకులో ఉండే యాంట్ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో పాటు విటమిన్ బి కూడా లభిస్తుంది. ఇది వెంట్రుకల్లో ఉండే ఫోలికల్స్‌కు అవసరం అయ్యే మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో జుట్టు తెల్లబడకుండా కాపాడుకోవచ్చు. జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలను దూరం చేసే ఔషధ గుణాలు కరివేపాకులో ఉన్నాయి. దీనిని రెగ్యులర్‌గా వాడటం వల్ల పొడవైన, నల్లని, మందమైన జుట్టు సొంతం అవుతుందని నిపుణలు చెబుతున్నారు. పైన చెప్పినవన్నీ కరివేపాకును పచ్చిగా లేదా ఎండబెట్టి తినడం వచ్చే లాభాలే. ఇక జుట్టుకు కరివేపాకు మాస్క్ పెట్టడం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయి.

ఒక పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేసి కొంచెం వేడి చేయండి. ఆ తర్వాత 15 నుంచి 20 రెమ్మల కరివేపాకు వేసి 3 నుంచి 4 నిమిషాల సేపు చిన్న సెగపై వేపండి. దాన్ని 20 నిమిషాల సేపు చల్లబరచండి. ఆ తర్వాత దాన్ని చక్కగా కలిపి జుట్టుకు మాస్క్ లాగా పెట్టుకోండి. రెండు చేతుల్లో సిద్ధం చేసి ఆయిల్‌ను తీసుకొని జుట్టు మూలాలకు బాగా దట్టించండి. ఆ తర్వాత గంట సేపు వెయిట్ చేసి శుభ్రమైన నీటితో కడిగేసుకోండి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తే జుట్టు సమస్యలు తీరిపోతాయి.

మాస్క్ వేసుకోవడం వల్ల సిల్కీ, మెరిసే, మృదువైన జుట్టు మన సొంతం అవుతుంది. దీంతో పాటు చుండ్రు కూడా తగ్గిపోతుంది. ఈ మాస్క్ మన జుట్టుకు మంచి పోషణను కూడా అందిస్తుంది.

నోట్: ఈ చిట్కాలు నిపుణులైన కొందరు తమ బ్లాగ్స్‌లో రాసుకున్న విషయాలు. పైన పేర్కొన్న పదార్థాలు మీ శరీరానికి సరిపోతాయా లేదా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనేది ముందుగా చెక్ చేసుకోండి. 'తెలుగుగ్లోబల్' ఈ చిట్కాలన్నీ కచ్చితంగా పని చేస్తాయని చెప్పడం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వహించదు.

First Published:  8 Oct 2022 10:30 AM GMT
Next Story