Telugu Global
Health & Life Style

బ్లాక్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదే

దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేయడంలో బ్లాక్ టీ చాలా ఆరోగ్యకరమైన అలవాటని సూచిస్తున్నారు. బ్లాక్ టీ నేరుగా తీసుకోవడం వల్ల పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే రసాయనాలు డైరెక్ట్‌గా శరీరంలోకి ప్రవేశిస్తాయి.

బ్లాక్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదే
X

ఆరోగ్యంపై ఈ మధ్య అందరికీ శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్ తర్వాత అందరికీ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఆందోళన ఎక్కువైంది. ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎలాంటి పానీయాలు తాగితే ప్రయోజనాలు ఉంటాయనే విషయంలో చాలా మంది నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గితే మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందని వైద్యులు చెప్పడంతో అనేక మంది దాన్ని తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నారు. మనిషి శరీరానికి ప్రయోజనం చేకూర్చే పానీయాలు (బేవరేజెస్) చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో బ్లాక్ టీ ఒకటి.

మన దేశంలో చాలా మందికి ఉదయాన్నే లేవగానే టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలా ఎక్కువ. అవి తాగడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుందని.. పొద్దున్నే కాలకృత్యాలు సాఫీగా సాగిపోతాయని నమ్ముతారు. వాస్తవానికి వాళ్లు అనుకునేది కొంత వరకు నిజమే. రోజుకు రెండు కప్పుల టీ తాగడం మానవ శరీరానికి మంచిదే. కానీ పాలు కలిపిన టీ తాగితే మాత్రం అనుకున్న ప్రయోజనాలు లభించవని పరిశోధకులు చెప్తున్నారు.

పాలు కలపని బ్లాక్ టీ (డికాక్షన్) తాగే వ్యక్తులు.. మిగతా వారి కంటే ఎక్కువ ఆయుష్షు కలిగి ఉంటారని చెప్తున్నారు. క్యాన్సర్ రోగులు పాలు కలిపిన టీ తాగడం కంటే బ్లాక్ టీ తాగితే ఆరోగ్యం బాగుంటుందని సూచిస్తున్నారు. క్యాన్సర్‌ను తగ్గించకపోయినా..కాస్త‌యినా ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. బ్లాక్‌ టీలో ఉండే సమ్మేళనాలు క్యాన్సర్ కణాలు తొలగిపోవడంలో సహకరిస్తాయని.. అదే సమయంలో పాలు కలపడం వల్ల ఆ మాలిక్యూల్స్ నాశనం అవుతాయని తేల్చారు.

దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేయడంలో బ్లాక్ టీ చాలా ఆరోగ్యకరమైన అలవాటని సూచిస్తున్నారు. బ్లాక్ టీ నేరుగా తీసుకోవడం వల్ల పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ అనే రసాయనాలు డైరెక్ట్‌గా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి మన శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గిస్తాయని వైద్యులు చెప్తున్నారు. బ్లాక్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్‌పై పడే ఒత్తిడిని తగ్గిచడంలో సహాయపడతాయి.

బ్లాక్ టీని పరిమితంగా తీసుకోవడం వల్ల ఎన్నిలాభాలు ఉంటాయో అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. దీనిలో ఉండే కెఫిన్ వల్ల నిద్రలేమి పెరుగుతుంది. అంతే కాకుండా గుండె కొట్టుకోవడం మరింత వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఆందోళన కూడా పెరిగి హై బీపీకి దారి తీసే అవకాశాలు ఉంటాయి. అందుకే బ్లాక్ టీని రోజకు ఒక కప్పుకు పరిమితం చేస్తే శరీరానికి చాలా మంచిదని వైద్యులు చెప్తున్నారు.

First Published:  29 Sep 2022 1:15 AM GMT
Next Story