Telugu Global
Health & Life Style

క్యాన్స‌ర్ ముప్పు : ఆ మార్పుల‌ను తేలిగ్గా తీసుకోవ‌ద్దు

అధికారిక సమాచారం ప్రకారం.. తల, మెడ, ఊపిరితిత్తుల క్యాన్సర్లు పురుషులలో సర్వసాధారణం కాగా, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ మహిళల్లో సర్వసాధారణం. పెద్ద పేగు క్యాన్సర్‌లు పెరుగుతున్న ధోరణి కూడా ఉంది.

క్యాన్స‌ర్ ముప్పు : ఆ మార్పుల‌ను తేలిగ్గా తీసుకోవ‌ద్దు
X

భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అత్యంత సాధార‌ణంగా వ‌స్తున్న క్యాన్స‌ర్లు ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్లు కావ‌డం గ‌మ‌నార్హం. 2022 ఏడాది లెక్క‌ల ప్ర‌కారం భార‌త్‌లో దాదాపు 14,16,427 మంది క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు గుర్తించారు. ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప‌లు అంచ‌నాలు చెబుతున్నాయి.

క్యాన్సర్ అనేది అతి పెద్ద మాస్క్వెరేడర్లలో ఒకట‌ని అమృత హాస్పిటల్ మెడిక‌ల్ ఆంకాల‌జీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ ఎంపీ రాకేష్ చెబుతున్నారు. దీనిని గుర్తించ‌డంలో ఆల‌స్యం జ‌రిగే అవ‌కాశాలే ఎక్కువ‌ని ఆయన అంటున్నారు. మెజారిటీ కేసుల్లో ఈ వ్యాధికి సంబంధించిన సంకేతాలు, ల‌క్ష‌ణాలు వ్యాధి ముదిరిపోయే వ‌ర‌కు అంటే అడ్వాన్స్‌డ్ స్టేజీకి చేరే వ‌ర‌కు స్ప‌ష్టంగా క‌నిపించ‌వని చెబుతున్నారు. ఎవరికైనా రక్తస్రావం, నొప్పి, దగ్గు త‌దిత‌ర‌ అసాధారణ లక్షణాలు కనిపించినప్పుడల్లా లేదా ఇతరులు గమనించినట్లుగా శరీర అలవాట్లు లేదా అసాధార‌ణంగా బ‌రువు త‌గ్గ‌డం వంటి మార్పులు వ‌చ్చిన‌ప్పుడు వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం మంచిద‌ని సూచిస్తున్నారు.

కుటుంబ చ‌రిత్ర‌దీ కీల‌క పాత్రే..

గ‌తంలో కుటుంబంలోని ఎవ‌రికైనా క్యాన్స‌ర్ వ‌చ్చి ఉంటే దానిని బ‌ట్టి కూడా క్యాన్స‌ర్ ప్ర‌మాదాన్ని అంచ‌నా వేయ‌వ‌చ్చని డాక్ట‌ర్ రాకేష్ చెబుతున్నారు. జ‌న్యు ప‌రీక్ష ద్వారా స‌మీప బంధువుల్లో క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాల‌ను అంచ‌నా వేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు. రొమ్ము, అండాశ‌యం, పెద్ద పేగు, ప్రొస్టేట్‌, ప్యాంక్రియాటిక్ క్యాన్స‌ర్ల‌లో జ‌న్యు ప‌రీక్ష ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంద‌ని పేర్కొంటున్నారు. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు, సలహాలిచ్చేందుకు జ‌న్యు ప‌రీక్ష వైద్యుడికి స‌హాయం చేస్తుంద‌ని డాక్ట‌ర్ ఎంపీ రాకేష్ చెబుతున్నారు.

స్ప‌ష్ట‌మైన కార‌ణాలు లేకున్నా..

కొన్ని కేసుల్లో ఎలాంటి స్ప‌ష్ట‌మైన కార‌ణం లేకుండానే క్యాన్స‌ర్ సోకుతున్న విష‌యాన్ని గుర్తిస్తున్నామ‌ని.. ధర్మశిల నారాయణ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్ డాక్టర్ గౌరవ్ జైన్ చెబుతున్నారు. చాలా క్యాన్స‌ర్లకు వంశ‌పారంప‌ర్యం కార‌ణంగా ఉండ‌టం లేద‌ని పేర్కొంటున్నారు. ఆహార‌పు అల‌వాట్ల వంటి జీవ‌న శైలి అంశాలు కార‌ణాలుగా క‌న‌బ‌డుతున్నాయ‌ని చెబుతున్నారు. ధూమ‌పానం, మ‌ద్య‌పానం, అంటువ్యాధులు.. ఇలాంటి కేసుల్లో క్యాన్స‌ర్ అభివృద్ధిలో కీల‌కాంశాలుగా క‌న‌బ‌డుతున్నాయ‌ని పేర్కొంటున్నారు.

