Telugu Global
Editor's Choice

చరిత్రను చెరిపేస్తున్న ఆర్ఎస్ఎస్..

బీజేపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు కోరుకున్నది వాస్తవరూపంలోకి తెచ్చేందుకు పాఠ్యపుస్తకాలలో కూడా ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారు.

చరిత్రను చెరిపేస్తున్న ఆర్ఎస్ఎస్..
X

మహాత్మా గాంధీని భారత ప్రజలు జాతిపితగా గుర్తించడం ఆర్ఎస్ఎస్ కి ఇష్టం లేదు. అందుకే గాంధీ జయంతి కంటే ఎక్కువగా సావర్కార్ జయంతిని జరుపుకునేందుకు వారు ఉత్సాహం చూపిస్తుంటారు. వీలైతే చరిత్రను కూడా సావర్కార్ కి అనుకూలంగా రాసేందుకు వారు వెనకాడరు. బ్రిటిష్ పాలకులకు క్షమాపణ లేఖ రాసి జైలునుంచి విడుదలైన సావర్కార్ ని జాతిపితగా ప్రొజెక్ట్ చేస్తుంటారు. భారత స్వాతంత్య్ర పోరాటాన్ని తుంగలో తొక్కిన ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ ని కూడా వారు వీరుడిగా, శూరుడిగా కీర్తిస్తుంటారు. ఇప్పటి వరకూ ఇదంతా కేవలం వారి ప్రచారంగానే ఉంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక దీన్ని వాస్తవరూపంలోకి తెచ్చేందుకు పాఠ్యపుస్తకాలలో కూడా ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు చేస్తున్నారు.

1998నుంచే మొదలు..

1998లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా ఉన్న మురళీ మనోహర్ జోషి పాఠ్యాంశాల్లో 'ప్రీస్ట్‌ హుడ్ అండ్ రిచ్యువలిజం' అనే అంశాన్ని చేర్చారు. ఆయన కాలంలో ఖగోళ శాస్త్రానికి బదులు జ్యోతిష్యానికి ప్రాధాన్యమిచ్చారు. పుత్రకామేష్టి యాగం ఎలా చేస్తారనేది కూడా పాఠాల్లో పొందుపరిచారు. మగబిడ్డ కోసం యజ్ఞం చేయడం వంటి మూఢనమ్మకాలను పిల్లల మనసుల్లో పొందుపరిచారు.

ఇటీవల సీబీఎస్ఈ పాఠ్యపుస్తకాల నుంచి ప్రజాస్వామ్యంలో వైవిధ్యం, వ్యవసాయంపై ప్రపంచీకరణ ప్రభావం, ప్రజా ఉద్యమాలు, మతతత్వం వంటి అంశాలను 10వ తరగతి సిలబస్ నుండి తొలగించారు. సిక్కు అల్లర్లకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క్షమాపణలు చెప్పడం, 2002 గుజరాత్ అల్లర్లలో 2వేలమంది ముస్లింల ఊచకోత వంటి ప్రస్తావనలు కూడా పుస్తకాలనుంచి తొలగించాలని ఎన్సీఈఆర్టీపై ఒత్తిడి తెస్తున్నారు. మన కళ్లముందు ఉన్నదాన్నే వారు అదృశ్యం చేయాలని చూస్తున్నారు, ఇక చరిత్రను చెరిపేయడం వారికి ఓ లెక్కా.

టిప్పు సుల్తాన్ గాథలో అన్నీ మాయం..

"టిప్పు సుల్తాన్ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశాడు. ఫ్రెంచి వారితో పొత్తు పెట్టుకుని బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొట్టాలని ప్రయత్నించాడు. భూ సంస్కరణలు, చిన్న వ్యవసాయ రుణాలు, పట్టుపురుగుల పెంపకం, టంకశాల నిర్మాణం వంటి వాటికి టిప్పు సుల్తాన్ ఆద్యుడు.." అనే వాక్యాలను ఆరో తరగతి పాఠ్య పుస్తకాలనుంచి తొలగించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జైన, బౌద్ధ మతాల గురించి ఉన్న పాఠ్యాంశాల్లో కొత్త మతాల పెరుగుదల అనే సెక్షన్ ని కర్నాటక ప్రభుత్వం భరించలేకపోయింది. జైన్ బౌద్ధ మతాలను హిందూ మతంలోని శాఖలుగా మార్చింది. చాతుర్వర్ణ వ్యవస్థను తిరస్కరిస్తున్న భారతదేశంలోని మతాలను తుడిచిపెట్టేందుకు ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

గోల్వాల్కర్ ఫార్ములా..

ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తి, ఆర్ఎస్ఎస్ పరివార్ కి గురూజీ అయిన గోల్వాల్కర్ ఫార్ములాని ఇప్పటి ఎన్డీఏ సర్కారు తూచా తప్పకుండా పాటిస్తోంది. భారత సమాఖ్య వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని, రాష్ట్రాల అధికారాల్ని తుంగలో తొక్కాలనేది గోల్వాల్కర్‌ వాదన. చింతన గంగ అనే పుస్తకంలో కూడా ఆయన ఈ వాదాన్ని బలపరిచారు. ప్రస్తుత మోదీ సర్కారు జీఎస్టీ ద్వారా రాష్ట్రాలను నిజంగానే బిచ్చగాళ్లుగా చేసింది. జీఎస్టీని కేంద్రాని నేరుగా పంపించడం, ఆ తర్వాత అందులో వాటా కోసం చేతులు కట్టుకుని ప్రాధేయపడటం ఇదీ ఇప్పటి రాష్ట్రాల తంతు. రాష్ట్రాల సంపదను పెద్దన్నలాగా అనుభవిస్తూ.. పన్నులు చెల్లించిన రాష్ట్రాలకే చిల్లర విదిలిస్తూ దర్జా వెలగబెట్టడం కేంద్రం వంతు. ఒకే దేశం, ఒకే భాష, ఒక జాతి, ఒకే నాయకుడు.. ఇలాంటి భావాలను ఆర్ఎస్ఎస్ బలపరుస్తోంది. దీనికోసం ముందుగా పిల్లల మెదళ్లను చెడగొడుతోంది. పాఠ్యాంశాల విషయంలో జోక్యం చేసుకుంటోంది, చరిత్రనే మార్చేస్తోంది. కాషాయ దళానికి అనుకూలంగా కథలల్లుతోంది.

First Published:  27 July 2022 6:45 AM GMT
Next Story