Telugu Global
Family

రంజాన్ విశిష్టత

ముందుగా "రమదాన్" అనేది ఒక నెల. చాలా వరకు తెలియని వాళ్ళు "రంజాన్" అని అంటారు. వాస్తవానికి అది ‎رَمَضَان రమదాన్" అని పిలవాలి పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించినది "రమదాన్" మాసంలోనే ...రమదాన్ పండుగ కు మరో పేరు "ఈద్ ఉల్ ఫిత్ర".

రంజాన్ విశిష్టత
X

ముందుగా "రమదాన్" అనేది ఒక నెల. చాలా వరకు తెలియని వాళ్ళు "రంజాన్" అని అంటారు. వాస్తవానికి అది

‎رَمَضَان రమదాన్" అని పిలవాలి పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించినది "రమదాన్" మాసంలోనే ...రమదాన్ పండుగ కు మరో పేరు "ఈద్ ఉల్ ఫిత్ర".

ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే "రమదాన్" పండుగ

హితాన్ని మానవాళికి అందిస్తుంది.ముస్లింలు చాంద్రమాన కేలండర్ ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల "రమదాన్", దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే "రమదాన్" మాసం

ఖురాన్ ప్రకారం రమదాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ' ఉపవాసం' . ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో ' రోజా ' అని అంటారు. "సౌమ్" అని అరబ్బీ లో పిలుస్తారు. ఈ ఉపవాస విధిని గురించి దివ్యఖురాన్ గ్రంథం .

"విశ్వాసులారా! గత దైవ ప్రవక్తలను అనుసరించే వారికి ఎలా ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయో... అలాగే మీలో భయభక్తులు జనించిడానికి అదేవిధంగా ఇప్పుడు మీకు కూడా ఉపవాసలు నిర్ణయించబడ్డాయి" అని పేర్కొంది.

భారతదేశంలో ముస్లింలు రాత్రి నిద్రపోయి తెల్లవారి నాలుగు గంటలకు లేచి ఉపవాసం కొరకు సహరి (భోజనం) చేస్తారు.గల్ఫ్ దేశాల్లో రాత్రంతా తింటూ తెల్లవారు ఝామున నమాజ్ చదివి పడుకుంటారు. "రమదాన్" నెల మొత్తం రెస్టారెంట్లు రోజంతా మూసివేస్తారు.

బహిరంగంగా తినకూడదని, తాగకూడదని హెచ్చరికలుంటాయి. దుబాయిలోని ఏకైక హిందూ దేవాలయమైన కృష్ణ మందిరంలో భక్తులకు ప్రసాదాన్ని రమదాన్ నెలలో ఇఫ్తార్ వేళల తర్వాతే ఇస్తారు.అరబ్బులు గల్ఫ్‌లోని అన్ని మసీదులలో రమదాన్ సందర్భంగా పౌష్టికాహారాన్ని నెలరోజుల పాటు ఉచితంగా సరఫరా చేస్తారు. బహిరంగంగా తింటూ కనిపిస్తే శిక్ష తప్పదు.మసీదుల ముందు బిక్షాటన చేసే వారికి కాకుండా ప్రభుత్వం ఆమోదం పొందిన చారిటీలకు మాత్రమే జకాత్ సొమ్మును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ బిచ్చగాళ్ల బెడద విపరీతంగా ఉంటుంది.

భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, యెమన్ దేశాల నుంచి వికలాంగులైన పేదపిల్లలను గల్ఫ్ తీసుకొచ్చి వారి చేత బిక్షాటన చేయించి లాభాలు గడించడం కొన్ని యాచక ముఠాల ప్రత్యేకత. అందుకే మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలలో ప్రత్యేక వాహనాలలో బిచ్చగాళ్ల నిర్మూలన దళాలు 24 గంటలూ పనిచేస్తాయి.

గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల వివరాలు పేర్కొంటూ ఈ పుణ్య మాసంలో వారికి క్షమాభిక్ష పెట్టి జైళ్ల నుంచి విడుదల చేయాల్సిందిగా ఇక్కడి రాజులకు భారతీయ దౌత్య కార్యాలయాలు ప్రత్యేక అభ్యర్థనలు చేస్తాయి. ఖురాన్‌ను కంఠస్థం చేసిన ఖైదీలను కూడా శిక్ష తగ్గించి విడుదల చేస్తారు.స్వదేశానికి వెళ్లడానికి విమానం టికెట్లకు డబ్బు లేకుండా జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు మతంతో నిమిత్తం లేకుండా తమ జకాత్ సొమ్ముతో విమాన టికెట్లను అనేకమంది అరబ్బులు అందించడం విశేషం

జకాత్ :

-------

జకాత్ రమదాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు, సంపన్నులైనవారు రమదాన్ నెలలో

' జకాత్ ' అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని 'జకాత్' అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30 శాతం చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ జకాత్ఉపయోగపడుతుంది.

