Telugu Global
Health & Life Style

తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ ఆహార పదార్థాలు దూరం పెట్టడం మంచిది

తల నొప్పి ఉన్న సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోకుండా ఉండటం మంచిదని వైద్యులు చెబుతున్నారు. వీటి వల్ల నొప్పి మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ ఆహార పదార్థాలు దూరం పెట్టడం మంచిది
X

గంటల తరబడి మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ స్క్రీన్లు, టీవీలు చూడటం వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో మారిన లైఫ్ స్టైల్ కారణంగా నిద్రలేమితో బాధపడే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో పాటు డీహైడ్రేషన్, ఒత్తిడి, హ్యాంగోవర్, ఆందోళన, కంటి చూపు సమస్యల వల్ల తల నొప్పి తరచూ వస్తుంటుంది. వాతావరణంలో మార్పులు, ఘాటు వాసనలు, మిరుమిట్లు గొలిపే లైట్లు, పిరియడ్స్ సమయంలో కూడా తల పట్టేసినట్లు అవుతుంది.

తల నొప్పి ఉన్న సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు, పానీయాలు తీసుకోకుండా ఉండటం మంచిదని వైద్యులు చెబుతున్నారు. వీటి వల్ల నొప్పి మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అవి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలే అయినా.. తల నొప్పికి కారణం అవుతాయి కాబట్టి వాటిని అవాడ్ చేయడమే బెటర్. ముఖ్యంగా మైగ్రేన్‌తో ఇబ్బంది పడేవాళ్లు అసలు ముట్టుకోవద్దని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాంటి ఆహార పదార్థాలు, పానీయాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం.

పాలు :

పాలు మంచి పోషకాలు నిండిన ఆహారమే. నిద్రపోయే ముందు గోరు వెచ్చని పాలు తాగడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. అయితే తలనొప్పిగా ఉంటే మాత్రం పాలు తాగవద్దని వైద్యులు సూచిస్తున్నారు.ఇందులో ఉండే లాక్టోస్.. నొప్పి తీవ్రతను ఎక్కువ చేస్తుంది.

చాక్లెట్లు:

పిరియడ్స్‌లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది చాక్లెట్లు తింటుంటారు. కానీ తల నొప్పిగా ఉన్నప్పుడు వాటిని తినకపోవడమే ఉత్తమం. చాక్లెట్ తినడం వల్ల అందులోని కెఫిన్, టైరమైన్ నొప్పిని మరింతగా పెంచుతాయి.

రెడ్ వైన్:

పులియబెట్టిన ద్రాక్ష పండ్ల నుంచి తీసే రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదని కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన పానీయంగా పేర్కొంటారు. కానీ అతిగా వైన్ తీసుకోవడం వల్ల తలనొప్పిని పెంచుతుంది. ఇందులో ఉండే ఆల్కహాల్ కారణంగా నొప్పి తీవ్రత పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఛీజ్:

పాల నుంచి తయారు చేసే ఛీజ్ కూడా తల నొప్పిని పెంచుతుంది. ఇందులో ఉండే టైరమైన్ కారణంగా రక్త నాళాలు కుంచించుకొని పోతాయి. దీని వల్ల తలనొప్పి కలుగుతుంది.

కూరగాయలు/మాంసం:

క్యాబేజీ, వంకాయలు, చేపలు, మాంసం, వేరుశెనగలు తలనొప్పిని పెంచుతాయి. వాటిని ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

కాఫీ:

తలనొప్పి అనిపిస్తే చాలా మంది స్ట్రాంగ్ కాఫీ తాగుతుంటారు. కానీ వాస్తవానికి కాఫీలో ఉండే కెఫిన్ నిద్రలేమి సమస్యను పెంచుతుంది. దీని వల్ల తలనొప్పి కూడా పెరిగిపోతుంది.

పండ్లు :

విటమిన్ సి సమృద్ధిగా దొరికే సిట్రస్ ఫ్రూట్స్ కారణంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లలో ఉండే అక్టోపమైన్ అనే పదార్థం కారణంగా తలనొప్పి అధికమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

స్వీట్నర్స్:

డయాబెటిస్‌తో బాధపడేవాళ్లు కృత్రిమ స్వీట్నర్స్ వాడుతుంటారు. అయితే ఇవి డొపమైన్‌ను తగ్గించి తలనొప్పిని ప్రేరేపిస్తుందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

ఎనర్జీ డ్రింక్స్:

తాత్కాలిక శక్తి కోసం చాలా మంది ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. వీటి వల్ల డీహైడ్రేషన్‌తో పాటు నిద్రలేమి, అలసట వంటివి అధికం అవుతాయి. దీనిలో కెఫిన్, చక్కెర స్థాయిలు కూడా ఎక్కవగా ఉంటాయి. ఇవన్నీ తలనొప్పిని మరింతగా పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు.

First Published:  3 Dec 2022 12:01 PM GMT
Next Story