Telugu Global
Editor's Choice

ఏపీ ఓట‌ర్లు ఎటువైపు..?

విశాఖ మినహా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలకి చెందిన అధిక శాతం ప్రజలు వైఎస్ జగన్ పాలన పట్ల సంతృప్తితో ఉన్నారు.

ఏపీ ఓట‌ర్లు ఎటువైపు..?
X

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితిని గమనిస్తే.. ఎన్నికల గోల విపరీతంగా వినిపిస్తున్నప్పటికీ, ఓటరు గాలి మాత్రం ఒక నిర్దిష్ట‌ దిశ వైపు ప్రయాణిస్తున్నట్లుగా కనిపించట్లేదు.

ఈసారి ఎన్నికల సమరం చాలా తీవ్రంగా ఉంది. పోలింగ్ భారీ ఎత్తున నమోదయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా గత మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఇందుకు విరుద్దమైన పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది.

రాష్ట్రంలో వన్ సైడ్ వేవ్ గానీ లేదా అధికార, ప్రతిపక్షాల్లో పలానా వాళ్లు అధికారంలోకి రాబోతున్నారనే స్పష్టమైన సంకేతం ఎక్కడా కనిపించట్లేదు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలతో జతకట్టినా సరే.. అదొక అవకాశవాదంగా కనిపిస్తోంది తప్ప, ఒక నిబద్దతతో కూడిన ప్రయత్నంగా కనిపించట్లేదు.

విదేశాల్లో నివసిస్తున్న ఏపీ వాళ్లు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ వాళ్లు కావచ్చు, తమ ఓటు హక్కును వదులుకోవడానికి వాళ్లెవరూ ఇష్టపడరు. 2014 తరహాలోనే, ప్రస్తుతం హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున సీమాంధ్ర ఓటర్లు స్వస్థలాల బాట పట్టడం గమనించవచ్చు.

2014లో సమైక్య రాష్ట్రం విడిపోయి, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించినప్పుడు.. 'రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలి.' అనే వాదన బలంగా వినిపించింది. 2019 ఎన్నికల సమయంలో 'మార్పు రావాలి' అనే వాదన బలంగా ముందుకొచ్చింది. సోకాల్డ్ అనుభవజ్ఞుడు, విజనరీ అయిన చంద్రబాబు ఏదో చేసేస్తాడని నమ్మితే.. ఆయన ఘోరంగా విఫలమవడంతో మార్పు కావాలని ప్రజలు భావించారు. ప్రస్తుత ఎన్నికల సమరంలో 'ప్రో-జగన్ Vs యాంటీ-జగన్' ఇదే ట్రెండ్ నడుస్తోంది.

ఎన్నికల్లో ఈ నెరేషన్ ఏర్పడేలా చేసిన క్రెడిట్ జగన్‌కే దక్కుతుంది. జగన్‌ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు అవకాశవాద పొత్తులకు తెరలేపారు. తమ ప్రచారంలో ఓటర్లకు ఏం మేలు చేస్తామో చెప్పకుండా, ప్రజల పట్ల తమ నిబద్ధతను వ్యక్తపరచకుండా, కేవలం జగన్‌ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు.

ఓటు వేసేందుకు స్వస్థలాలకు బయలుదేరినవాళ్లతో.. బస్సులు ఎక్కే చోట అంతా గుమిగూడినప్పుడు వారితో ముచ్చటించడం జరిగింది. ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు తాము వెళ్తున్నామని కొందరు చెప్పారు. నగదు బదిలీ పథకాలకు బటన్ నొక్కడం తప్ప జగన్ చేసిందేమీ లేదన్నారు. వీరంతా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినవారు. తమ భూముల ధరలు పడిపోయాయన్నది జగన్ పాలనపై వీరి వ్యతిరేకతకు అసలు కారణం.

విశాఖ మినహా రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలకి చెందిన అధిక శాతం ప్రజలు వైఎస్ జగన్ పాలన పట్ల సంతృప్తితో ఉన్నారు.

ఏపీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. రూరల్ ఓటర్లకు, విద్యావంతులైన అర్బన్ మిడిల్ క్లాస్ ఓటర్లకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. మహిళలు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలతో సహా గ్రామీణ ప్రాంత ఓటర్లు వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. పట్టణ ప్రాంత ఓటర్లు మాత్రం టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారు.

తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మేలును జగన్ తన ప్రచారంలో వివరించారు. తాజా ఎన్నికల మేనిఫెస్టోతో మున్ముందు చేయబోయే మంచిని వారి ముందు పెట్టారు. కానీ కూటమి మాత్రం ప్రజలు, సంక్షేమం, అభివృద్ధి ఇవేవీ పట్టించుకోకుండా కేవలం జగన్‌ని తిట్టడం పైనే ఫోకస్ చేసింది. సైకో పాలన అంటూ ఊదరగొట్టింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేసింది. జగన్‌ ఫ్యామిలీని ఫ్యూడలిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.

