Telugu Global
Family

రిలేషన్‌షిప్ ప్రమాదకరంగా మారకూడదంటే..

బంధాలు జీవితాన్ని బెటర్‌‌గా మార్చాలి. ఎమోషనల్‌గా సపోర్ట్ ఇవ్వాలి. వీటి కోసమే అందరూ రిలేషన్స్‌ని కోరుకుంటారు. కానీ, అదే రిలేషన్ జీవితాన్ని ప్రమాదంలోకి నెడితే.. దాన్నే ‘టాక్సిక్ రిలేషన్’ అంటారు.

రిలేషన్‌షిప్ ప్రమాదకరంగా మారకూడదంటే..
X

రిలేషన్‌షిప్ ప్రమాదకరంగా మారకూడదంటే..

బంధాలు జీవితాన్ని బెటర్‌‌గా మార్చాలి. ఎమోషనల్‌గా సపోర్ట్ ఇవ్వాలి. వీటి కోసమే అందరూ రిలేషన్స్‌ని కోరుకుంటారు. కానీ, అదే రిలేషన్ జీవితాన్ని ప్రమాదంలోకి నెడితే.. దాన్నే ‘టాక్సిక్ రిలేషన్’ అంటారు. అంటే విషపూరిత బంధం అని అర్ధం. అంటే రిలేషన్ రానురాను విషపూరితంగా మారి.. బంధాన్ని చంపేస్తుంది. ఎలాంటి లక్షణాలు టాక్సిక్ రిలేషన్ కిందకు వస్తాయో చూద్దాం.

‘నీకోసం చావడమే కాదు, చంపడానికి కూడా రెడీ’, ‘నువ్వు నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడకూడదు’, ‘నువ్వు ఒప్పుకోకపోతే చచ్చిపోతా’ ఇలాంటి మాటలన్నీ సినిమాల్లోనే కాకుండా బయట కూడా వినిపిస్తుంటాయి. అయితే ఇదంతా ప్రేమగా భావిస్తారు కొందరు. ప్రేమ బాగా ముదిరితే ఇలాంటి మాటలొస్తాయి అనుకుంటుంటారు. కానీ, అది టాక్సిక్ రిలేషన్ అని రిలేషన్‌షిప్ నిపుణులు చెప్తున్నారు. ప్రేమించమని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయడం లాంటిదన్నమాట. ఇదొక్కటే కాదు ఇలాంటి టాక్సిక్ లక్షణాలు చాలానే ఉన్నాయి.

పెత్తనం

సాధారణంగా కొంతమంది భార్యాభర్తల్లో ఒకరిదే పెత్తనం ఉంటుంది. అయితే అది కొంత వరకు అయితే పర్వాలేదు. కానీ, పెత్తనం కాస్తా ఆధిపత్యంలా మారి, అవతలి వాళ్లు బానిసలా ఉండాలని కోరుకునే దాకా వెళ్తే.. అది టాక్సిక్ లక్షణం. విషయం అర్ధం చేసుకుని ఏయే విషయాల్లో ఎవరి డెసిషన్ కరెక్ట్ అనేది ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ప్రతీ విషయంలో ‘నీకేం తెలీదు’ అన్నట్టు వ్యవహరిస్తే.. రానురాను బంధం బలహీనపడుతుంది.

వాదన

రిలేషన్‌షిప్‌లో వాదించుకోవడం తరచూ జరుగుతుంటే ఇద్దరిలో ఎవరో ఒకరిది టాక్సిక్ బిహేవియర్ కింద లెక్క. పార్ట్‌నర్‌తో చాలా దురుసుగా మాట్లాడుతూ, అదేపనిగా వాదిస్తున్నారంటే.. చాలా పెద్ద సమస్య నడుస్తోందని అర్థం. అందుకే సమస్య వచ్చినప్పుడు కూల్‌గా వ్యవహరించి, నిదానంగా సమస్య గురించి చర్చించే ప్రయత్నం చేయాలి. లేకపోతే చిన్న వాదనే విడిపోయే దాకా తీసుకెళ్తుంది.

