Telugu Global
Editor's Choice

బాబ్రీ మసీదు విధ్వంసానికి ముప్పయ్యేళ్ళు

అయోధ్యలోని 16వ శతాబ్దపు బాబ్రీ మసీదు కట్టడం 1992 డిసెంబర్‌ 6న కరసేవకుల చేతిలో నేలమట్టమైంది. ధ్వంసమైంది మసీదు మాత్రమే కాదు ఈ దేశపు గణతంత్ర వ్యవస్థ, లౌకిక వ్యవస్థ. వాటి పునాదులే కదిలిపోయాయి.

బాబ్రీ మసీదు విధ్వంసానికి ముప్పయ్యేళ్ళు
X

ప్రధాన స్రవంతి పత్రికల్లో ఎక్కడా బాబ్రీ మసీదు విధ్వంసం ప్రస్తావన లేదు ఈ రోజు. డిసెంబర్‌ 6 అనగానే అంబేద్కర్‌ వర్థంతి గుర్తుకొస్తుంది చాలామందికి. కానీ, సరిగ్గా ఇదే రోజు 1992లో కాషాయ పరివారపు కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు. కూల్చివేత చిన్నమాట. అంత పెద్ద కట్టడాన్ని రెండు మూడు గంటల్లో విధ్వంసం చేశారు. అయోధ్యలోని 16వ శతాబ్దపు బాబ్రీ మసీదు కట్టడం 1992 డిసెంబర్‌ 6న కరసేవకుల చేతిలో నేలమట్టమైంది. ధ్వంసమైంది మసీదు మాత్రమే కాదు ఈ దేశపు గణతంత్ర వ్యవస్థ, లౌకిక వ్యవస్థ. వాటి పునాదులే కదిలిపోయాయి.

ఇవాళ ప్రధాన పత్రికలు, టీవీ చానళ్ళు, వెబ్‌సైట్ల అన్నింటా గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ల ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీ విజయపథంలో ఉన్నట్టు ఢంకా బజాయించి చెబుతున్నాయి. హిందుత్వాన్ని నెత్తికెత్తికున్న మీడియా బాబ్రీ ఘటనని విస్మరించడం విషమ వాస్తవం. సోషల్‌ మీడియా తరానికి బాబ్రీ ఘటన గుర్తుండే అవకాశం లేదు.



బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, శివసేన, విశ్వహిందూ పరిషత్‌, బ‌జరంగదళ్‌ ఇతర హిందూ జాతీయవాద సంస్థలు 1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో పెద్దఎత్తున్న నిరసన ర్యాలీకి పిలుపు నిచ్చాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం లక్ష్యంగా సాగిన ఈ ర్యాలీకి దాదాపు లక్షన్నరమందికి పైగా కరసేవకులు తరలివచ్చారు. రెండు మూడు రోజుల ముందు నుంచే దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి కరసేవకులు పెద్దఎత్తున అయోధ్యకు బయలుదేరారు. డిసెంబర్‌ 6న ఏదో జరగబోతుందనే రాజకీయ పరిశీలకులు, జర్నలిస్టులు భావించారు.

మసీదు విధ్వంస ప్రమాదం పొంచి వుందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వాన్ని ముందుగానే హెచ్చరించాయి. ఆనాడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం. పి.వి.నరసింహారావు ప్రధాని. ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్‌ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అయోధ్యలో కరసేవకుల ర్యాలీని అడ్డుకోవాలని యు.పి.లో రాష్ట్రపతి పాలన విధించి ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలని కేంద్రాన్ని బీజేపీయేతర పక్షాలు కోరాయి. కానీ, ప్రధాని పి.వి.నరసింహారావు మౌనం వహించారు.


మసీదుకు ఎలాంటి నష్టం కలిగించబోమని బీజేపీ ఇతర హిందూత్వ సంస్థలు సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చాయి. ఇందుకు విరుద్ధంగా ఆ రోజున ర్యాలీలో ప్రసంగించిన నాయకులందరూ ఉద్వేగపూరిత ఉపన్యాసాలతో కరసేవకుల్ని రెచ్చగొట్టారు. కరసేవకులు మసీదులోకి చొచ్చుకుపోతుండగా పోలీసు బలగాలు ప్రేక్షకపాత్ర వహించాయి. గర్భగుడిలోకి వెళ్ళవద్దని, మసీదును కూల్చవద్దని కరసేవకులను ఎవరూ కోరలేదు, హెచ్చరించలేదు.