అసలు కూటమికి ఎందుకు ఓటేయాలి..? పేదలకు న్యాయం చేసిన, హామీలన్నీ నెరవేర్చిన జగన్‌కు ఎందుకు ఓటు వేయకూడదు..? అనే కనీస ప్రశ్నలకు సరైన సమాధానాన్ని ప్రజలకు చెప్పడంలో చంద్రబాబు, కూటమి సభ్యులు పూర్తిగా వైఫల్యం చెందారు.

అదే సమయంలో, ఎన్నికల ప్రచారంలో కూటమి తమ మేనిఫెస్టోపై పెద్దగా మాట్లాడలేదు. కూటమి మేనిఫెస్టో పేరుకే ఉమ్మడి మేనిఫెస్టోగా మిగిలిపోయింది. కూటమి పార్టీల్లో ఒకటైన బీజేపీ.. ఆ మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదని చెప్పింది. దీంతో సగటు ఓటరులో చంద్రబాబు మేనిఫెస్టోపై అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. ఎడాపెడా హామీలు కురిపించిన చంద్రబాబును విశ్వసించేందుకు ఓటరు సందేహిస్తున్నాడు.

తమ సొంత మేనిఫెస్టో పట్ల మౌనం వహించడం ఓటర్లలో చంద్రబాబుపై విశ్వసనీయతను సన్నగిల్లేలా చేసింది. మేనిఫెస్టో అమలుపై వారిలో సందేహాలు రేకెత్తించింది. చంద్రబాబును నమ్మడమంటే అనకొండ నోట్లో తల పెట్టినట్లేనని జగన్ చేసిన వ్యాఖ్యలు.. బాబుపై మొదలైన నెగటివిటీని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాయి.

గతంలో చంద్రబాబు హయాంలో నెరవేర్చిన హామీలు, జరిగిన అభివృద్ధి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై కూటమి ఫోకస్ చేసి ఉండాల్సింది. జగన్ ఏపీని విధ్వంసం చేశాడని ఆరోపిస్తున్నారు కాబట్టి.. తాము అధికారంలోకి వస్తే ఏవిధమైన అభివృద్ధి పనులు చేస్తారనేది కూడా ప్రజలకు వివరించాల్సింది. కానీ కూటమి ప్రచారంలో అదేమీ జరగలేదు. దీంతో ఓటర్లు సందిగ్దంలో పడ్డారు. ఇప్పుడు అందుతున్న పథకాలతో సంతృప్తిగా ఉండటమా లేక కూటమి అమలుచేస్తుందో లేదో తెలియని హామీలకై ఆరాటపడి రిస్క్ తీసుకోవడమా అనే డైలామాలో ఓటర్లు ఉన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకుంటున్నవారు సంక్షేమ ప్రయోజనలా లేక అభివృద్ధా.. ఈ రెండింటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలనేది తేల్చుకోలేకపోతున్నారు. యూటర్న్స్‌కి మారుపేరైన చంద్రబాబును ఎన్నుకోవడమా, లేక ఎంతో కొంత తమ కష్టాలు తీర్చిన నాయకుడు జగన్‌ వైపు నిలబడాలా అని ఆలోచిస్తున్నారు.

మరోవైపు, టీడీపీ-జనసేన పొత్తుతో కమ్మ, కాపు ఓట్లు గంపగుత్తగా కూటమికే పడుతాయన్న లెక్కలు కూడా తప్పేలా ఉన్నాయి. టీడీపీ-జనసేన మధ్య కమ్మ-కాపు సామాజికవర్గాల ఓట్ల బదిలీ జరిగేలా కనిపించడం లేదు. ముఖ్యంగా కాపు మహిళలకు పవన్ కల్యాణ్ పట్ల అంత నమ్మకం కనిపించట్లేదు. విశాల ప్రయోజనాల కోసం పరిమిత సీట్లలో పోటీ చేస్తున్నామని పవన్ చేసిన వ్యాఖ్యలను వారు విశ్వసించట్లేదు. పవన్‌ కల్యాణ్‌ని వారు చంద్రబాబు కోవర్టుగా, తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాల కోసమే రంగప్రవేశం చేసినవాడిగా చూస్తున్నారు. గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్న తూర్పు గోదావరి జిల్లా లాంటి చోట ఈ సమీకరణాలు జగన్‌కు పాజిటివ్‌గా మారవచ్చు.

