Telugu Global
Family

టైం మేనేజ్‌మెంట్ అంటే ఎలా ఉండాలో తెలుసా?

జీవితంలో సక్సెస్ అవ్వాలంటే సమయాన్ని సరిగ్గా వాడుకోవడం తెలియాలి అని నిపుణులు చెప్పే మాట. సమయాన్ని కావాల్సినట్టు వాడుకోవడమే టైం మేనేజ్‌మెంట్ అంటే.

టైం మేనేజ్‌మెంట్ అంటే ఎలా ఉండాలో తెలుసా?
X

జీవితంలో సక్సెస్ అవ్వాలంటే సమయాన్ని సరిగ్గా వాడుకోవడం తెలియాలి అని నిపుణులు చెప్పే మాట. సమయాన్ని కావాల్సినట్టు వాడుకోవడమే టైం మేనేజ్‌మెంట్ అంటే. ఏదైనా పని అనుకున్న టైంకి అనుకున్న విధంగా జరగాలంటే ఈ స్కిల్ ఎంతో అవసరం. మరి దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి?

సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకున్నవాళ్లకు సక్సెస్ వెన్నంటే ఉంటుంది. ఇల్లు, ఆఫీస్.. ఎక్కడైనా రోజువారీ జీవితంలో టైం మేనేజ్‌మెంట్‌దే కీలక పాత్ర. నిముషం కూడా సమయం వృథా అవ్వకుండా సమయాన్ని సరిగ్గా వాడుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

రోజువారీ పనులు అస్తవ్యస్తంగా సాగుతుంటే మీ టైం మేనేజ్‌మెంట్ సరిగ్గా లేదని అర్థం. ఇలాంటప్పుడు రోజులో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులన్నింటినీ ఒకచోట రాసుకుని ప్రయారిటీస్ ఆధారంగా టైం కేటాయించుకోవాలి. ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో ప్రీ ప్లాన్ వేసుకుని దాన్ని యధావిధిగా ఫాలో అవుతుంటే కొన్ని రోజులకు అదే అలవాటు అవుతుంది. రోజువారీ పనులు అవాంతరాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి.

రోజువారీ పనులు లిస్ట్ రాసుకున్నట్టుగానే వారం, నెల, సంవత్సరానికి పూర్తి చేయాల్సిన పనులను కూడా ముందుగానే ఓచోట రాసి పెట్టుకోవాలి. వాటిని నిర్ణీత సమయానికి ఎలా పూర్తి చేయాలో ప్లాన్ వేసుకుని ఆ షెడ్యూల్‌ను ఫాలో అవుతుండాలి. ఇలా చేయడం వల్ల మీ గోల్స్ రీచ్ అవ్వడం మరింత ఈజీ అవుతుంది.

రోజంతా బిజిగా ఉంటున్నా అనుకుంటున్న లక్ష్యాలు చేరుకోపోతుంటే.. ఏ పనికి సమయాన్ని వృథా చేస్తున్నారో తెలుసుకోవాలి. చేస్తున్న పనుల్లో ‘అత్యంత ముఖ్యమైనవి’, ‘ముఖ్యమైనప్పటికీ తొందర లేనివి’, ‘ముఖ్యం కానివి’.. ఇలా పనులను విభజించుకుని.. తదనుగుణంగా టైం డివైడ్ చేసుకోవాలి.

పనులకు ప్రణాళిల వేయడం ఒక ఎత్తయితే వాటిని సకాలంలో అమలు చేయడం మరో ఎత్తు. అనుకున్న టైంకి అనుకున్న పని పూర్తిచేయడానికి ఏ విధంగా కష్టపడాలో తెలుసుకోవాలి. దానికి తగిన స్కిల్స్ నేర్చుకోవడం, వేగంగా పని చేయడం వంటివి అలవర్చుకోవాలి.

ఇక చివరిగా.. సమర్ధవంతంగా పనులు పూర్తి చేసేందుకు శారీరక, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి వ్యాయామానికి, విశ్రాంతికి, ఫ్యామిలీ కోసం కూడా కొంత సమయం కేటాయించుకోవడం అవసరం.

First Published:  5 Oct 2023 1:17 PM GMT
Next Story