Telugu Global
Editor's Choice

పటేల్ ఆదర్శాలను పాతి పెట్టిన మోడీ... ఆయన విగ్రహాన్ని మాత్రం భారీ ఎత్తున ప్రతిష్టించారు

నిజాం వ్యతిరేక పోరాటంగా గుర్తించడానికే బీజేపీ సిద్ధంగా ఉంది తప్ప దానిని భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా గుర్తించదలచుకోలేదు. రజాకార్లు చేసిన అత్యాచారాలు,హత్యలు భూస్వాముల అండతో జరిగినవేనన్న వాస్తవాలను సంఘ్ పరివార్ అంగీకరించదు.

పటేల్ ఆదర్శాలను పాతి పెట్టిన మోడీ... ఆయన విగ్రహాన్ని మాత్రం భారీ ఎత్తున ప్రతిష్టించారు
X

"మొదట జాతీయవాదం తెలుసుకున్నాను.తర్వాత చరిత్ర అర్థంచేసుకొని,అవగాహనచేసుకోటం నేర్చుకున్నాను." 'మీన్ కాంఫ్' (నా పోరాటం) పేరిట తన ఆత్మకథలో హిట్లర్ చెప్పాడు.అయితే హిట్లర్ చరిత్రనే మార్చాడు. నిన్న గుజరాత్ లో జరిగిందీ,నేడు మొత్తం భారతదేశంలోనూ జరుగుతున్నది డిటో. 22 ఏండ్ల క్రితమే గుజరాత్ లో గాంధీ ఆదర్శాలను భూస్థాపితం చేయడానికి మోడీ కుట్ర పన్నారన్న ఆరోపణలున్నవి.

గాంధీని చంపిన గాడ్సేను సంఘ్ తప్పుపట్టలేదు. మోదీ హయాంలో అహ్మదాబాద్ లో గాడ్సేకు గుడికట్టారు. నాస్తికుడు, సామ్యవాది, విశ్వవిజ్ఞాన ప్రజ్ఞాశాలి అయిన నెహ్రూను ప్రధానిగా ప్రతిపాదించారన్నది గాంధీపై సంఘ్ కోపానికి కారణం. పటేల్ ప్రధమ ప్రధాని అయి ఉంటె భారత్ ను హిందూదేశంగా మార్చిఉండేవారని సంఘ్ భావీస్తోంది.కానీ అది తప్పు.పటేల్ అట్లా చేసి ఉండేవారు కాదు.

''విద్వేషపూరిత,హింసాత్మక భావజాల మూలాలున్న ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలి'' అని 1948 ఫిబ్రవరి 2 న నాటి కేంద్ర హోమ్ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రతిపాదించారు.1948 జనవరి 30 న మహాత్మాగాంధీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపిన తర్వాత రెండు రోజుల్లోనే పటేల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.1948 ఫిబ్రవరి 4 న ఆర్ఎస్ఎస్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.నిషేధం ఎత్తివేయాలని ఆ సంస్థ అధిపతి గోల్వాల్కర్‌ విజ్ఞప్తి చేసినప్పుడు,భారత రాజ్యాంగానికి కట్టుబడేలా ఆర్‌ఎస్‌ఎస్‌ లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని పటేల్ షరతు విధించారు.''రాజ్యాంగ విధేయత,జాతీయ పతాకం ఆమోదం, సంఘ్‌ అధినేత అధికారాల నిర్వచన, అంతర్గత ఎన్నికలతో సంఘ్‌ ప్రజాస్వామ్యీకరణ, పిల్లలను సంఘ్‌ సభ్యులుగా చేర్చుకోటానికి తల్లిదండ్రుల అనుమతి, హింస, రహస్య కార్యక్రమాలను చేపట్టబోమనే నిబంధనల''తో ఆర్‌ఎస్‌ఎస్‌ రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలని పటేల్ ఆనాడు స్పష్టం చేశారు.ఇదీ అసలు చరిత్ర.