BLK-మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్, మెడికల్ ఆంకాలజీ డాక్టర్ సజ్జన్ రాజ్‌పురోహిత్ దీనిపై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డిస్తూ.. స్ప‌ష్ట‌మైన కార‌ణం, కుటుంబ చ‌రిత్ర లేకుండా వ‌చ్చే క్యాన్స‌ర్లు అడ‌పా ద‌డ‌పా మాత్ర‌మే క‌నిపిస్తుంటాయ‌ని చెబుతున్నారు. మ‌నిషి జీవితకాలంలో సంభ‌వించే జన్యు ఉత్ప‌రివ‌ర్త‌నాల వ‌ల్ల.. ఆరోగ్య‌క‌ర జీవ‌న శైలిని గ‌డుపుతున్న‌ప్ప‌టికీ క్యాన్స‌ర్ రావ‌డానికి అవ‌కాశాలు ఉంటాయ‌ని గుర్తుంచుకోవాల‌ని డాక్ట‌ర్ స‌జ్జ‌న్ వివ‌రిస్తున్నారు.

అన్ని క్యాన్సర్లనూ నివారించవచ్చా?

అన్ని క్యాన్సర్ కేసులనూ నివారించలేమని గురుగ్రామ్‌లోని ఆర్టెమిస్ హాస్పిటల్ మెడికల్ ఆంకాలజీ (యూనిట్ II) సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ గోవింద గుప్తా చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు ఉన్న‌వారు.. ప్రమాద కారకాలు తెలియనివారిలో కూడా క్యాన్స‌ర్‌ అభివృద్ధి చెందవచ్చని గ‌మ‌నించాల‌ని ఆయ‌న పేర్కొంటున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుస‌రించ‌డం క్యాన్స‌ర్ బారిన ప‌డిన‌వారిని కాపాడుతుంద‌ని తాము విశ్వ‌సించాల‌నుకున్నామ‌ని, కానీ పాపం ఇది అలా కాద‌ని చెబుతున్నారు. అందుకే క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడం, స్క్రీనింగ్ చేయడం చాలా ముఖ్యమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేస్తున్నారు. ఇది విజయవంతమైన చికిత్స అవకాశాలను పెంచుతుంద‌ని డాక్టర్ వినీత్ గోవింద గుప్తా చెబుతున్నారు.

కొందరు వ్యక్తులు క్యాన్సర్ యొక్క బలమైన కుటుంబ చరిత్ర లేదా ధూమపానం లేదా అధిక మద్యపానం వంటి ప్రమాద కారకాలను కలిగి ఉండవచ్చని, మరికొందరికి వారి క్యాన్సర్‌కు స్పష్టమైన కారణం ఉండకపోవచ్చని కూడా డాక్ట‌ర్ వినీత్ గోవింద గుప్తా పేర్కొంటున్నారు. ఎందుకంటే క్యాన్సర్ అనేది జన్యుపరమైన, పర్యావరణ కారకాల కలయిక వల్ల అభివృద్ధి చెందే సంక్లిష్ట వ్యాధి అని ఆయన చెబుతున్నారు. ఒక వ్యక్తి జీవనశైలి, ఆహారం, వ్యాయామం, కుటుంబ చరిత్ర మొదలైన వాటికి సంబంధించిన సూక్ష్మ ప్రమాద కారకాలను కలిగి ఉండవచ్చని, అవి స్పష్టంగా కనిపించవని ఆయ‌న వివ‌రిస్తున్నారు. ప‌ర్యావ‌ర‌ణం నుంచి రేడియేష‌న్‌కు గురికావ‌డం వంటి కొన్ని కార‌ణాలు క‌నిపించ‌క‌పోవ‌చ్చ‌ని చెబుతున్నారు.

మ‌నం అత్యంత తేలిగ్గా తీసుకునే కొన్ని క్యాన్స‌ర్ సంకేతాలివీ..

