Telugu Global
Health & Life Style

పగిలిన మడమలకు పరిష్కారం.. ఇంట్లో ఈజీగా చేసుకునే ఈ చిట్కాలు గమనించండి

అరటి పండు ఉపయోగించి కూడా పగుళ్లను తగ్గించవచ్చు. అరటి పండును గుజ్జులాగా చేసి పగిలిన మడమలపై రాయాలి. ఓ 20 నిమిషాల పాటు అలాగే ఉంటి చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా పగుళ్లను తగ్గించవచ్చు

పగిలిన మడమలకు పరిష్కారం.. ఇంట్లో ఈజీగా చేసుకునే ఈ చిట్కాలు గమనించండి
X

ప్రతీ ఒక్కరికి అందమైన శరీరాకృతి, మంచి స్కిన్ టోన్ కావాలని కోరుకుంటారు. ఎవరైనా సరే మన ముఖాన్నే ముందుగా చూస్తారు కాబట్టి.. దానిపై చాలా శ్రద్ద చూపిస్తారు. ఆడవాళ్లు చక్కని, మెరిసే ముఖం కోసం చాలా కష్టాలు పడుతుంటారు. ఫంక్షన్లకు వెళ్లినా, ఇతర ప్రత్యేక కార్యక్రమాలకు వెళ్లినా ముఖానికి అందంగా మేకప్ చేసుకొని, చక్కని బట్టలు వేసుకొని వెళ్తారు. అయితే మన ముఖంపై చూపించే శ్రద్ధలో కనీసం 10 శాతం కూడా చాలా మంది పాదాలపై చూపించరని తెలుస్తోంది. అప్పుడప్పుడూ పెడిక్యూర్ చేయించుకొని చాలా మంది సంతృప్తి పడుతుంటారు. కానీ నిత్యం ఇంటి పనుల్ల, నీటిలో పని చేసేవారి పాదాలపై చాలా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మడమలు పగిలి అసహ్యంగా కనపడటమే కాకుండా.. నొప్పి కూడా కలుగజేస్తుంటాయి.

కాలి పగుళ్లకు చాలా మంది డాక్టర్ల వద్దకు వెళ్లరు. చిన్నదే కదా అని ఏ వ్యాజిలిన్‌ రాసుకొనో సంతృప్తి పడుతుంటారు. అయితే కాలి మడమల పగుళ్ల కోసం డాక్టర్ వద్దకు వెళ్లడానికి మొహమాట పడేవాళ్లు ఇంట్లోనే కొన్ని చిట్కాలు అనుసరించి చికిత్స చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాల వల్ల కాలి మడమల పగుళ్లు తగ్గి, పాదాల ఆరోగ్యం మెరుగు పడుతుంది. అయితే తీవ్రమైన సమస్యలకు మాత్రం డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందే.

పొడి పాదాలు ఉన్నవారిలోనే ఎక్కువగా మడమల పగుళ్లు ఏర్పడతాయి. ఇవి చూడటానికి అసహ్యంగా కనపడటమే కాకుండా చికాకు, నొప్పిని కలుగజేస్తాయి. అలాంటివాళ్లు ప్రతీ రోజు రాత్రి పాదాలను వెచ్చని క్లాత్ టవల్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత వెజిటెబుల్ ఆయిల్ పాదాలపై రాసుకొని సాక్స్ ధరించి పడుకోవాలి. ఇలా రోజూ చేస్తే పగుళ్లు వాటంతట అవే మాయం అవుతాయి.

ఇక అరటి పండు ఉపయోగించి కూడా ఈ పగుళ్లను తగ్గించవచ్చు. అరటి పండును గుజ్జులాగా చేసి పగిలిన మడమలపై రాయాలి. ఓ 20 నిమిషాల పాటు అలాగే ఉంటి చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా పగుళ్లను తగ్గించవచ్చు. లేదంటే వెచ్చని నీటిలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి పాదాలను అందులో 20 నిమిషాల సేపు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉండే మృత కణాలు తొలగిపోతాయి. అలాగే పగుళ్ల మధ్య ఉండే మురికి కూడా పోతుంది. కాళ్లు శుభ్రపడతాయి. క్రమంగా పగుళ్లు కూడా తగ్గి పాదాలు ఆకర్షణీయంగా కనపడతాయి.

ఒక టేబుల్ స్పూన్ పెట్రోలియం జెల్లీలో స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసిన పాదాలకు ఆ మిశ్రమాన్ని పట్టించి బాగా మర్దనా చేయాలి. మిశ్రమం పాదాలు పూర్తిగా గ్రహించే వరకు వేచి చూసి.. తర్వాత సాక్స్ ధరించాలి. ఉదయాన్ని సాక్స్ తీసి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రతీ రోజు ఇలా చేస్తే పాదాలు మెత్తగా తయారవడమే కాకుండా పగుళ్లు కూడా పోతాయి.

పాదాలపై ఉండే మృత కణాలు తొలగించడానికి మరో పద్దతి కూడా ఉంది. 3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను నీటిలో కలిపి పాదాలను అందులో 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత పగుళ్లు ఏర్పడిన దగ్గర ఫ్యూమిస్ స్టోన్‌తో స్క్రబ్ చేయాలి. దీంతో మృత కణాలు పూర్తిగా తొలగిపోతాయి. అలోవెర జెల్‌ను రాత్రి పాదాలకు రుద్ది సాక్స్ ధరించాలి. ప్రతీ రోజు ఇలా అలోవెరా రాయడం వల్ల పగుళ్లు తగ్గి పాదాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

నోట్: ఈ చిట్కాలు నిపుణులైన కొందరు తమ బ్లాగ్స్‌లో రాసుకున్న విషయాలు. పైన పేర్కొన్న పదార్థాలు మీ శరీరానికి సరిపోతాయి లేదా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనేది ముందుగా చెక్ చేసుకోండి. 'తెలుగు గ్లోబల్' ఇవన్నీ కచ్చితంగా పని చేస్తాయని చెప్పడం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వహించదు.

First Published:  7 Oct 2022 9:23 AM GMT
Next Story