Telugu Global
Health & Life Style

ఒమిక్రాన్‌లో కొత్త వేరియంట్!

కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన జన్యు రూపాన్ని మార్చుకొని మనుగడ సాగిస్తోంది. తాజాగా ఇంగ్లండ్‌లో ‘ఒమిక్రాన్‌ బీఏ.4.6’ అనే కొత్త రకం వేరియంట్ వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒమిక్రాన్‌లో కొత్త వేరియంట్!
X

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ ప్రస్తుతానికి అదుపులోనే ఉన్నా దాని వేరియంట్లు మాత్రం పుడుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన జన్యు రూపాన్ని మార్చుకొని మనుగడ సాగిస్తోంది. తాజాగా ఇంగ్లండ్‌లో 'ఒమిక్రాన్‌ బీఏ.4.6' అనే కొత్త రకం వేరియంట్ వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు నెలలో ఇంగ్లండ్‌లో పరీక్షించిన కొవిడ్‌ నమూనాల్లో 3.3శాతం ఒమిక్రాన్‌ బీఏ.4.6 వేరియంట్‌ కేసులు ఉన్నాయని బ్రిటన్‌ హెల్త్ సేఫ్టీ ఏజెన్సీ ప్రకటించింది. యుకెతో పాటు అమెరికాలో కూడా ఈ కొత్త వేరియంట్‌ వ్యాప్తిలో ఉన్నట్లు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చెప్తోంది. ఇక ఈ రెండు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ వేరియంట్‌ ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒమిక్రాన్‌ బీఏ.4.6 అనేది ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన కొత్త వేరియంట్. ఈ ఏడాది జనవరిలో బీఏ.4ను దక్షిణాఫ్రికాలో మొదటగా గుర్తించారు. అప్పటి నుంచి ఈ వేరియంట్‌తోపాటు బీఏ.5 కూడా ప్రపంచంలో చాలా దేశాల్లో వ్యాప్తిలో ఉన్నాయి. అయితే బీఏ.4.6 వేరియంట్‌ ఎలా పుట్టింది అనే విషయంపై స్పష్టత లేదు. అయితే, కొన్ని వేరియంట్ల కలయిక వల్ల ఈ వేరియంట్‌ పుట్టుకొచ్చినట్లు నిపుణులు అంటున్నారు. ఒకేవ్యక్తికి, ఒకేసారి రెండు కరోనా వేరియంట్లు సోకితే ఇలా మూడో కాంబినేషన్ పుట్టొచ్చని చెప్తున్నారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ లాగానే బీఏ.4.6 కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరణాలు కూడా స్పల్పంగానే ఉన్నాయని చెప్తున్నారు. అయితే వ్యాక్సినేషన్‌ వల్ల ఇలాంటి వేరియంట్ల నుంచి రక్షణ ఉంటుందని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు.

First Published:  16 Sep 2022 3:59 PM GMT
Next Story