క్యాన్సర్ తరచుగా గందరగోళ లక్షణాలను చూపిస్తుంటుంది. ప్ర‌జ‌లు అత్యంత తేలిగ్గా తీసుకునే కొన్ని సాధార‌ణ సంకేతాలను వైద్యులు వెల్ల‌డించారు. అవి ఆ త‌ర్వాత క్యాన్స‌ర్‌గా గుర్తించ‌బ‌డ్డాయ‌ని వారు చెబుతున్నారు. ఆ ల‌క్ష‌ణాల జాబితా ఇదీ..

- విపరీతమైన అలసట

- వివరించలేని బరువు తగ్గడం

- పేగు అలవాట్లలో మార్పులు

- మాన్పించని పుండు

- వాయిస్ మార్పు

- దీర్ఘకాలిక దగ్గు

- అసాధారణ పీరియడ్స్ లేదా పెల్విక్ నొప్పి

- రొమ్ము మార్పులు

- దీర్ఘకాలిక తలనొప్పి

- అజీర్ణం లేదా మింగడంలో ఇబ్బంది

- విపరీతమైన గాయాలు

- తరచుగా జ్వరం లేదా అంటువ్యాధులు

- రుతుక్రమం ఆగిపోయినా రక్తస్రావం అవుతుండ‌టం

- అసాధారణ రక్తస్రావం లేదా ఉత్సర్గ

- మొటిమ లేదా పుట్టుమచ్చలో స్పష్టమైన మార్పు

క్యాన్స‌ర్ చికిత్సలో పురోగతి

గ‌త కొన్నేళ్ల కాలంలో క్యాన్సర్ చికిత్స గణనీయంగా మెరుగుపడింది. చికిత్సలో విజయం అనేది వ్యక్తి, వారికి ఉన్న క్యాన్సర్ రకాన్ని బట్టి ఉంటుంది. వైద్యులు, పరిశోధకులు ఇప్పుడు అనేక రకాల క్యాన్సర్‌లకు విజయవంతంగా చికిత్స చేయగలుగుతున్నారు. కొత్త మందులు, ఇమ్యునోథెరపీ, వ్యక్తిగతీకరించిన ఔషధం క్యాన్సర్ చికిత్స అవకాశాలను బాగా మెరుగుపరిచాయని డాక్టర్ సజ్జన్ రాజ్‌పురోహిత్ వెల్ల‌డించారు. చికిత్సలో విజయం క్యాన్సర్ రకం, అది ఏ ద‌శ‌లో ఉంది.. అలాగే రోగి మొత్తం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని ఆయ‌న వివ‌రించారు. అయినప్పటికీ, నేటికీ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులలో మూడింట రెండు వంతుల మంది నయం చేయగ‌లుగుతున్న‌ట్టు ఆయ‌న చెబుతున్నారు. న‌యం చేయ‌లేని రోగుల్లో ఈ ప‌రిస్థితిని ఆధునిక చికిత్స ద్వారా మెరుగుప‌రుస్తున్న‌ట్టు ఆయ‌న వివ‌రించారు. వారిని బ‌తికించే కాలాన్ని కొన్ని నెల‌ల నుంచి చాలా సంవ‌త్స‌రాల వ‌ర‌కు పెంచుతున్న‌ట్టు వెల్ల‌డించారు. నిరంతరం కొన‌సాగిస్తున్న‌ పరిశోధనలు ఏటేటా క్యాన్స‌ర్ రోగుల జీవ‌న కాలాన్ని పెంచుతున్నాయ‌ని డాక్టర్ వినీత్ గోవింద గుప్తా వివ‌రించారు.

భారతదేశంలో అత్యంత సాధారణ క్యాన్సర్లు ఇవే..

అధికారిక సమాచారం ప్రకారం.. తల, మెడ, ఊపిరితిత్తుల క్యాన్సర్లు పురుషులలో సర్వసాధారణం కాగా, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ మహిళల్లో సర్వసాధారణం. పెద్ద పేగు క్యాన్సర్‌లు పెరుగుతున్న ధోరణి కూడా ఉంది. భారతదేశంలో అత్యంత సాధారణ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ తర్వాత పెద్దప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్ రెండు కీల‌క సంద‌ర్భాల‌ను కలిగి ఉంది. 17 - 25, 45 - 55 మధ్య దీనికి అవ‌కాశాలు ఎక్కువ‌ని, రెండూ హార్మోన్ల స్థితిలో మార్పుల వయస్సుల‌ని డాక్టర్ గౌరవ్ జైన్ వివ‌రించారు.

First Published:  30 Jan 2023 7:45 PM GMT
Next Story