Telugu Global
Health & Life Style

బ్రెయిన్ ట్యూమర్ ఎందుకొస్తుంది? నివారించగలమా?

Brain Tumour: ఈ మధ్యకాలంలో భారతీయుల్లో బ్రెయిన్ ట్యూమర్లు పెరుగుతున్నాయని, పది ప్రధాన ట్యూమర్లలో ఇది ఒకటిగా ఉన్నదని న్యూఢిల్లీలోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ వెల్లడించింది.

బ్రెయిన్ ట్యూమర్ ఎందుకొస్తుంది? నివారించగలమా?
X

Brain Tumour: ఈ మధ్యకాలంలో భారతీయుల్లో బ్రెయిన్ ట్యూమర్లు పెరుగుతున్నాయని, పది ప్రధాన ట్యూమర్లలో ఇది ఒకటిగా ఉన్నదని న్యూఢిల్లీలోని నేషనల్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ వెల్లడించింది. ఎక్కువ సమయం పురుగుమందులు, రసాయనాలకు దగ్గరగా ఉండేవారిలో ట్యూమర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో దగ్గరివారికి ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నపుడు భవిష్యత్తు తరాలకు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే పొగాకు, సిగరెట్ అలవాటు ఉన్నవారికి కూడా బ్రెయిన్ ట్యూమర్ తో పాటు ఇతర రకాల ట్యూమర్లు వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్ ట్యూమర్లు ఏ వయసులో అయినా ఏర్పడవచ్చు. అయితే పెద్ద వయసు వారికి ఇవి వచ్చే అవకాశం మరింత ఎక్కువ. 85నుండి 89 ఏళ్ల మధ్య వయసులో ట్యూమర్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. వృత్తిరీత్యా లేదా అంతకుముందు ఏదైనా చికిత్స కారణంగా రేడియేషన్ కి గురయి ఉన్నా ఈ ప్రమాదం హెచ్చుగానే ఉంటుంది.

ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

♦ ఉదయం పూట తలనొప్పి లేదా తల భారంగా అనిపిస్తుంది. తలనొప్పితో పాటు మైగ్రేన్ లక్షణాలతో కూడిన తలనొప్పి వస్తుంటుంది.

♦ వాంతులు, వికారం, కంటిచూపుకి సంబంధించిన సమస్యలు ఉంటాయి.

నివారించడం ఎలా...

ట్యూమర్లను నివారించడం అనేది పూర్తిస్థాయిలో సాధ్యమని చెప్పలేము. కొన్ని జాగ్రత్తలతో అది వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

♦ స్మోకింగ్ కి, రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలి.

♦ ట్యూమర్ లక్షణాలు కనబడినవారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. తమలోనే కాదు తమ చుట్టూ ఉన్నవారిలో ఎవరిలో కనిపించినా వైద్యులను సంప్రదించేలా చూడాలి. వ్యాధి నిర్దారణ త్వరగా జరిగితే పూర్తిస్థాయిలో తగిన చికిత్స పొందే అవకాశం ఉంటుంది.

♦ తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల్లో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారు తమ వైద్యులకు ఈ విషయం చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

♦ ట్యూమర్లను నివారించడంలో ఆహారంలోని యాంటీ ఆక్సిడెంట్లు చాలాబాగా పనిచేస్తాయి. కొన్నిరకాల రసాయనాల వలన మన శరీర కణాలు ఆక్సిడేషన్ అనే హానికి గురికాకుండా ఇవి కాపాడతాయి. స్ట్రా బెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్, బ్లాక్ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

♦ టమోటాలు, క్యాబేజి, క్యాలిఫ్లవర్, పాలకూర, పసుపు, ఫ్లాక్స్ సీడ్స్, నట్స్, వెల్లుల్లి, కొవ్వుతో కూడిన చేపలు, చిక్కుళ్లు మొదలైన ఆహారాల్లో కూడా ట్యూమర్లను నివారించే లక్షణాలు ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్ నివారణకోసం వీటిని ఎక్కువగా తినటం మంచిది.

First Published:  26 May 2023 2:25 PM GMT
Next Story