Telugu Global
Health & Life Style

పెరుగు మంచిదా.! మజ్జిగ మంచిదా.! ఆయుర్వేదం ఏమి చెబుతోంది?

curd or buttermilk which is better: పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. గోరు వెచ్చిని పాలను పులియబెట్టడం వల్ల పెరుగు తయారవుతుంది.

పెరుగు మంచిదా.! మజ్జిగ మంచిదా.! ఆయుర్వేదం ఏమి చెబుతోంది?
X

పాలు, పెరుగు, మజ్జిగ.. ఇవన్నీ ఒకే మూలం నుంచి వచ్చే ఉత్పత్తులు. పశువులు ఇచ్చే పాల నుంచే పెరుగు, మజ్జిగను తయారు చేస్తారన్న విషయం తెలిసిందే. వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే. కానీ మూడు పదార్థాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని.. ప్రతీ పదార్థానికి తనదైన భిన్నమైన పోషకాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. పెరుగు మంచిదా.. మజ్జిగ మంచిదా అంటే కూడా చాలా మంది కచ్చితంగా చెప్పలేరు. కానీ, ఆయుర్వేద నిపుణులు మాత్రం మజ్జిగే మనకు మంచిదని చెబుతున్నారు. దానికి కారణాలు కూడా వెల్లడిస్తున్నారు.

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. గోరు వెచ్చిని పాలను పులియబెట్టడం వల్ల పెరుగు తయారవుతుంది. పొట్టలోని ఆమ్లాలు వేడిగా ఉంటాయి. కాబట్టి మనం పెరుగును తీసుకోవడం వల్ల పేగులు మరింత వేడెక్కుతాయని నిపుణులు చెబుతున్నారు. కానీ, పెరుగు నుంచి వచ్చే మజ్జిగ మాత్రం శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా మజ్జిగ అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటుంది. పెరుగు కంటే మజ్జిగ మానవ శరీరానికి సరిగా సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరం యొక్క ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచడంలో తోడ్పాటు అందిస్తుందని అంటున్నారు.

పెరుగును ఊబకాయం, కఫం వంటి రుగ్మతలు ఉన్న వాళ్లు తీసుకోకూడదని చెబుతున్నారు. అలాగే రక్తస్రావం, వాపు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్లు పెరుగుకు దూరంగా ఉండటమే మంచిది. రాత్రి పూట పెరుగు అసలే తినకూడదని ఆయుర్వేదం నొక్కి చెబుతోంది. ఇది జలుబు, దగ్గు, సైనస్‌లను ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. ఒక వేళ పెరుగు తినకుండా ఉండలేకపోతే దాంట్లో కాసింత మిరియాలు లేదా మెంతులు వేసుకొని తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మజ్జిగ మన శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో పెరుగు కంటే ఎక్కువ తోడ్పడుతుంది. జీర్ణ శక్తిని మెరుగు పరచడంతో మజ్జిక ఉపయోగపడుతుంది. వాపు, జీర్ణకోశ సమస్యలు, ఆకలి లేమి సమస్యలు, రక్త హీనతను నివారించడంలో మజ్జిగ సహాయం చేస్తుంది. చలికాంలో చాలా మందికి వచ్చే అజీర్ణ సమస్యలను మజ్జిగ తీరుస్తుంది.

మలబద్దకం, గ్యాస్ట్రిక్ ట్రబుల్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు ఉన్న వాళ్లు మజ్జిగ తీసుకోవడం మంచిది. బరువు తగ్గేందుకు కూడా మజ్జిగ సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు తెలియ చేశాయి. రాబోయేది వేసవి కాలం కాబట్టి.. డీహైడ్రేషన్‌కి ఎవరైనా గురైతే నిమ్మరసం కంటే చాలా పలుచనైన మజ్జగ తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

First Published:  3 Feb 2023 3:27 PM GMT
Next Story