Telugu Global
Health & Life Style

ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా ర‌క్త‌దానం చేయొద్దు..

రక్తదానం అనేది మరొకరి ప్రాణాల్ని కాపాడే గొప్ప మార్గం. రక్త‌దానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయనే అపోహలు ఉన్నా.. రక్తదానం వల్ల ఆరోగ్యం మరింత మెరుగ్గా తయారవుతుంది.

ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా ర‌క్త‌దానం చేయొద్దు..
X

రక్తం మానవ శరీరంలోని కణజాలాలకు పోషకాలను, ఆక్సిజన్‌ను సరఫరా చేసే ద్రవం. ఇది మనిషి శరీరంలో ఎంతో ప్రాముఖ్యత పొందిన ద్రవపదార్థం. ఆరోగ్యవంతమైన మనిషి శరీరంలో ఐదు లీటర్ల వరకూ రక్తం ఉండాలని డాక్టర్స్ చెపుతారు. ఒకవేళ ఒంట్లో రక్తం తక్కువైతే.. తగిన మోతాదులో ఐరన్ లేకున్నట్టయితే.. చాలా రకాల వ్యాధులు వచ్చే ప్రమాదముంది. ఎనిమియా ఈ కారణాలతోనే వస్తుంది. భారతదేశంలో తరచుగా వచ్చే పలు అనారోగ్య సమస్యలలో రక్తహీనత మొదటి స్థానంలో ఉంది. శరీరంలో సరిపడినంత రక్తం లేకపోవడం ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తుంది. అత్యవసర సమయాల్లో రక్తం అందక ప్రాణాలు వదుతున్నవారు ఉన్నారు. ప్రమాదాలు, అత్యవసర ఆపరేషన్‌ల‌ సమయంలో అవసరమైన మోతాదులో రక్తం అందుబాటులో లేకపోయినా రోగి శరీరంలోకి రక్తాన్ని ఎక్కించాల్సి వస్తుంది.

Advertisement

రక్తదానాన్ని ప్రోత్సహిద్దాం..

రక్తదానం అనేది మరొకరి ప్రాణాల్ని కాపాడే గొప్ప మార్గం. రక్త‌దానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయనే అపోహలు ఉన్నా.. రక్తదానం వల్ల ఆరోగ్యం మరింత మెరుగ్గా తయారవుతుంది. రక్తదానం చేసిన వ్యక్తి కొద్దికాలంలోనే కొత్త రక్తకణాల పెరుగుదలతో ఉత్సహంగా మరింత ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉన్న మగవారు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. అదే విధంగా ఆరోగ్యంగా ఉన్న మహిళలు కూడా నాలుగు నెలలు ఒకసారి రక్తదానం చేయవచ్చు.

Advertisement

18 నుండి 65 సంవత్సరాల మధ్య వయసు కలిగినవారు ఎవరైనా ఆరోగ్యంగా ఉంటే అలాంటివారు నిరభ్యరంతంగా రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేయడం వల్ల మనుషులకు మానసిక, శారీరక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్న మాట. రక్తదానం చేయాలనుకునేవారు ఈ సలహాలను పాటించడం ఎంతైనా అవసరం.

◆ రక్తదానం చేసేవారి కనీస వయసు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి.

◆ రక్తదానం చేసేవారి శరీర బరువు కనీసం 55 కేజీల ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే బలహీనంగా ఉన్నట్టు లెక్క.

◆ ఒకసారి రక్తదానం చేస్తే మళ్ళీ రెండోసారి రక్తదానం చేయడానికి మగవాళ్ళు 90 రోజుల వరకూ ఆగాలి, అదే ఆడవాళ్లు అయితే 120 రోజుల తర్వాత మళ్ళీ రక్తదానం చేయవచ్చు.

◆ రక్తదానం చేసేటప్పుడు రక్తదాత పల్స్ 60-100bpm మధ్య ఉండాలి. అలాగే రక్తదాతల్లో హిమోగ్లోబిన్ 12.5g/dl కంటే ఎక్కువగా ఉండాలి.

◆ రక్తం దానం చేసిన తరువాత రక్తదాతకు శారీరక విశ్రాంతి చాలా అవసరం.

◆ ఖాళీ కడుపుతో, ఏమీ తినకుండా రక్తదానం చేయకూడదు.

◆ రక్తదానం చేసే ముందు మద్యపానం, ధూమపానం వంటివి చేయ‌రాద్దు.

◆ శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు రక్తదానం చేయకూడదు. సమస్య తగ్గిన తరువాత చేయొచ్చు.

◆ రక్తదానం చేసిన తరువాత 24 గంటలు పాటు ఎక్కువ ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలి. ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయకూడదు, ద్రవ పదార్థాలు పుష్కలంగా తీసుకోవాలి.

◆ మలేరియా నుండి కోలుకున్నవాళ్ళు 3 నెలల పాటు రక్తదానానికి దూరంగా ఉండాలి, అలాగే టైఫాయిడ్ నుండి కోలుకున్నవాళ్ళు 12 నెలలు రక్తదానానికి దూరంగా ఉండాలి.

◆ మధుమేహ సమస్య ఉండి రోజూ మందులు వాడుతున్నవారు రక్తదానానికి అర్హులు కారు.

◆ మహిళలు గర్భం దాల్చినప్పుడు, నెలసరి సమయాల్లో, డెలివరీ అయిన 12 నెలల వరకు రక్తదానం చేయకూడదు.

ఇలా రక్తదానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుని రక్తదానం చేయడం మంచిది. మీరు చేసే ఈ చిన్న దానం వల్ల రక్తాన్ని స్వీకరించిన వారి ప్రాణం కాపాడినవారు అవుతారు. కాబట్టి అపోహలు లేకుండా అర్హులైనవారు రక్తదానం చేయండి. చేసేవారిని ప్రోత్సహించండి.

Next Story