Telugu Global
Health & Life Style

చలికాలం చర్మం పగులుతుందా? సెల్యులైటిస్ కావొచ్చు!

చలికాలం రకరకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. సాధారణ చర్మ పగుళ్లు, పొడి చర్మంతో పాటు కొంతమందికి సెల్యులైటిస్‌ అనే చర్మవ్యాధి కూడా వస్తుంటుంది.

చలికాలం చర్మం పగులుతుందా? సెల్యులైటిస్ కావొచ్చు!
X

చలికాలం రకరకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. సాధారణ చర్మ పగుళ్లు, పొడి చర్మంతో పాటు కొంతమందికి సెల్యులైటిస్‌ అనే చర్మవ్యాధి కూడా వస్తుంటుంది. డ్రై స్కిన్ సమస్య ఎక్కువగా ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అసలీ డిసీజ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సెల్యూలైటిస్ అనేది చర్మంపై వచ్చే బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌. చర్మంపై పగుళ్లు, చర్మం ఎర్రబడడం, వాపు, మంట వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. లక్షణాలను గమనించి ట్రీట్మెంట్ తీసుకోకపోతే క్రమంగా చర్మం ఎర్రబడి, వాపు ఎక్కువవుతుంది. కొంతమందిలో చర్మంపై గుంతలు, పొక్కులు, చర్మం పొరలుగా ఊడి రావడం వంటి లక్షణాలు కూడా కనిపించొచ్చు. సమస్య ముదిరినప్పుడు చలి జ్వరం వస్తుంది. దురద, మంట పెరుగుతాయి.

వీరిలో ఎక్కువ

రక్తపోటు, ఒబెసిటీ, కాళ్లవాపులు, డయాబెటిస్‌ ఉన్నవారికి, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు ఉన్నవారికి, ఇమ్యూనిటీ లోపించినవారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. అయితే చలికాలంలో ఈ సమస్యను ప్రేరేపించే బ్యాక్టీరియా మరింత పెరుగుతుంది. పొడిచర్మం సమస్య ఉన్నవారు చల్లగాలుల్లో తిరగడం వల్ల పొడిబారిన చర్మం బ్యాక్టీరియాకు ఎక్స్‌పోజ్ అయ్యి సెల్యులైటిస్‌కు దారితీస్తుంది. ఈ సమస్య చర్మంపై ఒకచోట నుంచి మిగతా చోట్లకు పాకుతుంది. అయితే ఇది అంటువ్యాధి కాదు. ఒకర్నుంచి మరొకరికి వ్యాపించదు.

జాగ్రత్తలు ఇలా..

పొడిచర్మం ఉన్నవాళ్లు ఈ సీజన్‌లో చర్మానికి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి.

వింటర్‌‌లో ఇమ్యూనిటీ తగ్గకుండా చూసుకోవాలి. డయాబెటిస్‌ ఉన్నవాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆల్కహాల్ అలవాటుని మానుకోవాలి. ఆహారంలో విటమిన్లు, మినరల్స్‌ ఉండేలా బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి.

చర్మ ఆరోగ్యానికి మేలు చేసే సిట్రస్ ఫ్రూట్స్, క్యారెట్స్, చేపలు, నట్స్ వంటివి తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. క్రమం తప్పకుండా స్నానం చేయాలి. మాయిశ్చరైజర్ లేదా నూనె వంటివి రాసుకోవాలి.

చర్మం పగిలిన చోట గిల్లడం, రుద్దడం వంటివి చేయకూడదు. ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలి. చల్లగాలులు తాకకుండా చూసుకోవాలి.

చర్మ సమస్యలు వచ్చినప్పుడు మరింత శుభ్రంగా ఉండాలి. డాక్టర్ సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

First Published:  14 Jan 2024 4:37 AM GMT
Next Story