ఉక్కుమనిషిగా పేరుపొందిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నిజంగానే 'సంఘ్'పై ఉక్కుపాదాన్ని మోపారు...అయితే ఈ చరిత్రను ఒప్పుకోవడానికి ఆర్ఎస్ఎస్,బీజేపీ సిద్ధంగా ఉండవు.జవహర్ లాల్ నెహ్రూను విస్మరించేందుకు గాను వల్లభ్ భాయ్ పటేల్ మహనీయునిగా తెరపైకి తీసుకు వచ్చారు.పటేల్‌ పేరును తమ ప్రచారానికి బిజెపి నాయకులు విస్తృతంగా వాడుకుంటున్నారు.పటేల్‌ జీవితాంతం పాటించిన విలువలకు, ఆచరణకు మోడీ,అమిత్ షా పూర్తి వ్యతిరేకంగా వెళ్తున్నారన్నది పచ్చి నిజం.

కాగా స్వాతంత్ర ఉద్యమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ పాల్గొనలేదు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో దేశ ప్రజలందరూ పాల్గొన్నప్పటికీ సంఘ్ దూరంగా ఉంది.జాతీయ ఉద్యమంలో తమ నాయకులు,కార్యకర్తలను పాల్గొనవద్దని చెప్పటమే కాకుండా, ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేయమని ఆదేశించింది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఐఎన్‌ఏలో సైనికుల నియామకం జరుగుతూ ఉంటే, దానిని ఆటంకపరుస్తూ ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులను రిక్రూట్‌ చేసుకొని, వారిని బ్రిటిష్‌ అధికారుల అంగరక్షక దళంలో చేర్చారు. స్వాతంత్రోద్యమ వ్యతిరేక పనులు చేశారు. ఆంగ్లేయులకు వంతపాడారు. జైలు బయటికి రావడానికి వీరి నాయకులు బ్రిటిష్‌ వారికి ఊడిగం చేస్తామన్న వాగ్దానంతో క్షమాభిక్ష ఉత్తరాలు రాశారు. భారతీయుల ఊచకోతకు ఆంగ్లేయులకు సహకరించారు. ప్రజలను మతం పేరుతో చీల్చారు. స్వాతంత్య్ర సమరంలో హిందు-ముస్లిం విభేదాలను రెచ్చగొట్టారు.

పటేల్‌ ఆదర్శాలకు విరుద్ధంగా సంఘ్‌ ఆధ్వర్యంలో మతవిద్వేషాలు పెంచుతున్నారు. సంఘ్‌, బీజేపీ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయని చరిత్ర కూడా ఉన్నది.ఓ వైపు చైనాను బహిష్కరించాలని ప్రచారం చేసిన బిజెపి నాయకులు చైనాలోనే విగ్రహాలను తయారుచేయించారు.ప్రధాని ఉపయోగించేవన్నీ విదేశీ వస్తువులే.దేశ ప్రథమ ఉపప్రధానిగా,హోం,సమాచార,శాఖల మంత్రిగా పటేల్‌ 565 స్వతంత్ర రాచరిక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కీలక పాత్రను పోషించారు రాజీలేని జాతీయభావంతో, నిబద్ధత,దేశసమగ్రత,సమైక్యతల కోసం ఆయన కృషిచేశారు.

మైనారిటీలు,గిరిజనులు,బహిష్కృత జాతులు,ప్రాథమిక హక్కులు,రాష్ట్రాల రాజ్యాంగవిధానాలు తదితర కమిటీలకు పటేల్‌ అధ్యక్షుడుగా పనిచేశారు.మైనారిటీలకు రిజర్వేషన్‌ కల్పించారు.పౌర అధికారుల సేవల్లో రాజకీయ జోక్యాన్ని అరికట్టారు.

ఇండియాను హిందూ దేశంగా,హిందూ మతాన్ని అధికార మతంగా ప్రకటించాలన్న సలహాను పటేల్‌ తిరస్కరించారు.''భారత్‌ లౌకిక రాజ్యం.పాకిస్థాన్‌ వంటి మతరాజ్యం లాగా మనం ఉండలేమ''న్నారు.

