Telugu Global
Health & Life Style

అట్లాంటిక్ డైట్ గురించి తెలుసా మీకు..

ఈ ఫుడ్ ప్రజల ఆరోగ్యం పై ఎలా ప్రభావం చూపిస్తుంది? ఎలాంటి మేలు కలిగిస్తుంది అనే విషయాలపై ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి.

అట్లాంటిక్ డైట్ గురించి తెలుసా మీకు..
X

ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకొనే చాలా మంది కొత్త కొత్త డైట్​ల విషయంలో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇప్పుడు మనం తెలుసుకొనే డైట్​ ఆరోగ్యానికే కాదు పర్యావరణానికి కూడా ప్రయోజనాలు అందిస్తుంది. అదే అట్లాంటిక్ డైట్. ఈ ఫుడ్ ప్రజల ఆరోగ్యం పై ఎలా ప్రభావం చూపిస్తుంది? ఎలాంటి మేలు కలిగిస్తుంది అనే విషయాలపై ఎప్పటినుంచో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయంపై JAMA నెట్​వర్క్ ఓపెన్ ట్రస్టెడ్ సోర్స్​లో ఓ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం ఇది మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయం చేస్తుంది.

ఇంతకీ మెటబాలిక్‌ సిండ్రోమ్‌ అంటే ఏమిటి?

మెటబాలిక్‌ సిండ్రోమ్‌ అనేది ఒక జీవనశైలి వ్యాధి. జీవక్రియలలో ఏర్పడే విపరీత పరిణామాల వల్ల కలిగే ఇబ్బందుల సమాహారం. ఈ ఇబ్బందులు దీర్ఘకాలిక జబ్బులైన గుండెపోటు, అధిక రక్తపోటు, షుగర్‌ వ్యాధికి దారితీస్తాయి. దీని ద్వారా మనిషి శరీరంలో చక్కెర స్థాయిలు పెరగడం, ఎక్కువ స్థాయిలో కొలెస్ట్రాల్‌ (కొవ్వు) ఏర్పడడం, అధిక రక్తపోటుతో పాటు పొత్తికడుపు చుట్టూ కొవ్వు పెరగడం వంటి లక్షణాలు లేదా వ్యాధులకు దారితీస్తుంది. మన దేశంలో 30 నుంచి 40 శాతం మంది మెటబాలిక్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారనేది ఒక అంచనా. ఇది అత్యంత పిన్న వయస్కులను అతి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుంది ఈ సిండ్రోమ్.


ఈ డైట్​లో ఏముంటాయంటే..

ఇది అత్యుత్తమై, ఆరోగ్యకరమైన డైట్‌ గా పేరున్న మెడిటరేనియన్ డైట్​కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ డైట్​లో తాజా కూరగాయలు, పండ్లకు మెజారిటీ ప్లేస్ ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ చాలా తక్కువ తృణధాన్యాలు, బీన్స్, ఆలివ్​ నూనెను వాడతారు. చేపలు, చీజ్, పాలు, మాంసం, వైన్​లు కూడా ఈ డైట్​ లో భాగమే. గ్రిల్లింగ్, బేకింగ్ లేదా స్టయింగ్ వంటి సాధారణ పద్ధతుల ద్వారా వీటిని వండుతారు. కొవ్వులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలకు దూరంగా ఉండాలని చెబుతారు.

ఉపయోగాలివే..

ఈ డైట్​ ఫాలో అవ్వడం వల్ల పొట్టలో కొవ్వు వేగంగా తగ్గుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అధిక రక్తపోటు, అధిక ట్రైగ్లిజరైడ్ స్థాయిలపై ప్రభావం చూపిస్తుంది. ఇది మధుమేహం సమస్యను కూడా కంట్రోల్ చేస్తుందని గుర్తించారు. ఈ డైట్‌ రోజూ తీసుకునే మహిళలల్లో.. గుండె సమస్యల ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి. అలాగే, మన ఆహారంలో సంతృప్త, ట్రాన్స్-ఫ్యాట్ వినియోగాన్ని పరిమితం చేయడానికి సహాయపడుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు, తద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయి. ఇది గుండె సమస్యలు, స్ట్రోక్‌ ముప్పును తగ్గిస్తుంది.


First Published:  15 Feb 2024 8:13 AM GMT
Next Story