Telugu Global
Family

జీవితంలో అన్నింటికీ సమన్యాయం సాధ్యమే!!

ఒక చోటి ఒత్తిడిని మరొకచోటికి బదిలీచేయకూడదు. సమయాన్ని కేటాయించుకోవడం నుండి ప్రతి చోటా ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది నిజంగా కత్తిసాము లాంటిది.

జీవితంలో అన్నింటికీ సమన్యాయం సాధ్యమే!!
X

మనిషి తన జీవితంలో ఎన్నో రకాల పాత్రలు పోషిస్తాడు. ఒక్కో దశలో ఒకోవిధంగా బాధ్యతలు మనిషిని అంటిపెట్టుకుని ఉంటాయి. చిన్నతనంలో బుద్దిగా చదువుకోవడంతో మొదలయ్యే ఈ బాధ్యత, వయసు పెరిగేకొద్ది తన రూపాన్ని పెంచుకుంటూ, మార్పులు చేసుకుంటూ మనిషివెంట వస్తూనే ఉంటుంది. అయితే వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన తరువాత ఒక జీవిత భాగస్వామిగా, ఒక ఉద్యోగిగా, ఒక తండ్రిగా, ఒక కొడుకుగా ఇలా అన్నిరకాల పాత్రలు పోషిస్తాడు. అయితే ఆయా పాత్రలకు సరైన న్యాయం చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం.

జీవిత భాగస్వామి దగ్గర కేవలం ఆ ఇద్దరికే సంబంధించిన విషయాలు, ఇంటి బాధ్యతలు చర్చించాలి.

పిల్లల దగ్గర తండ్రిగా/తల్లిగా ప్రేమను పంచుతూ బాధ్యతగా అవసరాలను తీర్చాలి.

ఉద్యోగి/ఉద్యోగినిగా సమర్థవంతమైన పనిని సంస్థకు ఇవ్వాలి.

తల్లిదండ్రుల పట్ల బాధ్యతను కలిగి ఉంటూ వారి అవసరాలను తీర్చాలి.

ఇలా అన్నిరకాల పాత్రలకు సరైన న్యాయం చెయ్యాలంటే ఒక పాత్రకు మరొక పాత్రకు మధ్య జంప్ చేస్తూ, ఒక చోటి ఒత్తిడిని మరొకచోటికి బదిలీచేయకూడదు. సమయాన్ని కేటాయించుకోవడం నుండి ప్రతి చోటా ఎమోషన్స్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది నిజంగా కత్తిసాము లాంటిది.

అయితే అన్నిపాత్రలకు సమన్యాయం చేయడానికి మానవసంబంధ నిపుణులు కొన్ని సలహాలు అందిస్తున్నారు. వాటిని పాటిస్తే అసంతృప్తి అనేది లేకుండా చేసుకోవచ్చు.

◆ ప్రస్థుతాన్ని ఆస్వాదించడం!!

ప్రస్తుతం అంటే గడుస్తున్న క్షణం అని అర్థం. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ పని మీద, పిల్లలతో ఉన్నప్పుడు పిల్లల విషయాల్లో, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు వారితో, భాగస్వామితో వ్యక్తిగత సమయం గడుపుతున్నప్పుడు ఆ విషయంలో. ఇలా ఏపని చేస్తున్నప్పుడు ఆ పనిమీద ధ్యాస ఉండాలి. అంతేకానీ బుర్ర ఒకచోట, శరీరం ఒకచోట ఉండకూడదు.

పని చేస్తున్నప్పుడు ఇంటి విషయాలు, సమస్యలు ఆలోచించడం, ఇంట్లో ఉన్నప్పుడు ఉద్యోగ సంబంధ విషయాలు ఆలోచించడం చేయకూడదు.

◆మాటల్లో స్పష్టత!!

ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడితే అందులో స్పష్టత ఉండాలి. ఏమనుకుంటారో, బాధపడతారేమో అనే మొహమాటం, చెప్పలేనితనం అసలు మంచిది కాదు.