దేశ విభజన సందర్భంలో ముస్లింలు పయనిస్తున్న రైళ్లపై దాడిని పలుమార్లు పటేల్‌ ఆపారు.గాంధీ మరణించిన రెండు నెలల్లోపే పటేల్‌ తీవ్ర గుండెపోటుకు గురయ్యారు.దీనికి కారణం గాంధీ హత్యతో తనకు కలిగిన అంతులేని బాధేనన్నారు.

.

పటేల్‌ ఆదర్శాలను పాతిపెట్టిన మోదీ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని మాత్రం భారీ ఎత్తున ఏర్పాటు చేయటం ఆశ్ఛర్యాన్ని కలిగిస్తుంది. . ''జీవితాంతం కాంగ్రెస్‌ వాది అయిన పటేల్‌ను బీజేపీ సొంతం చేసుకోవడం విచిత్రం''.. స్వాతంత్య్ర సమరంలో ఒక పాత్ర లేని బీజేపీ స్వాతంత్య్ర యోధులను, జాతీయ నాయకులను, రాజకీయవేత్తలను దొంగిలించిందని చరిత్రకారులంటున్నారు. నెహ్రూపై తరచూ వేసే నిందలు వేయడానికి,పటేల్‌ ను పొగడ్తల్లో ముంచెత్తడంలోనే బీజేపీ నాయకుల స్వార్ధం బట్టబయలవుతోంది.

మత ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని మొట్టమొదట కోరిన వ్వ్యక్తి సావర్కర్‌. ''ముస్లింలందరు మరో దేశానికి పోతే భారత్‌ దానంతటదే హిందూ దేశమవుతుంద''ని ఆయన భావన. ఈ నేపథ్యంలో జిన్నా నేతృత్వంలో ముస్లిం వేర్పాటువాద ఉద్యమం పెరిగిపోయింది.దీనికి పరిష్కారంగా దేశ విభజనను అంగీకరించిన మొదటి కాంగ్రెస్‌ నాయకుల్లో పటేల్‌ ఒకరు.గాంధీ, నెహ్రూలు విభజనను వ్యతిరేకించారు.

హి౦దుత్వ తీవ్రవాదులు,తమతో ఏకీభవించని వారిపై హింసాద్వేషాలను ప్రచార౦చేయడం,ప్రత్యర్థులను చంపడం మతపర త్యాగమన్న ఒక దుర్మార్గపు విశ్వాసాన్ని చాటుకునే హక్కులు కావాలని వాదిస్తున్నట్టు "మీ నథురా౦ గోద్సే బోల్తోయ్ (నేను నథురా౦ గోద్సేను మాట్లాడుతున్నాను)" అనే మరాఠీ నాటకకర్త‌ ప్రదీప్ దాల్వి ఒక సందర్భంలో అన్నారు.

గాంధీ హంతకులు గాంధీకి భావజాల శత్రువులు.సంఘ్ వీరి మెదళ్ళలో విషం నింపింది. సంఘ్ భావజాలం భగవద్గీత. గాంధీ దేశానికి నష్టమని, దేశభక్తుడు గాడ్సే అర్జునుడయి గాంధీని చంపాడని సంఘ్ కార్యకర్తల భావన. గాంధీని జాతిపిత అనరాదని,హిందుత్వమే జాతీయతకు ఆధారమని సావర్కర్ ఉద్బోధించారు. వాహ్ శరణార్థ శిబిరంలో సంఘ్ సేవలను గురించి మహాత్మాగాంధీ స్పందిస్తూ , నియంతలు హిట్లర్, ముసోలినీల నేతృత్వాలలో నాజీలు, ఫాసిస్టులు కూడా సేవచేశారన్నారు.సంఘ్ ను మతోన్మాద నియంతృత్వ సంస్థగా గాంధీ వర్ణించారు.

