Telugu Global
Family

పిల్లల్లో ఫెయిల్యూర్ భయాన్ని పోగొట్టండిలా..

పిల్లల్లో ఇలాంటి భయం పోవాలంటే తల్లిదండ్రులు వారితో పాజిటివ్‌గా మాట్లాడటం అలవాటుగా చేసుకోవాలి.

పిల్లల్లో ఫెయిల్యూర్ భయాన్ని పోగొట్టండిలా..
X

ప్రస్తుతం పిల్లలకు పరీక్షల సమయం నడుస్తోంది. ఈ టైంలో పిల్లలపై అధిక ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి ఇక్కడితో ఆగిపోకుండా పరీక్షల తర్వాత కూడా వెంటాడుతుంటుంది. పరీక్షలు సరిగ్గా రాయని విద్యార్థులు ‘ఫెయిల్ అవుతామేమో’ అన్న భయంతో నిరాశకు గురవుతుంటారు. పిల్లలు ఇలా కుంగిపోకూడదంటే పేరెంట్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

సరిగ్గా చదువుకోకపోతే, మంచి ర్యాంకు తెచ్చుకోకపోతే, అమ్మానాన్నలకు అప్రతిష్ట తెస్తామని చాలామంది టీనేజర్లు భావిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఫెయిల్యూర్ భయంతో ఏమీ ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంటారు. దీన్ని అరికట్టేందుకు ఏం చేయాలంటే..

పిల్లల్లో ఇలాంటి భయం పోవాలంటే తల్లిదండ్రులు వారితో పాజిటివ్‌గా మాట్లాడటం అలవాటుగా చేసుకోవాలి. ‘‘ ఈ సారయినా పాసవుతావా’’, ‘‘ఈ జన్మలో నీకు ఐఐటి ర్యాంక్ వస్తుందా ? ’’ లాంటి మాటలకు బదులు ‘ఫెయిల్‌ అయినా ఏం పర్లేదు’. అనే భరోసా ఇవ్వాలి. ‘ప్రతిభకు మార్కులు ఒక్కటే కొలమానం కాదు. ఏ రంగంలో ఎప్పుడు అయినా రాణించొచ్చు’ అని తల్లి దండ్రులు వాళ్లకి తెలియచెప్పాలి

-ఏదో అయిపోతుందని అనుకోవడం, దాని నుంచి తప్పించుకోవడం సమస్యకు పరిష్కారం కాదని వాళ్లకు అర్ధమయ్యేలా చెప్పాలి. ఆ భయాన్ని ఎలా అధిగమించాలనేది నేర్పించాలి. ఫలానా సబ్జెక్టులో మార్కులు సరిగ్గా రావనుకుంటే దానికి పరిష్కారాలు వాళ్లనే ఆలోచించమనాలి.

సక్సెస్ స్టోరీస్‌తో పాటుగా, అపజయాలతో ముడిపడి వున్న కథల్ని కూడా పిల్లలకు చెప్తూ ఉండాలి. ఓడిపోవడం ధైర్యవంతుల లక్షణం అని అందరూ తెలుసుకోవాలి. ఫెయిల్యూర్ నుంచి బయటికి రావాలంటే ముందు ఆ ఓటమిని ఒప్పుకోవాలి. అందులోని తప్పొప్పులని విశ్లేషించుకోవాలి.

తల్లిదండ్రులు పిల్లల సామర్ద్యాన్ని గుర్తించగలగాలి. పిల్లల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్క మార్కు తగ్గినా, వైఫల్యం ఎదురైతే జీవితం ముగిసిపోయినట్లు కాదనేది వాళ్లకు వివరించాలి. ఈ పరీక్ష కాకపోతే మరొకటి అనే ధోరణి పెంచాలి.

ఎట్టి పరిస్థితుల్లో తోటివారితో పోల్చకూడదు. దానివల్ల వాళ్ళు ఇంకా కుంగిపోయే ప్రమాదం ఉంటుంది. పిల్లల మీద ఓవర్‌ యాంబిషన్‌, ఓవర్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉండకూడదు.

పిల్లలు పెరుగుతున్న క్రమంలో డిఫరెంట్‌ లెవల్స్‌లో కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. ప్రవర్తనలో ఏదైనా మార్పు గమనిస్తే సైకాలజిస్టు దగ్గరకు తీసుకువెళ్లడం మంచిది.

చదువంటే డాక్టరు, ఇంజనీరు, ఐఐటి వంటివేనా? ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. చదువు ఒక మహాసముద్రం. ఎన్నో కెరీర్‌ ఆప్షన్లు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. కాబట్టి ర్యాంకుల గురించి పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం అంత మంచిది కాదనేది నిపుణుల అభిప్రాయం.

First Published:  15 March 2024 1:57 AM GMT
Next Story