కించపరచడం

పార్ట్‌నర్‌‌ని పదేపదే కించపరచడం వల్ల వాళ్లు చాలా డిప్రెషన్‌కి లోనవుతారు. ప్రతి చిన్న విషయాన్ని ఇతరులతో పోల్చడం, చులకనగా చూడటం వంటి విషయాలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. అలాగే అర్థం చేసుకోవాల్సిన పార్ట్‌నరే కించపరుస్తున్నారన్న ఫీలింగ్‌ ఎక్కువవుతుంది. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే.. బంధం ప్రమాదంలో చిక్కుకున్నట్టే. అందుకే రిలేషన్ హెల్దీగా ఉండాలంటే ఒకరినొకరు గౌరవించుకోవడం అవసరం.

చేయి చేసుకుంటే..

కొందరు తమ పార్టనర్‌‌ను ఎంతగా ప్రేమిస్తున్నా.. ఒక్కోసారి మాత్రం తమను తాము కంట్రోల్ చేసుకోలేక పోతుంటారు. చిన్నచిన్న కారణాలకే తిట్టడం, కొట్టడం లాంటవి చేస్తుంటారు. ఇది హెల్దీ రిలేషన్‌కు అంత మంచిది కాదు. ఇగో, కోపం లాంటివి రిలేషన్స్‌ని ఎప్పుడూ డామినేట్ చేయకూడదు. అలా చేస్తే అది టాక్సిక్ లక్షణం అని గుర్తుంచుకోవాలి.

ప్రైవసీ విషయంలో..

సొంత విషయాల్లో ఎక్కువ జోక్యం కనిపిస్తే అది కూడా టాక్సిక్ లక్షణం కింద భావించొచ్చు. అంటే మొబైల్స్ చెక్ చేయడం, పాస్‌వర్డ్‌లు అడగడం లాంటివన్నమాట. ఎదుటి వాళ్లకి ప్రైవసీ ఇవ్వకుండా.. ‘నాకు తెలియకుండా ఎదీ చేయకూడదు’ అనే ధోరణి రిలేషన్‌కు మంచిది కాదు. ఒకరికొకరు స్పేస్ ఇచ్చిపుచ్చుకుంటేనే బంధం బలపడుతుంది.

ఈ పదాలు తరచుగా

‘సారీ’, ‘నో’ అన్న పదాలు ఎక్కువగా వస్తున్నపుడు రిలేషన్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతిసారి ‘సారీ’ చెప్పాల్సి రావడం, ఏది అడిగినా ‘నో’ అనడం లాంటివి మంచి సంకేతాలు కాదు. ‘సారీ’, ‘నో’ అన్న పదాలు తక్కువగా ఉండే రిలేషన్స్ ఎక్కువ కాలం హ్యాపీగా ఉంటున్నట్టు పరిశోధనలు చెప్తున్నాయి.

ఇదొక్కటే దారి

టాక్సిక్ బిహేవియర్ ఉన్న వాళ్లతో వీలైనంత వరకు సైలెంట్‌గా ఉండడం మంచిది. కూల్‌గా ఉన్నప్పుడు వాళ్ల బిహేవియర్ ఎంత ఇబ్బంది పెడుతుందో చెప్పే ప్రయత్నం చేయాలి. అవసరమైతే.. టాక్సిక్ బిహేవియర్ నుంచి బయటపడేందుకు కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఇలాంటి బిహేవియర్ ఇద్దరి ఫ్యూచర్స్‌కు ఎంత నష్టం చేస్తుందో వివరించాలి. లాంగ్ టైం రిలేషన్ నిలబడాలంటే టాక్సిక్ బిహేవియర్ నుంచి బయటపడాలి. లేకపోతే బంధం బ్రేక్ అయ్యే ప్రమాదముంది.

First Published:  11 Sep 2023 4:00 AM GMT
Next Story