Telugu Global
Health & Life Style

ఫ్యాటీ లివర్ కు కారణాలివే..

ఇటీవల కాలంలో కాలేయ సంబంధ వ్యాధుల రిస్క్ పెరిగింది. ప్రధానంగా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వేదిస్తున్నాయి.

ఫ్యాటీ లివర్ కు కారణాలివే..
X

ఇటీవల కాలంలో కాలేయ సంబంధ వ్యాధుల రిస్క్ పెరిగింది. ప్రధానంగా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వేదిస్తున్నాయి. శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలను బయటికి పంపడంతో పాటు ఎన్నో ముఖ్య పనులను నిర్వర్తిస్తుంది కాలేయం. మనం ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా ముఖ్యం అయినది. ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి లివర్‌ కీలకం. ముఖ్యమైన హార్మోన్లను, ఎంజైమ్‌లను తయారు చేస్తుంది.

ప్రోటీన్స్, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్‌ని జీవక్రియ చేసి, గ్లైకోజెన్, విటమిన్స్‌, ఖనిజాలను నిల్వ చేస్తుంది. అందుకే, ఎప్పటికప్పుడు లివర్‌ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే లివర్‌కి వచ్చే సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. కాలేయంలో కొవ్వు శాతం కొన్ని సందర్భాల్లో ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అంటారు. వైద్యపరంగా ఫ్యాటీ లివర్ అని పిలిచే ఈ పరిస్థితి రెండు కారణాలతో ఏర్పడుతుంది. మొదటిది ఆల్కహాలిక్, రెండోది నాన్ ఆల్కహాలిక్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా మద్యం తీసుకోవడం వల్ల సంభవిస్తుంది. అయితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మాత్రం జీవనశైలిలో మార్పుల వల్ల వస్తుంది.

ఈ రెండు సందర్భాల్లో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంట, మచ్చలు ఏర్పడతాయి. తర్వాతి దశలో ఇది కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి లక్షణాలు అధికమైతే కాలేయం వాపు, హెపటైటిస్‌, సిరోసిస్ వంటి వ్యాధులు వస్తాయి.



ఇలా చేస్తే మంచిది..

కాలేయ సంబంధిత వ్యాధులను ఆరంభ దశలోనే గుర్తించడమే కాకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు. మద్యం, డ్రగ్స్​కు దూరంగా ఉండాలి. మనం తాగే నీరు, తీసుకునే ఆహారం కలుషితం కాకుండా చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు తీసుకోవడం తగ్గించాలి. వెల్లుల్లి, బంగాళదుంప, బీట్ రూట్, క్యారెట్ లాంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్​-సీ అధికంగా లభించే ద్రాక్ష, యాపిల్, నిమ్మరసం వంటివి తీసుకోవాలి. సోడా, కూల్‌ డ్రింక్స్‌, ఎనర్జీ డ్రింక్స్‌ వంటి షుగర్‌ డ్రింక్స్‌లో ఫ్రెక్టోజ్‌ అధికంగా ఉంటుంది. ఇది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కి దారి తీస్తుంది. రోజుకు కనీసం 15 నిమిషాలు వ్యాయామం చేయాలని, బరువును అదుపులో పెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

First Published:  12 Feb 2024 4:13 PM GMT
Next Story