ఫిత్రా :

----------

'జకాత్' తో పాటు ' ఫిత్రా' దానానికి రమదాన్ నెలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం దీన్ (ధర్మం) ఉద్భోదిస్తూవుంది. దీనినే

' ఫిత్రాదానం' అని పిలుస్తారు.

ఉపవాసవ్రతాలు విజయవంతంగా ముగిసినందులకు దేవుడి పట్ల కృతజ్ఞతగా .. పేదలకు ఈ ఫిత్రాదానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రాదానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ, దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్ని గానీ పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపున పేదలకు అందజేయాలి. పుణ్యం దక్కుతుందనే నమ్మకం ఉంది.

దైవ ప్రవక్త ఫిత్రాధానాన్ని విధిగా నిర్ణయించడానికి కారణం - ఉపవాస వ్రత నియమాన్ని పాటించే సమయంలో హృదయంలో కలిగే చెడు తలంపులు, ఆలోచనలు, నోటినుంచి వెలువడే అసత్యాలు, పనికిమాలిన మాటలు వంటి పొరపాట్లు జరుగుతూ వుంటాయి. ఇలాంటి అనాలోచిత పొరపాట్లు అన్నీ ఫిత్రాదానం వల్ల క్షమించబడతాయి ' అని మహమ్మద్‍ ప్రవక్త (ఆయనపై శాంతి శుభాలు కురియుగాక) సహాబి (సహచరులు) అబ్దుల్లా బిన్ మసూద్ తెలిపారు.

ఈ నెలలో జరిగే ' ఇఫ్తార్ విందు ' ల్లో ఆత్మీయత సహృద్భావాలు ప్రసుప్టమవుతాయి. పరస్పర ధోరణికి, విశాల ఆలోచనా దృక్పథానికి ఇవి నిదర్శనం.

ఈ విధంగా రమదాన్ నెల అంతా పవిత్ర కార్యక్రమాలతో ముగుస్తూనే 'షవ్వాల్' ' నెలవంక ప్రత్యక్షమవుతుంది. ఈ నెలవంక దర్శనమిస్తేనే ముస్లిం సోదరులు ఉపవాసవ్రతాన్ని విరమించి,మరుసటి రోజు "ఈదుల్ ఫితర్" పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో సంతోషానందాలతో జరుపుకుంటారు.

" షవ్వాల్' నెల మొదటి రోజున జరుపుకునే పండుగను ' ఈదుల్‍ఫితర్ ' అని అంటారు.

నెల పొడుపుతో రమదాన్ ఉపవాస దీక్షలు విరమించి మరుసటి దినాన్ని "ఈద్ ఉల్ ఫితర్ " పండుగగా నిర్ణయిస్తారు. అల్లా రక్షణ, కరుణ అందరూ పొందాలన్న ఆశయంతో ఈద్గాలో బారులుతీరి పండుగ నమాజు చేస్తారు. కొత్త వస్త్రాలు, పరిమళ ద్రవ్యాలతో వాతావరణమంతా ఆహ్లాదకరమవుతుంది. ధనిక, బీద తారతమ్యం లేక, సహృదయాలతో సద్భావనలతో ఆలింగనం చేసుకుంటారు. ద్వేషాలన్నీ సమసి ప్రేమపూరిత భావం ఇనుమడిస్తుంది. ప్రత్యేకంగా సేమ్యాతో చేసిన ఖీర్ తినిపించుకొని ముస్లింలే కాక ముస్లిమేతర సోదరులు కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. మానవుల మధ్య నెలకొన్న వర్గ వైషమ్యాలు తొలగించి అందరిలో ఆధ్యాత్మిక చింతన కలిగించి చిరుజీవితాన్ని ఆనందంతో నింపి పుణ్యకార్యాల వైపు దృష్టి మరల్చే రమదాన్ మాసం చైతన్యాన్ని కలిగించి ముందుకు సాగే ధైర్యాన్నిస్తుంది

ఈ విధంగా పవిత్ర ఆరాధనలకు ధార్మిక చింతనకూ, దైవభక్తికీ, క్రమశిక్షణకూ, దాతృత్వానికి రమదాను నెల ఆలవాలం అవుతుంది. మనిషి సత్ర్పవర్తన దిశలో సాగడానికి మహమ్మద్ ప్రవక్త బోధించిన మార్గం సుగమం చేస్తుంది.

-హనీఫ్

First Published:  22 April 2023 9:43 AM GMT
Next Story