ఇదిలాఉండగా నోట్లపై గాంధీ బొమ్మ తొలగించాలని హిందుమహాసభ మీరట్ శాఖ అధ్యక్షుడు భరత్ రాజ్ పుత్ అన్నారు. 2017 క్యాలెండర్, డైరీలపై గాంధీ స్థానంలో మోదీని గాంధీ గ్రామోద్యోగ సంస్థ‌ ముద్రించడాన్ని ఎట్లా అర్ధం చేసుకోవాలి?.''గాంధీబొమ్మతో రూపాయి విలువ తగ్గింది. గాంధీని మించిన గుర్తింపు మోదీ పొందారు." అని గతంలో హర్యానా బిజెపి మంత్రి అనిల్ విజ్ అన్నారు. గాంధీ జయంతిని 'స్వచ్ఛ భారత్ దివస్' చేశారు.గాంధీని చెత్తకు గుర్తుగా మార్చారు. "పాకిస్తాన్ మతభావాలతో మరణించింది. భారత్ కూ అదే గతి పట్టబోతోంది." పాకిస్తాన్ ప్రముఖ పాత్రికేయుడు ఖలేద్ అహ్మద్ వ్యాఖ్యానించారు.

''విధానపరమైన యుద్ధంలో ప్రత్యర్థులు బలహీనపడ్డారని తెలిసిన విజేత,ఎప్పుడూ అదే రకం యుద్ధం సాగితే తనకు ఎదురు ఉండదనుకుంటాడు.ఆ విషయం తెలియని బలహీనుడు,అదే యుద్ధరంగంలో శ్లేష్మంలో ఈగలా కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఉనికి ముఖ్యమైన కాలంలో,ఉనికే ముఖ్యం.''ఇటీవల ఆంధ్రజ్యోతి ఎడిటర్,పత్రికా రచయిత కె.శ్రీనివాస్ తన రెగ్యులర్ కాలమ్ 'సందర్భం'లో వ్యాఖ్యానించారు.ఆయన చెప్పింది ముమ్మాటికీ నిజం.టిఆర్ఎస్ కు, బీజేపీకి మధ్య విధానపరమైన యుద్ధమే జరుగుతోంది.కనుక తెలంగాణ తన ఉనికి తాను కాపాడుకోవడం ఇప్ప్పుడు ముఖ్యం.సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవం తామే జరిపి,తెలంగాణ ప్రభుత్వాన్ని, కెసిఆర్‌ను బోనులో నిలబెట్టాలనుకున్న బిజెపిని 'జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల' పేరిట కేసీఆర్ ఆత్మరక్షణలో పడవేశారు.

సమైక్యత ఏమిటి? రజాకార్లు చేసిన దుర్మార్గాలను మరచిపోవాలా? అని కొందరు ప్రశ్నిస్తుండవచ్చు.అయితే రజాకార్ల కాలంలో జరిగిన అఘాయిత్యాలను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? దాంతో ఒరిగేదిమిటి? నిజాం వ్యతిరేక పోరాటంగా గుర్తించడానికే బీజేపీ సిద్ధంగా ఉంది తప్ప అది భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా గుర్తించదలచుకోలేదు. రజాకార్లు చేసిన అత్యాచారాలు,హత్యలు భూస్వాముల అండతో జరిగినవేనన్న వాస్తవాలను సంఘ్ పరివార్ అంగీకరించదు.భారతసైన్యాలు బలప్రయోగంతో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నపుడు ప్రజల భాగస్వామ్యం లేనందువల్ల ఆ సందర్భాన్ని వేడుకగా జరుపుకోవడానికి సమాజం పెద్దగా ఆసక్తి చూపడం లేదు.సెప్టెంబర్ 17ను వేడుక జరుపుకోవడం ఆ గాయాలను గుర్తుచేసినట్టు అవుతుందన్న సున్నితత్వంతోనే ప్రభుత్వాలు దాటవేస్తూ వచ్చాయని అర్ధం చేసుకోవాలి.

First Published:  14 Sep 2022 6:58 AM GMT
Next Story