ఒకసారి ముక్కుసూటిగా విషయాన్ని ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే అది మొదట కఠినం అనిపించినా తరువాత అది ఏ విధమైన సమస్యలను సృష్టించకుండా ఉంటుంది కాబట్టి ఏవిధమైన ఒత్తిడులు ఎదురవ్వవు.

◆ నిలకడగా ఉండాలి!!

రోజులో ఉదయం నుండి రాత్రిలోపు ఒకోసమయంలో ఒకచోట ఒకో విధంగా ఉండాలి కాబట్టి భావోద్వేగాల విషయంలో నిలకడ ముఖ్యం.

నిర్ణయాలు తీసుకోవడమైనా, విషయాలు చెప్పడమైనా, ఆర్థికపరమైనవి అయినా అన్నిటిలో మానసిక దృఢత్వంతో వ్యవహరించాలి.

◆ ఇష్టాన్ని వ్యక్తం చేయాలి!!

ఎవరితో సమయాన్ని గడుపుతున్నా వారి దగ్గర తనకున్న ఇష్టాన్ని, ప్రేమను, వారి పట్ల ఉన్న ప్రత్యేకతను వ్యక్తం చేయాలి. అలా వ్యక్తం చేయడం వారి మధ్య ఉన్న బంధాన్ని ధృడపరుస్తుంది.

ఉద్యోగవిషయంలో బాధ్యతగా మాత్రమే కాకుండా చేస్తున్న పనిపట్ల ఇష్టాన్ని వ్యక్తం చేస్తే తెలియకుండానే ఆ పనిలో సాధారణం కంటే అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఫలితంగా ఉత్తమ ఉద్యోగిగా పేరు తెచ్చుకుంటారు.

◆అపరాధభావం వదిలెయ్యాలి!!

కొన్నిసార్లు అన్నిటికి న్యాయం చేయలేకపోవచ్చు. అలాంటప్పుడు ఏదో తప్పుచేసేసాము అనే భావన తెచ్చుకోకూడదు.

అన్నిటికీ న్యాయం చేసే ప్రక్రియలో కొన్నింటికి సమయం కుదరకపోవచ్చు ఆ పరిస్థితిని అందరికీ అర్థమయ్యేట్టు చెబితే సరిపోతుంది.


◆ సాధ్యమైనంత వరకు అన్నిటినీ క్రమబద్ధంగా ఉంచుకోవాలి. దీనివల్ల గందరగోళం తప్పుతుంది. గందరగోళం లేకుంటే బుర్ర బాగా పనిచేస్తుంది.

◆ సమయాన్ని ప్రణాళిక వేసుకోవడం మంచిది. దీనివల్ల రోజులో ఎంతసమయం దేనికి కేటాయించవచ్చో సులభంగా అర్థమైపోతుంది.

◆ వాస్తవిత చాలా ముఖ్యం. నోటి లెక్కలు, ముందుగానే ఉహించడాలు చేయకూడదు. లేకపోతే వాటివిషయంలో చాలా సమస్య ఎదుర్కోవాలి.

◆ ఏ పని చేసైనా ఆ పనిలో లీనమైపోవాలి. మంచి భాగస్వామిగా, మంచి ఉద్యోగిగా, మంచి పేరెంట్ గా ఉండేందుకు ఇదే ముఖ్యమైన సూత్రం.

◆ ప్రతిదాన్ని పెద్ద టాస్క్ అనుకోకుండా అనుభూతిచెందడం మొదలుపెడితే ఉద్యోగంలో, వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషం లభిస్తుంది. ఆ సంతోషమే తృప్తిని ఇస్తుంది.

కాబట్టి ఉద్యోగం, వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులకు సమయం కేటాయించడం వంటి విభిన్న విషయాలలో విభిన్నంగా ఉంటూ అన్ని పాత్రలకు సమన్యాయం చెయ్యాలంటే నిపుణులు సూచించిన సలహాలు పాటించేయండి.

First Published:  20 July 2022 9:10 AM GMT
Next Story