Telugu Global
Editor's Choice

' ఉన్మాద ' భావజాలానికి 'భారత్ జోడో ' విరుగుడు కాగలదా?

బీజేపీ జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఎట్లా అవతరించిందో, అందుకు కాంగ్రెస్ బలహీనపడడం ఎట్లా ప్రధాన కారణమైందో.. చాలా లోతుగా అధ్యయనం, ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంది.

Rahul Gandhi Bharat Jodo Yatra
X

బీజేపీ విభ‌జ‌న రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా రాహుల్ గాంధీ అక్టోబర్ 2 న క‌న్యాకుమారి నుంచి కశ్మీర్ వ‌ర‌కు 3,500 కిలోమీటర్ల పాదయాత్ర తలపెట్టారు. 'భారత్‌ జోడో' యాత్రగా నామకరణం చేశారు. ఈ యాత్ర ప్రణాళికను ఖరారు చేశారు. అయితే ఈ పాదయాత్ర వల్ల సాధించేదేమిటి? రాహుల్ ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నారు? 'సమైక్య భారత' యాత్ర చేసినా, రథయాత్ర చేసినా అది పై పైన 'ఔషధ'పూత మాత్రమే! పార్టీని బలోపేతం చేయడం, పార్టీ పునరుజ్జీవం పొందేలా చేయడం, బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యపరచడం, ప్రజల్ని సంఘటితం చేయడం...వంటి అంశాలకు 'డోలో' వంటి జ్వరమాత్రలతో పని జరగదు. 'ఓపెన్ హార్ట్ సర్జరీ' చేయవలసి ఉన్నది.


బీజేపీ మత ప్రాతిపదికన రాజకీయాలు నడుపుతోందా? విభజన రాజకీయాలు, ఉన్మాద చర్యలు... ఏమి చేసినా బీజేపీ జాతీయ స్థాయిలో తిరుగులేని శక్తిగా ఎట్లా అవతరించిందో, అందుకు కాంగ్రెస్ బలహీనపడడం ఎట్లా ప్రధాన కారణమైందో.. చాలా లోతుగా అధ్యయనం, ఆత్మ విమర్శ చేసుకోవాల్సి ఉంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో 'చింతన్ శిబిర్' పేరిట మథనం చేసినా పార్టీ క్యాడర్ ఆశిస్తున్న రీతిలో 'ఆచరణ'కానరావడం లేదు. కాంగ్రెస్ పార్టీ 'తల్లి వేరు' నెమ్మదిగా చెదలు పడుతున్న విషయాన్ని ఆ పార్టీ ఉద్దండ పిండాలు ఎందుకు కనుగొనలేకపోతున్నవి? లోపం ఎక్కడున్నది? ఆ లోపం 'తాత్కాలిక మరమ్మతుల'తో తొలగిపోతుందా.?

'కొత్తతరం ఓటర్లలో 50 శాతం మంది మోదీని ,బీజేపీని ఇష్టపడుతున్నారు. రాహుల్ గాంధీని, కాంగ్రెస్ ను ఇష్టపడుతున్నవారు 20 శాతం కూడా లేరు' అని 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత ఒక స్వతంత్ర సంస్థ అధ్యయనంలో తేలింది. కొత్తతరం ఓటర్లను, యువతను ఆకట్టుకునే పార్టీ కార్యక్రమాలను రూపొందించుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతున్నది. పార్టీ పరంగా వేగంగా నిర్ణయాలు లేవు. అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక కూడా లేదు. ఇక వామపక్షాల విషయానికి వస్తే సీపీఐ, సీపీఎంలకు 2004లో మాత్రమే అత్యధిక లోక్‌సభ సీట్లు లభించాయి. సీపీఎం 43 స్థానాల్లోనూ, సీపీఐ 10 స్థానాల్లోనూ గెలుపొందాయి. కేరళలో మాత్రమే లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఇంకా అధికారంలో కొనసాగుతోంది. 55 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా క్రమంగా 'కామ్రేడ్ల' వలె మారిపోతుందేమోనన్న భయం కాంగ్రెస్ శ్రేణులను వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది.

1984 లో ఇందిరాగాంధీ హత్యానంతర ఎన్నికలలో కాంగ్రెస్ అత్యధికంగా 404 లోక్ సభ స్థానాలను గెలిచింది. కానీ 2014లో 44 లోక్‌సభ స్థానాలను, 2019 లో 52 స్థానాలను గెలుచుకోవడం ఒక విషాదం.లెఫ్ట్ పార్టీల లాగానే కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం తగ్గిపోతున్నట్టు, ప్రజాదరణ కోల్పోతున్నట్టు కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేయడం సహజమే! కాంగ్రెస్ పార్టీ అలక్ష్యం వల్ల, లేదా అహంకారం వల్ల దేశవ్యాప్తంగా పలు ప్రాంతీయ పార్టీలు అవతరించినట్టు చరిత్ర చెబుతోంది. కాంగ్రెస్ తో విభేదించిన తర్వాతే మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ లను స్థాపించారు. కర్ణాటకలో సెక్యులర్ జనతాదళ్, తమిళనాడులో ఏఐడీఎంకే, డీఎంకే, తెలంగాణలో టిఆర్ఎస్, ఏపీలో వైసీపీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ తదితర పార్టీలన్నీ ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్, బీజేపీల కన్నా బలమైన పార్టీలుగా అవతరించాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కాంగ్రెస్ లో విలీనం చేయడానికి కేసీఆర్ ముందుకొచ్చినా సోనియా 'కోటరీ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చడం అందరికీ తెలిసిందే!

ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ సమర్ధ నాయకత్వాన్ని అందించలేకపోతుంది. కేంద్రం బలహీనంగా ఉన్నప్పుడు, రాష్ట్రాల్లోని పార్టీ యూనిట్‌లు కూడా అంతే బలహీనంగా ఉంటాయన్నది రాజనీతి శాస్త్రం చెబుతోంది. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ఆ తేడా కనిపిస్తోంది. బీజేపీ కేంద్రంలో బలంగా ఉన్నందుకే రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉత్సాహంగా పనిచేస్తోంది. ఈ కారణంతోనే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారన్నది ఒక వాస్తవం. అలాగే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇటీవలే బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్ తెలంగాణలోనూ, అటు ఢిల్లీలోనూ ఇక కోలుకోదని, అధికారంలోకి రాదని విశ్వేశ్వరరెడ్డి గట్టిగా నమ్ముతున్నారు.

''రాష్ట్రాల్లోని నాయకత్వం పట్ల, అవినీతి ,స్వార్థంతో పనిచేసే నాయకుల పట్ల వ్యతిరేకత ఉంది. కానీ నెహ్రూ-గాంధీ కుటుంబం పట్ల ప్రజల్లో వ్యతిరేకత లేదు'' అని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే.శివకుమార్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ''సోనియా, రాహుల్ చేతుల్లో నుంచి నాయకత్వం మారితే మొదటికే మోసం జరుగుతుంది. కాంగ్రెస్‌ నాయకుల్లో చాలా మంది పార్టీ వల్ల వ్యక్తిగతంగా బలపడ్డారు. పార్టీని బలోపేతం చేయడానికి మాత్రం వారు కృషి చేయడం లేదు'' అని కూడా శివకుమార్ అన్నారు. ఆయన కామెంట్స్ అక్షరాలా నిజం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి పట్టిన దుస్థితి కనిపిస్తూనే ఉన్నది. కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించిన కాలంలో పలువురు నాయకులు భారీగా 'సంపద'ను మూట గట్టుకున్న వ్యవహారం బహిరంగ రహస్యమే! పలువురు మాజీ మంత్రుల దగ్గర ఇబ్బడి ముబ్బడిగా డబ్బు ఉన్నా తమ పార్టీని 'రక్షించుకునేందుకు' వారెవరూ ముందుకు రావడం లేదని 2014 నుంచీ కాంగ్రెస్ శ్రేణులలో ఫిర్యాదులున్నవి.

తెలంగాణలో రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తున్న విషయాన్ని తిరస్కరించడానికి లేదు. సీనియర్ నాయకుల సహకారం లభించకపోయినా ఆయన తన పని తాను చేసుకొని పోతున్నారు. ఆయన ఎవరినీ సంప్రదించడం లేదనో, ఒంటెత్తు నిర్ణయాలు తీసుకుంటున్నారనో, అందరినీ కలుపుకొని పోవడం లేదనో కొన్ని ఫిర్యాదులు తరచూ వస్తున్నాయి. అలాంటి ఫిర్యాదులు రేవంత్ రెడ్డికి పెరుగుతున్న ఆదరణ, పార్టీ క్యాడర్ లో వస్తున్న జోష్ కారణంగా వస్తుండవచ్చు.

జాతీయ రాజకీయ చిత్రపటంలో సుస్థిర స్థానాన్నిమళ్ళీ సంపాదించుకున్న నరేంద్రమోడీకి దీటుగా కాంగ్రెస్ లో సమర్ధ నాయకత్వం లేకపోవడం వల్ల జాతీయ రాజకీయాల్లో 'శూన్యత ' ఏర్పడింది. విధానాలు ఏవైనా కావచ్చు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటూ ఉండవచ్చు.. అయినా అత్యధిక ప్రజాకర్షణ ఉన్న నాయకునిగా మోడీకి గుర్తింపు లభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయనకు సమఉజ్జీగా 'గాంధీ' వారసులెవరూ కనుచూపు మేరలో కనిపించడం లేదు. జాతీయ రాజకీయాల్లో 'శూన్యత' దేశానికి ప్రమాదకరమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాలలో అభిప్రాయపడ్డారు. అందుకే బీజేపీ ఉన్మాద 'భావజాలానికి' కౌంటర్ గా మరో భావజాలాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్‌లో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చినా బీజేపీకే ప్రజలు పట్టం గట్టారు. అలాగే ప్రతి ఐదేళ్లకూ ఒకసారి ప్రభుత్వం మారిపోయే సంప్రదాయాన్నికూడా ఉత్తరప్రదేశ్ లో మార్చిపారేశారు. బీజేపీకి ఉన్న ఏకైక అతిపెద్ద 'పాజిటివ్ పాయింటు' మోదీ మాత్రమే. ఆయన తర్వాతే అమిత్ షా అయినా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అయినా. మోడీ, అమిత్ షా ద్వయం రచించే వ్యూహాలను చిత్తు చేయగల పరిస్థితిలో కాంగ్రెస్ లేదన వాదన బలంగా ఉంది.

