Telugu Global
Health & Life Style

మేన‌రికం వివాహాల‌తో పుట్టే బిడ్డ‌ల్లో కంటి జ‌బ్బులు

మేన‌రికం వివాహాలు చేసుకోవ‌ద్ద‌ని, దానివల్ల పుట్టే బిడ్డ‌ల్లో ర‌క‌ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని వైద్య‌నిపుణులు ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు.

మేన‌రికం వివాహాల‌తో పుట్టే బిడ్డ‌ల్లో కంటి జ‌బ్బులు
X

మేన‌రికం వివాహాలు చేసుకోవ‌ద్ద‌ని, దానివల్ల పుట్టే బిడ్డ‌ల్లో ర‌క‌ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని వైద్య‌నిపుణులు ఎప్ప‌టి నుంచో చెబుతున్నారు. అయినా ర‌క్త‌సంబంధం అనో, ఆస్తులు బ‌య‌టికి పోకూడ‌ద‌నో ఏవేవో కార‌ణాల‌తో ఇప్ప‌టికీ మ‌న దేశంలో ముఖ్యంగా ద‌క్షిణాదిలో మేన‌రిక వివాహాలు పెద్ద సంఖ్య‌లోనే జ‌రుగుతున్నాయి. మేనరికం, దగ్గర బంధువుల మధ్య వివాహాల కారణంగా వారికి పుట్టబోయే పిల్లలకు జన్యు వ్యాధులతోపాటు నేత్రాలకు సంబంధించిన సమస్యలు సంక్రమించే ముప్పు ఉందని ఎల్వీప్రసాద్ ఆసుపత్రి తాజా అధ్యయనంలో తేలింది. వంశపారంపర్య కంటి వ్యాధుల(హెరిడిటరీ ఐ డీసీజెస్-హెచ్ఐడీ)పై అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

రెటీనా, కార్నియా, కంటి న‌రాల్లో స‌మ‌స్య‌లు

రక్త సంబంధీకులు, దగ్గర బంధువుల మధ్య జరిగే వివాహాలు చేసుకున్న‌వారితోపాటు వంశపారంపర్యంగా నేత్ర సమస్యలు ఉన్న వారికి పుట్టే పిల్లలకు రెటీనా, కార్నియా, కంటి నరాలకు సంబంధించిన సమస్యలు వ‌స్తాయ‌ని చెప్పింది.బలహీనమైన దృష్టి, కంటిలో ఒత్తిడి పెరగడం, పగలు లేదా రాత్రి సమయాల్లో సక్రమంగా చూడలేకపోవడం వంటి సమస్యలూ వేధిస్తాయని అధ్యయనంలో తేలింది. కార్నియాలో మచ్చలు, శుక్లాలు, గ్లకోమా, రెటినైటిస్ పిగ్మెంటోసా సమస్యలు తలెత్తే ముప్పు ఎక్కువ.. ఇవి కంటి చూపును పూర్తిగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.

జ‌న్యుప‌రీక్ష‌ల ద్వారా తెలుసుకుని నివారించ‌వ‌చ్చు.

కుటుంబ చరిత్రలో హెచ్ఐడీ ఉన్న జంటలకు జన్యు పరీక్షలు చేయించుకుంటే పుట్టే పిల్లలు జన్యుపరమైన నేత్ర సమస్యల బారిన పడకుండా చూసుకోవడానికి వీలుంటుంద‌ని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ వైద్యులు డా.మంజుశ్రీ భాతే చెప్పారు. ముందే గుర్తించడం వల్ల శస్త్ర చికిత్సలు, ఔషధాల ద్వారా నివారించవచ్చ‌ని ఆమె సూచించారు.

First Published:  12 April 2024 7:32 AM GMT
Next Story