కరసేవకుల ఆగ్రహావేశాల ఫలితమే బాబ్రీ మసీదు కూలిపోయిందని మీడియా, బీజేపీ నేతలు చెబుతారు కానీ, నిజానికి బాబ్రీ కూల్చివేతకు పది నెలల ముందుగానే పకడ్బందీ ప్లాన్‌ రూపొందిందని ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ హెడ్‌ మలోయ్‌ కృష్ణధర్‌ 2005లో రాసిన పుస్తకంలో వివరంగా తెలియజేశారు. వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్‌,బీజేపీ అగ్రనేతలు రూపొందించిన ప్రణాళిక ప్రకారమే బాబ్రీ మసీదు విధ్వంసానికి రంగం సిద్ధమైందని నాటి ప్రధాని పి.వి. నరసింహారావును కూడా ఆయన హెచ్చరించారు. ఇంటెలిజెన్స్‌ వర్గాలు నాటి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అన్ని వివరాలు అందించాయని అన్నారు. ఇంత కచ్చితమైన సమాచారం ఉన్నప్పటికీ నాటి ప్రధాని పి.వి. నరసింహారావు మాత్రం అయోధ్య విషయంలో వ్యవహరించిన తీరు సరిగా లేదని కృష్ణధర్‌ అన్నారు. దీని తర్వాతనే సోనియా గాంధీకి, పి.వి.కి మధ్యన ఎడం పెరిగిందని పరిశీలకులు చెబుతారు.

''రాజకీయ ప్రయోజనం పొందటానికీ హిందుత్వ తరంగాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లడానికీ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని'' అయోధ్య అంశం ఇచ్చిందని, దీని వెనుక ఒక నిశ్శబ్ద ఒప్పందం ఉందని రచయిత కృష్ణధర్‌ చెప్పడం గమనార్హం.



2014 ఏప్రిల్‌లో కోబ్రాపోస్ట్‌ చేసిన ఒక స్టింగ్‌ ఆపరేషన్‌, కూల్చివేత ఉన్మాద ముఠా చర్య కాదనీ ఏ ప్రభుత్వ సంస్థకు కూడా దాని వాసన కూడా తగలనంత రహస్యంగా ప్రణాళిక చేసిన విధ్వంసక చర్య అని పేర్కొంది. ఈ విధ్వంసానికి విశ్వ హిందూ పరిషత్‌, శివసేన చాలా నెలల ముందుగానే ప్రణాళిక వేశాయి, అయితే అవి విడివిడిగా ప్లాను చేసుకున్నాయని పేర్కొంది.

మూడు దశాబ్దాల కిందట సరిగ్గా ఇదేరోజున జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో బీజేపీ అగ్రనేతల కుట్ర ఏమీ లేదని సీబీఐ స్పెషల్‌ కోర్టు 2020 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది. ''ఈ కూల్చివేత ముందే అనుకుని చేసినది కాదు'' అని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి వ్యాఖ్యానించారు. ఈ కేసులో నిందితులైన ఎల్‌.కె.అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతి, వినయ్‌ కటియార్‌తో పాటు మొత్తం 32 మందిని నేర విముక్తుల్ని చేసింది.

బాబ్రీమసీదు విధ్వంసం అనంతరం దేశవ్యాప్తంగా మతకల్లోలాలు చెలరేగాయి. దాదాపు 2000 మంది చనిపోయారు. అంతర్జాతీయంగా భారత గణతంత్ర వ్యవస్థ అప్రతిష్ట పాలైంది. భిన్నత్వంలో ఏకత్వం, లౌకిక విధానం అనే పునాదులే పెకళించబడ్డాయి. సకల రంగాల్లోకి హిందూత్వ భావజాలం చొచ్చుకుపోయింది. ఇవాళ దేశమంతటా కాషాయ పవనాలు వీచడానికి గల మూలాలు 6 డిసెంబర్‌ 1992 నాటి ఘటనలో ఉన్నాయి.

బాబ్రీ మసీదు విధ్వంస ప్రభావంతో బీజేపీ అతివాద రాజకీయాల ప్రభావం పెరిగింది. అప్పటివరకు తటస్థులుగా ఉన్నవారు హిందూత్వకు అనుకూలంగా మొగ్గు చూపడం దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చివేసింది. మీడియా ప్రముఖులకీ, జర్నలిస్టులకీ, మేధావులకీ, రచయితలకీ, కళాకారులకీ హిందూత్వ రాజకీయాలపై అవగాహన ఉన్నా నిశ్శబ్దం రాజ్యమేలుత్నుది. విభజన రాజకీయాలు, విద్వేష రాజకీయాలు, మూకహత్యలు మన సామాజిక, రాజకీయ రంగంలో అంతర్భాగమయ్యాయి. 'లౌకికతత్వం' అనే పదం ఏదో వినకూడని మాటలా పరిణమించింది. 2014 తరువాత విద్యా, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోనూ హిందూ జాతీయ వాద ధోరణులు విస్తరించడం - మున్ముందు అనేక పరిణామాలకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. అయినప్పటికీ మతం-మార్కెట్‌ కలగలసిన వర్తమానం మనుషుల్ని మాయ జేస్తున్నది. ఈ మాయలో, మత్తులో మునిగితేలేవారికి బాబ్రీ మసీదు విధ్వంసానికి 30 ఏళ్లు అన్న మాటని ఎవరు గుర్తు చేస్తారు..?

First Published:  6 Dec 2022 10:03 AM GMT
Next Story