Telugu Global
Health & Life Style

చిన్నవయసులో వ్యాయామాలు ... ఎన్నో క్యాన్సర్లకు చెక్

చిన్న వయసులోనే శారీరక వ్యాయామాలు చేసి ఫిట్ గా ఉన్నవారిలో పెద్దయిన తరువాత క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని, వీరికి పలురకాల క్యాన్సర్లనుండి రక్షణ దొరుకుతుందని ఓ నూతన అధ్యయనంలో తేలింది.

చిన్నవయసులో వ్యాయామాలు ... ఎన్నో క్యాన్సర్లకు చెక్
X

చిన్నవయసులో వ్యాయామాలు ... ఎన్నో క్యాన్సర్లకు చెక్

చిన్న వయసులోనే శారీరక వ్యాయామాలు చేసి ఫిట్ గా ఉన్నవారిలో పెద్దయిన తరువాత క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని, వీరికి పలురకాల క్యాన్సర్లనుండి రక్షణ దొరుకుతుందని ఓ నూతన అధ్యయనంలో తేలింది. శారీరకంగా చురుగ్గా ఉంటూ వ్యాయామం చేసేవారికి కొన్నిరకాల క్యాన్సర్ల ముప్పు తగ్గుతుందనే విషయం ఇంతకుముందు కూడా అనేక పరిశోధనల్లో తేలింది. ఇప్పుడు నిర్వహించిన నూతన అధ్యయనంలో ఏరోబిక్ వ్యాయామాలతో ఫిజికల్ ఫిట్ నెస్ సాధించినవారిలో 18 రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుందని తేలింది. రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్, కిక్ బాక్సింగ్, తాడాట వంటివన్నీ ఏరోబిక్ వ్యాయామాలే. ఈ అధ్యయన ఫలితాలను బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురించారు.

1968 నుండి 2005 మధ్యకాలంలో స్వీడన్ లో నిర్భంద సైనికులుగా పనిచేసిన 10,78,000 మంది మగవారి ఆరోగ్యస్థితులను పరిశీలించిన పరిశోధకులు ఈ అంశాలను వెల్లడించారు. వీరందరి సగటు వయసు 18 సంవత్సరాలు.

సైన్యంలో పనిచేసినవారిలో శారీరకంగా ఫిట్ గా ఉన్నవారిలో తల, మెడ, ఆహారనాళం, పొట్ట, పాంక్రియాస్, లివర్, కొలోన్, రెక్టమ్, కిడ్నీ, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గినట్టుగా గుర్తించారు. వ్యాయామం వలన గుండె ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నవారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం 42శాతం, లివర్ క్యాన్సర్ ప్రమాదం 40శాతం, ఆహారనాళపు క్యాన్సర్ ప్రమాదం 39శాతం తగ్గినట్టుగా పరిశోధకులు వెల్లడించారు.

శరీరంలోని పలు అవయవాలకు వచ్చే క్యాన్సర్లకు శారీరక ఫిట్ నెస్ కి మధ్య ఉన్న సంబంధంపై పరిశోధకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శారీరక ఫిట్ నెస్ కి జీర్ణవ్యవస్థలో వచ్చే క్యాన్సర్లకు మరింతగా సంబంధం ఉండటం శాస్త్రవేత్తలు గమనించారు. ఆహారం, ఆల్కహాల్, పొగతాగటం లాంటి అంశాలను ఈ అధ్యయనంకోసం పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం వ్యాయామం క్యాన్సర్లను ఎలా నిరోధిస్తుందనే అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.

ఈ ఫలితాలను బట్టి స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే పిల్లలకు గుండె ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఏరోబిక్ వ్యాయామాలు చాలా ముఖ్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బరువులు ఎత్తే వ్యాయామలకంటే రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి క్యాన్సర్ ముప్పుని తగ్గించడంలో మరింత బాగా పనిచేస్తున్నాయని కూడా అధ్యయనంలో చాలా స్పష్టంగా తేలింది. ఈ వ్యాయామాలతో క్యాన్సర్ల ముప్పే కాదు.. భావోద్వేగపరమైన ఆరోగ్యం సైతం బాగుపడుతుంది. అంటే మానసిక ఆరోగ్యానికి కూడా ఏరోబిక్ వ్యాయామాలు మేలు చేస్తాయి. దాంతో గుండెవ్యాధుల ముప్పుని తప్పించుకోవచ్చు.

శారీరక వ్యాయామాల్లో ఇదీ అదీ అని కాదు... ఏ రకమైన వ్యాయామం చేసినా మంచి ఆరోగ్యఫలితాలను పొందవచ్చని, ఏ వయసు నుండి వ్యాయామం మొదలుపెట్టినా దానితాలూకూ ప్రయోజనాలుంటాయని అందుకే తప్పకుండా అందరూ వ్యాయామం చేయాలని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు.

First Published:  18 Aug 2023 11:30 AM GMT
Next Story