Telugu Global
Health & Life Style

శరీరం ఉబ్బిందా? నీటి బరువు కావొచ్చు!

శరీరంలో కొవ్వు శాతం పెరగడం కారణంగా లావుగా మారడం, బరువు పెరగడం సహజం. అయితే కొన్ని సందర్భాల్లో శరీరంలో నీటి శాతం పెరగడం మూలాన కూడా బరువు పెరుగుతుంటారు. దీన్నే ‘ఎడెమా’ లేదా ‘వాటర్ వెయిట్’ అంటారు.

శరీరం ఉబ్బిందా? నీటి బరువు కావొచ్చు!
X

శరీరంలో కొవ్వు శాతం పెరగడం కారణంగా లావుగా మారడం, బరువు పెరగడం సహజం. అయితే కొన్ని సందర్భాల్లో శరీరంలో నీటి శాతం పెరగడం మూలాన కూడా బరువు పెరుగుతుంటారు. దీన్నే ‘ఎడెమా’ లేదా ‘వాటర్ వెయిట్’ అంటారు. ఇది మామూలు ఒబెసిటీకి భిన్నంగా ఉంటుంది. దీనికై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చంటే..

శరీరంలో 70 శాతం నీరే ఉంటుందని మనకు తెలుసు. ఆరోగ్యంగా ఉండేందుకు తగినన్ని నీళ్లు తాగడం కూడా ఎంతో అవసరం అని డాక్టర్లు చెప్తుంటారు. అయితే కొన్నిసార్లు శరీరం అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటుంది. దీన్నే ఎడెమా అంటారు. దీనివల్ల పలు అవయవాల పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి వీలైనంత త్వరగా దీన్ని గుర్తించి సమస్యకు చెక్ పెట్టాలి.

శరీరం నీటిని ఎక్కువగా నిల్వ చేసుకున్నప్పుడు కాళ్లు, చేతులు ఉబ్బినట్లుగా అనిపిస్తాయి. దీన్ని నార్మల్ ఒబెసిటీలా తేలిగ్గా తీసుకోకూడదు. శరీరంలో నీరు చేరడం కారణంగా కిడ్నీలు దెబ్బతింటాయి. కండరాలు బలహీనపడతాయి. మామూలు ఒబెసిటీతో పోలిస్తే దీంతో ఎక్కువ నష్టాలు ఉంటాయి. కాబట్టి శరీరం ఉబ్బినట్టు కనిపిస్తుంటే వెంటనే నీరు పెరిగిందేమో టెస్ట్ చేయించుకోవాలి.

శరీరంలో సోడియం కటెంట్ పెరగడం ద్వారా అదనంగా నీరు వచ్చి చేరుతుంది. కాబట్టి ఎడెమాను తగ్గించుకునేందుకు శరీరంలో సోడియం శాతాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అంటే ఆహార పదార్థాల్లో ఉప్పుని బాగా తగ్గించాలి. ఎడెమా ఉన్నవాళ్లు కొన్నాళ్లు ఉప్పు లేని ఆహారాలు తీసుకుంటే మంచిది. అలాగే ఫాస్ట్ ఫుడ్స్, చిప్స్ జోలికి పోకూడదు.

శరీరంలో సోడియం కంటెంట్ తగ్గించుకునేందుకు పొటాషియం హెల్ప్ చేస్తుంది. పొటాషియం తీసుకోవడం ద్వారా శరీరంలోని మినరల్స్ బ్యాలెన్స్ అవుతాయి. అరటిపండ్లు, ఆకుకూరలు, అవకాడో, చిలగడదుంపలు వంటివి తీసుకోవడం ద్వారా పొటాషియం కంటెంట్ పెంచుకోవచ్చు.

శరీరంలో నీరు చేరిన వారు హై క్యాలరీ ఫుడ్స్‌ను తీసుకోకూడదు. రైస్, బ్రెడ్ వంటివి తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం ద్వారా శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగి నీరు మరింత నిల్వ ఉండే అవకాశం ఉంది.

ఇకపోతే శరీరంలో నీటి శాతం పెరిగింది కదా అని నీటిని తాగడం తగ్గించకూడదు. అదనంగా చేరిన నీటి శాతం తగ్గాలంటే రక్తప్రసరణ బాగా జరగాలి. దీనికోసం నీరు తగినంత తాగుతుండాలి. అలాగే నీటి శాతం ఉన్న ఆహారాలు తీసుకుంటుండాలి. దీంతోపాటు శారీరక శ్రమ కూడా ముఖ్యమే. వ్యాయామం చేయడం ద్వారా చెమట పట్టి అదనపు నీరు బయటకు పోతుంది.

First Published:  8 May 2024 12:30 AM GMT
Next Story