పైకి చూస్తే కూటమి బలంగా కనిపిస్తున్నప్పటికీ ఐక్యతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టోకి బీజేపీ దూరం జరగడమే ఇందుకు పెద్ద ఉదాహరణ. కనీసం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల అమలుకు తాము కూడా భరోసా ఇస్తామనే మాట బీజేపీతో చెప్పించడంలో టీడీపీ-జనసేన విఫలమయ్యాయి. బీజేపీ అంత బహిరంగంగా మేనిఫెస్టో పట్ల విముఖత చూపడంతో.. మేనిఫెస్టోని పక్కనపెట్టి 'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్'తో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దానిపై విపరీతమైన దుష్ప్రచారం వ్యాప్తి చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రచారాన్ని మతం చుట్టూ తిప్పుతోంది. దానికి కౌంటర్‌గా ప్రతిపక్ష కూటమి రిజర్వేషన్లు, రాజ్యాంగం వంటి అంశాలతో అధికార పక్షంపై ఫైట్ చేస్తోంది. ఇందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ప్రచారం మొత్తం జగన్ చుట్టే తిరిగింది. అయితే జగన్‌కు అనుకూలమా లేదా జగన్‌కి వ్యతిరేకమా.. ఈ రెండే అంశాల ప్రాతిపదికగా మొత్తం క్యాంపెయిన్‌ సాగినట్లు గమనించవచ్చు. ఏ దృక్పథం నుంచి చూసినా ప్రస్తుతం ఏపీలో తటస్థ ఓటరు అనేవాడు కానరాడు. ప్రతీ ఓటరు.. అయితే జగన్‌కి అనుకూలంగా లేదా జగన్‌కి వ్యతిరేకంగా ఓటేయాలని డిసైడ్ అయ్యాడు.

ఎన్నికల ప్రచారంలో తమ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూటమిలో విఫలమైంది. జగన్‌ది నిరంకుశ పాలన అని ఆరోపించిన కూటమి.. తమ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు చెప్పలేకపోయింది. ఒకరకంగా ఈ ఎన్నికలు సంక్షేమ పథకాల లబ్ధిదారులు వర్సెస్ మిగతా ప్రజలు అన్నట్లుగా తయారైంది. వైఎస్ జగన్ మార్క్సిస్ట్ కోణంలో చెప్పినట్లుగా ఇది పెత్తందార్లకు-పేదలకు మధ్య జరుగుతున్న క్లాస్ వార్‌ను తలపిస్తోంది.

రాష్ట్రంలోని మెజారిటీ దళితులు, బీసీలు, ఎస్టీలు, ముస్లింలు, రెడ్లు వైఎస్ జగన్ వైపు ఉన్నారు. అదే సమయంలో, పట్టణ ప్రాంత విద్యావంతులైన ఓటర్లు, ఉద్యోగులు, టీచర్లు, కమ్మ వర్గం, కాపు సామాజికవర్గంలోని కొంత యువత, అలాగే మరికొన్ని అగ్రకులాలు కూటమి వైపు ఉన్నారు.

టీడీపీకి అండగా నిలబడే బీసీలు, కమ్మ నాయకత్వాన్ని ఇష్టపడని కాపుల్లోని ఒక వర్గం వైఎస్ జగన్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి బలమైన కాపు నాయకత్వం బరిలో ఉన్న చోట ఈ సెక్షన్ ఓటర్లు అటువైపు మొగ్గుతున్నారు.

ఐదేళ్ల పాలన తర్వాత కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్.. ఆ కారణంతోనే చాలాచోట్ల సిట్టింగులను మార్చారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు ఇది సరిపోతుందా. ఇది చర్చించాల్సిన అంశం.

దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల బ్రెయిన్ వాష్ జరిగింది. 'సంక్షేమమా.. అభివృద్ధా..' ఈ రెండింటిలో ఏదో ఒకటి తేల్చుకునేలా వారు బ్రెయిన్ వాష్ చేయబడ్డారు. ప్రతిపక్ష కూటమి తమ పట్ల విశ్వసనీయత చూరగొనడంలో లేదా తమ మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం కలిగించడంలో విఫలమైంది. ఎంతసేపు 'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్' చుట్టూ లేనిపోని అబద్దాలను ప్రచారం చేసేందుకే పరిమితమైంది.

ఇంతకుముందే చెప్పినట్లు, పట్టణ ప్రాంత విద్యావంతులైన ఓటర్లలో, ఉద్యోగస్తుల్లో వైఎస్ జగన్ పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ.. స్వల్ప మెజారిటీతో వైఎస్ జగన్ అధికారంలోకి రాబోతున్నారు. ఇందులో మహిళా ఓటర్లు నిర్ఱయాత్మకంగా ఉండబోతున్నారు. జనసేన-బీజేపీలకు 20 సీట్లు ఇచ్చినందుకు టీడీపీకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ స్థానాల్లో మిత్రపక్షాల మధ్య ఓట్లు బదిలీ అయ్యే సూచనలు కనిపించట్లేదు.

తెలివైన ఓటరు కేవలం పైపైన కనిపించే విషయాలనే వాస్తవాలుగా పొరబడి నిర్ణయం తీసుకోడు. అన్నింటికీ మించి ఎన్నికలనేవి ప్రజా దృక్పథాన్ని ప్రభావితం చేసేవి. ఏ రాజకీయ పార్టీ ఓటర్లను ఎక్కువగా బ్రెయిన్ వాష్ చేస్తుందో, ఆ పార్టీయే విజేతగా నిలుస్తుంది.

First Published:  12 May 2024 2:22 PM GMT
Next Story