Telugu Global
Health & Life Style

డాక్టరు గారూ... బీర్ లో ఆల్కహాల్ ఉంటుందా?

బీర్ తాగేవారు తాము ఆల్కహాల్ తీసుకోవటం లేదు కాబట్టి తమ ఆరోగ్యానికి ఏమీకాదనే నమ్మకంతో ఉంటున్నారని, కానీ బీర్ లో కూడా ఆల్కహాల్ ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Beer Contain Alcohol: బీర్ లో ఆల్కహాల్ ఉంటుందా?
X

డాక్టరు గారూ... బీర్ లో ఆల్కహాల్ ఉంటుందా?

ఈ ప్రశ్న తమని చాలామంది అడుగుతుంటారని వైద్యులు అంటున్నారు. బీర్ తాగేవారు తాము ఆల్కహాల్ తీసుకోవటం లేదు కాబట్టి తమ ఆరోగ్యానికి ఏమీకాదనే నమ్మకంతో ఉంటున్నారని, కానీ బీర్ లో కూడా ఆల్కహాల్ ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

డాక్టర్లు చెబుతున్న దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు....

బీర్, విస్కీ, రమ్, జిన్... వీటన్నింటిలో ఆల్కహల్ ఉంటుంది. ఇవి తాగినా ఆల్కహాల్ తాగినట్టే. అయితే వీటిలో ఆల్కహాల్ శాతం ఎంత ఉంది...అనే విషయంలో తేడాలుంటాయి. బీర్ లో 5శాతం ఆల్కహాల్ ఉంటే విస్కీలో నలభైశాతం ఉంటుంది. స్ట్రాంగ్ బీర్ లో మరింత ఎక్కువ శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ ని ఏ రూపంలో తీసుకున్నా, ఎంత తీసుకున్నా అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆల్కహాల్ తీసుకునేవారికి ఆరోగ్యానికి హాని చేయని మోతాదు అంటూ ఏమీలేదని పేర్కొంది. అంటే ఎంత తక్కువ ఆల్కహాల్ తీసుకున్నా అది ఆరోగ్యానికి హాని చేసే తీరుతుంది.

ఆల్కహాల్ వలన పనులను ప్లాన్ చేసుకునే ఆలోచనా శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం, మొత్తంమీద మెదడు పనితీరు మందగిస్తాయి. ప్రతిరోజు, అధిక మొత్తంలో ఏ రూపంలో ఆల్కహాల్ తీసుకున్నా అది ప్రమాదమే. దీనివలన కాలేయం పాడవటం, గుండెవ్యాధులు, కొన్నిరకాల క్యాన్సర్లు, అడిక్షన్ కి గురికావటం లాంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి.

ఆల్కహాల్ వలన లివర్ పాడైతే త్వరగా తెలుసుకోలేము..

ఆల్కహాల్ వలన లివర్ కి హాని కలుగుతుందని మనకు తెలుసు. అయితే చాలావరకు జబ్బు తీవ్రరూపం దాల్చే వరకు అది బయటపడదు. ముంబయిలోని గోద్రేజ్ మెమోరియల్ హాస్పటల్ కి చెందిన డాక్టర్ అద్రితా బెనర్జీ ‘దురదృష్టవశాత్తూ ఆల్కహాల్ వలన లివర్ పాడయినా ఆ లక్షణాలు పరిస్థితి తీవ్రమైన తరువాతే బయటపడతాయి’ అంటున్నారు. బద్దకం, ఆకలి లేకపోవటం, బరువుతగ్గిపోవటం, కళ్లు, చర్మం పసుపురంగులోకి మారిపోవటం, కాళ్లు మడమల్లో లేదా పొట్టలో వాపు, గందరగోళమైన మానసిక స్థితి, మత్తుగా ఉండటం, వాంతుల్లో లేదా విరేచినంలో రక్తంపడటం లాంటి లక్షణాలు కనబడతాయి.

లివర్ కి తీవ్రమైన హాని కలగకుండా నివారించాలంటే క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఆల్కహాల్ తాగేవారు తాము కొద్దిగానే తాగుతున్నామని, తరచుగా తాగటం లేదని, తాము దానికి బానిసలం కాదని, తమకు ఆల్కహాల్ వ్యసనంగా మారలేదనే ఆలోచనల్లో ఉండటం వలన కూడా లివర్ పాడయ్యే వరకు చికిత్స తీసుకోరని వైద్యులు చెబుతున్నారు. లివర్, ఇతర అవయవాలకు... ఎంత మోతాదులో తాగితే హాని కలుగుతుంది... అనేది అందరికీ ఒకేలా ఉండదు. కొంతమందికి చాలా తక్కువ మోతాదులో తాగినా లివర్ కి హాని కలుగుతుంది.

అలసట, బలహీనత, కుడివైపు పొట్ట పైభాగంలో నొప్పి, అసౌకర్యం, ఆకలి లేకపోవటం, బరువుతగ్గిపోవటం లాంటి లక్షణాలు ఉంటే ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు. లివర్ పాడయినప్పుడు మరింత ఆలస్యంగా కనిపించే లక్షణం కామెర్లు. కళ్లు, చర్మం పచ్చగా మారతాయి. ఈ లక్షణాలతో పాటు ఆహారంలో వ్యాయామంలో మార్పులేమీ లేకపోయినా బరువు తగ్గిపోతున్నా వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి. లివర్ కి పూర్తిగా హానికలిగేవరకు కాలయాపన చేయకుండా వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా తగిన పరీక్షలు చేయించుకోవటం మంచిది.

First Published:  22 May 2023 7:08 AM GMT
Next Story