అధికారంలోకి ఎలా రావాలో, వచ్చిన అధికారాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలో, మ్యాజిక్ ఫిగర్ కన్నా తక్కువ సీట్లు సాధించినా మాయోపాయాలు, హార్స్ ట్రేడింగ్ తో అధికారాన్ని ఎట్లా వశపరచుకోవాలో మోడీ బాగా వంటబట్టించుకున్నారు. మహారాష్ట్ర పరిణామాలు అందుకు తాజా ఉదాహరణ. కాంగ్రెస్ లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తర్వాత ఆ స్థాయి ప్రజాకర్షణ కలిగిన వారు ఎదగకపోవడం చారిత్రిక సత్యం. అలాంటి నాయకుడవుతారని రాహుల్ గాంధీ గురించి చేసిన అంచనాలు తలకిందులయ్యాయి. రాహుల్ గాంధీపై కార్యకర్తలు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి.

ప్రధాని మోదీ మాటలు నేరుగా ప్రజలకు 'కనెక్టు' అవుతాయి. అలాంటి వాగ్ధాటి, ఆకర్షణీయ ప్రసంగాలు కేసీఆర్ కు మాత్రమే ఉన్నాయి. అందుకే ''మోడీని ఎదుర్కోగల సమవుజ్జీ కేసీఆర్'' అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

ప్రజల్ని ఆకట్టుకునే కళ కేసీఆర్ సొంతం. వాక్ చాతుర్యంలో ఆయన దిట్ట. నాయకత్వ పటిమలో, పరిస్థితికి తగినట్టు వ్యూహాలను రచించడంలో మోడీ లాగానే కేసీఆర్ నిష్ణాతుడు. కాగా నరేంద్ర మోదీ ఈ వయసులో కూడా 16 గంటలకు పైగా పనిచేస్తున్నట్టు బీజేపీ కేంద్రమంత్రులు చెబుతూ ఉంటారు. అలాగే పార్టీ గురించి, రాజకీయాల గురించి ఆయన నిరంతరం ఆలోచిస్తుంటారని బీజేపీ నాయకులు అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీలోని పాతతరం నాయకుల్లో సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక, వారి 'భజన బృందం'పై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. వారు పార్టీ నాయకత్వంలో మార్పు కోరుతున్నారు. యువతరానికి, పాత తరానికి మధ్య పూడ్చలేని అంతరం ఏర్పడిందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వేగంగా నిర్ణయాలు తీసుకోకుండా నాన్చడానికి ప్రధాన కారణం ఆ పార్టీలో ఉన్న పాతతరం నాయకత్వమన్నది ఇంకో నిజం.

మారుతున్న సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఆ పార్టీ విఫలమవుతున్నదని పలు సందర్భాలు రుజువు చేస్తున్నాయి. ఇప్పటికీ 'కోటరీ' సంస్కృతి కొనసాగుతుంది. సలహాదారులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జులుగా పనిచేస్తున్న నాయకులు రాహుల్ గాంధీ భజన బృందంగా ఏర్పడ్డారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోనియా, రాహుల్ గాంధీ విధేయునిగా చెలామణి అవుతున్న కేసి.వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ త‌దిత‌రులంతా ఈ 'కోటరీ'లోనే ఉన్నారు.

''దేశాన్ని కొత్తగా మార్చేస్తామ''ని 2013 లో రాహుల్ గాంధీ అన్నారు. దేశం సంగతేమో గానీ పార్టీలో కూడా ఆయన ఏమాత్రం 'మార్పు' తీసుకురాలేకపోయారు. కాంగ్రెస్‌ లో సంస్థాగతంగా పలు మార్పులు తీసుకురావాలన్న డిమాండు చాలాకాలంగా ఉంది. ప్రశాంత్ కిషోర్ కూడా అలాంటి సలహా ఇచ్చారు. కానీ ఆ దిశగా అడుగులు పడడం లేదు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని, నియామకాల్లో పారదర్శకత ఉండాలని, పార్టీ పదవులకు ఎన్నికలు నిర్వహించాలని రాహుల్ భావించినా నెరవేరలేదు.

First Published:  15 July 2022 8:57 AM GMT
Next Story