Telugu Global
Health & Life Style

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి

నిద్ర లేమితో బాధపడే వారికి, ఎండల్లో ఎక్కువగా తిరిగే వారికి, పొగ ఎక్కువగా తాగే వారితో పాటు జెనెటికల్ కారణాలతో కూడా ఇలా నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.

Eye Dark Circles Tips In Telugu
X

కళ్ల కింద డార్క్ సర్కిల్స్ తగ్గించుకోవడానికి ఈ చిట్కాలు ట్రై చేయండి

మనం ఉత్సాహంగా ఉన్నామా? అలసిపోయామా? అనే విషయం మనం ముఖం చూస్తే తెలిసిపోతుంది. ముఖ్యంగా మన కళ్లు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో వెంటనే చెప్పేస్తాయి. అయితే ఎంత ఫ్రెష్‌గా తయారైనా కొంత మందికి కళ్ల కింద ఉండే డార్క్ సర్కిల్స్ ఇబ్బంది పెడుతుంటాయి. మారుతున్న జీవన శైలి.. విద్య, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండే ఒత్తిడి కారణంగా చాలా మంది కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు పిల్లలు, టీనేజర్లు మొబైల్స్, కంప్యూటర్లు ఎక్కువగా వాడుతుండటంతో వాళ్లకు కూడా డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి. ఇలా ఏర్పడటానికి చాలా కారణాలు ఉంటాయి.

నిద్ర లేమితో బాధపడే వారికి, ఎండల్లో ఎక్కువగా తిరిగే వారికి, పొగ ఎక్కువగా తాగే వారితో పాటు జెనెటికల్ కారణాలతో కూడా ఇలా నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. కళ్లకు సరైన విశ్రాంతి ఇవ్వడంతో పాటు ఒత్తిడి తగ్గించుకుంటే చాలా వరకు డార్క్ సర్కిల్స్ ఏర్పడవని నిపుణులు చెప్తున్నారు. డార్క్ సర్కిల్స్ కారణంగా చిన్న వయసు వాళ్లు కూడా వయసు మళ్లిన వారిలాగా కనపడుతుంటారు. ఆడవాళ్ల అందానికి ఇవి చాలా ఇబ్బందిగా ఉంటాయి. డార్క్ సర్కిల్స్ వస్తున్నాయనే బాధతో, ఆందోళనతో కూడా అవి మరింతగా పెరుగుతాయని డాక్టర్లు చెబుతున్నారు.

ఇక నిత్యం ఎలర్జీలతో బాధపడేవారు, జలుబు, సైనసైటిస్ వంటి సమస్యలు ఉండే వారికి కంటి కింద నల్లటి వలయాలు త్వరగా ఏర్పడతాయి. పోషకాహార లోపం కారణంగా కూడా ఈ సమస్య అధికమవుతుంది. అందుకే చక్కని ఆహారం, సరైన సమయానికి నిద్ర ఈ సమస్యను మామూలుగానే పరిష్కరిస్తుంది. అయితే, కొన్ని ఇంటి చిట్కాలతో కూడా డార్క్ సర్కిల్స్ నయం చేసుకునే అవకాశం ఉన్నది.

కంటి కిందటి నల్లని వలయాలకు టీ బ్యాగ్ థెరపీ మంచిగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం ప్రతీ రోజు టీ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన పొడిని ఒక దగ్గర భద్రపరుచుకోవాలి. దాన్ని ఒక చిన్నని క్లాత్ బ్యాగ్‌లో వేసి దాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టి కూల్ చేయాలి. బ్యాగ్ చాలా చల్లబడిన తర్వాత దాన్ని కళ్లు మొత్తం కవర్ చేసేలా (రెండు బ్యాగ్‌లు అయితే మంచిది) పెట్టుకోవాలి. టీలో ఉండే కెఫిన్ కంటి చుట్టు ఉండే సున్నితమైన రక్తనాళాలపై ప్రభావం చూపిస్తుంది. ప్రతీ రోజు 15 నుంచి 20 నిమిషాల పాటు ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కంటి చుట్టూ నల్లని చారలు తగ్గిపోతాయి. రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ప్రభావం ఉంటుంది.

మిల్క్ మసాజ్ కూడా నల్లటి వలయాలు తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. పాలను ఫ్రిజ్‌లో పెట్టి చాలా చల్లగా అయ్యేలా చేయాలి. తర్వాత ఆ చల్లని పాలతో కంటి చుట్టు నెమ్మదిగా మసాజ్ చేయాలి. ప్రతీ కంటి వైపు అరగంట మసాజ్ చేయాలి. ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ పోవడమే కాకుండా కంటి చుట్టూ నిగనిగలాడే చర్మం తయారవుతుంది. రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవడం, నీళ్లు ఎక్కవగా తాగడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు.

First Published:  17 Oct 2022 10:45 AM GMT
Next Story