Telugu Global
Health & Life Style

వెల్లుల్లి రెబ్బలను వేడినీటిలో వేసి.. ఉదయాన్నే తాగితే వచ్చే ప్రయోజనాలు ఇవే

Garlic Water Benefits : వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ పారాసైట్ ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని ప్రాచీన కాలం నుంచి అత్యుత్తమ ఔషధంగా ఉపయోగిస్తున్నారు.

వెల్లుల్లి రెబ్బలను వేడినీటిలో వేసి.. ఉదయాన్నే తాగితే వచ్చే ప్రయోజనాలు ఇవే
X

వెల్లుల్లితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిల్వ పచ్చళ్లు మొదలు మాంసాహార వంటకాల వరకు వెల్లుల్లిని వాడుతుంటారు. ఇది వంటలకు రుచిని ఇవ్వడమే కాకుండా.. ఏవైనా పడని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే వాతాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని మంట, మొటిమల సమస్య, టాక్సిన్స్‌ను తగ్గిస్తుంది. వెల్లుల్లి జలుబు, ఫ్లూకి అద్భుతమైన రెమిడీగా ఆయుర్వేద వైద్యులు చెప్తుంటారు. అయితే వెల్లుల్లిని ఆహార పదార్థాలతో కాకుండా ఉదయం పరగడుపున తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

వెచ్చని నీటిలో వెల్లుల్లి రెబ్బలను వేసి ఉదయాన్నే తాగితే రక్తం శుద్ధి అవుతుంది. వెల్లుల్లిలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే శరీరంలో వచ్చే సీజనల్ ఇన్‌ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగు పరచడానికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది. ఉదయాన్నే వేడి నీటిలో వెల్లుల్లి రెబ్బలు వేసి తాగడం వల్ల శరీరంలో కొవ్వు తగ్గుతుంది. బ్లడ్ ప్రెజర్, షుగర్ లెవల్స్ నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.

వెల్లుల్లిలో పునరుజ్జీవన గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ ప్రభావం నుంచి రక్షిస్తాయి. చర్మంలో కొల్లాజెన్ కోల్పోవడాన్ని నెమ్మదిస్తుంది. దీని వల్ల వృద్ధుల చర్మంలో మడతలు తగ్గుతాయి. వెల్లుల్లి రెబ్బలే కాకుండా తొక్క కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే పూర్తిగా తొక్క తీయకుండా వేడి నీటిలో వేయడం మంచింది.

బరువు తగ్గాలనుకుంటే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ప్రయోజనం ఉంటుంది. ఇక పురుషుల్లో లైంగిక ఆరోగ్యం పెరగడంలో వెల్లుల్లి సహాయపడుతుంది. దీన్ని పచ్చిగా ఉదయాన్నే తింటే శక్తివంతమైన యాంటీ బయోటిక్‌గా పని చేస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఇది శరీరంలో చెమటను పెంచి శరీరాన్ని తాజాగా ఉంచుతుంది. ఇక శరీరంలో స్టామినాను కూడా పెంచుతుంది. గర్భిణి స్త్రీలు వెల్లుల్లి తినడం వల్ల తల్లిపాలు పెరుగుతాయి. అలాగే కఫాన్ని తగ్గించి.. శ్వాస సరిగా ఆడటంలో ఉపయోగపడుతుంది. జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది.

వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ పారాసైట్ ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని ప్రాచీన కాలం నుంచి అత్యుత్తమ ఔషధంగా ఉపయోగిస్తున్నారు. బాక్టీరియల్, ఫంగల్, పరాన్నజీవుల వ్యాధుల చికిత్సకు వెల్లుల్లిని యాంటీ బయోటిక్‌గా ఉపయోగిస్తారు. వెల్లుల్లి రసం టేప్‌వార్మ్ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్న పిల్లలకు చికిత్స చేయడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాల్లో తెలిసింది. ఇక గోరు వెచ్చని నీటిలో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తాగడం కష్టంగా ఉంటే కాస్త తేనె కలుపుకొని తాగితే రుచిగా ఉంటుంది. ప్రతీ రోజు 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలను ఇలా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

First Published:  25 Nov 2022 11:27 AM GMT
Next Story