Telugu Global
Editor's Choice

మూడు పార్టీలకు సవాలు విసురుతున్న మునుగోడు.. ఎవరి కారణాలు వారివే..!

కుటుంబం నుంచి ఒక వ్యక్తి కాంగ్రెస్‌ను విడిచిపెట్టడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. మునుగోడులో ఓడితే అది ఉమ్మడి నల్గొండ జిల్లాపైనే కాకుండా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ను బలహీనపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు.

Munugode by-election
X

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఉపఎన్నిక వచ్చే అవకాశం ఉన్నది. తెలంగాణలో మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న టీఆర్ఎస్‌తో పాటు అధికారం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నిక సవాలు విసురుతోంది. రాజ్‌గోపాల్ రాజీనామా ప్రకటించిన వెంటనే.. అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉన్నది. ఈ ఉపఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీకే చాలా కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మంచి పట్టుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ హవా ఉన్న సమయంలో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ లోక్‌సభ, అసెంబ్లీ, కౌన్సిల్ సీట్లలో గెలిచి తమ సత్తా నిరూపించుకున్నారు. అలాంటి కుటుంబం నుంచి ఒక వ్యక్తి కాంగ్రెస్‌ను విడిచిపెట్టడం ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే. మునుగోడులో ఓడితే అది ఉమ్మడి నల్గొండ జిల్లాపైనే కాకుండా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ను బలహీనపరిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నిక కోసం సర్వశక్తులు పెట్టనున్నది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికకు సంబంధించి స్ట్రాటజీ, ప్రచార కమిటీని నియమించారు. మధుయాష్కి గౌడ్ కన్వీనర్‌గా ఉండగా.. దామోదర్ రెడ్డి, బలరాం నాయక్, సీతక్క, అంజన్ కుమార్ యాదవ్, అనిల్ , సంపత్‌లు సభ్యులుగా ఉన్నారు. ఉపఎన్నిక కోసం అన్ని అస్త్రాలను సిద్దం చేశామని, ఎవరు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పోతామని రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రాజీనామా తర్వాత రేవంత్ చేసిన వ్యాఖ్యలు గమనిస్తే.. ఆయన మునుగోడు విషయంలో ఎంత సీరియ‌స్‌గా ఉన్నారో అర్థం అవుతోంది. ఈ ఉపఎన్నిక ప్రచారానికి కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి వస్తారా.. రారా? అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉన్నది. అయితే తన అనుచరులకు వెంక‌ట్‌రెడ్డి ఎలాంటి సూచనలు చేస్తారనే విషయంపైనే కాంగ్రెస్ గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి.

ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఈ ఉపఎన్నిక బాధ్యతను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలకు అప్పగించినట్లు తెలుస్తున్నది. మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్దన్ రెడ్డి కుమార్తె స్రవంతి సహా పలువురు నేతలు ఇక్కడి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కానున్నది.

అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా మునుగోడు ఉపఎన్నికపై ఇప్పుడు దృష్టి పెట్టింది. ఇక్కడ ఉపఎన్నిక రావొద్దనే టీఆర్ఎస్ కోరుకున్నది. కానీ ఇప్పుడు అనివార్యం కావడంతో బరిలోకి దిగక తప్పడం లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు అయినా.. బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ బరిలో దిగుతుండటంతో టీఆర్ఎస్‌కు సవాలుగా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తుందనే సర్వేల నేపథ్యంతో పాటు, జాతీయ నాయకత్వం కూడా తెలంగాణపై దృష్టిపెట్టిన కారణంగా కేసీఆర్ ఉపఎన్నికను సవాలుగా తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే టీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గంపై దృష్టి పెట్టింది. రెండు సార్లు ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశమై ఉప ఎన్నికపై చర్చించారు. కేటీఆర్ కూడా నియోజకవర్గ నాయకులతో సమన్వయం చేస్తున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి నెల రోజుల నుంచి ప్రత్యేకంగా మునుగోడునే ఫోకస్ చేశారు.

పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ప్రజలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపేలా వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే కొత్తగా గట్టుప్పల్ మండలాన్ని ప్రకటించారు. ఈ మండలంతో పాటు మిగిలిన ఏడు మండలాల టీఆర్ఎస్ నాయకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న ఇతర పార్టీ నేతలను కూడా చేర్చుకునేందుకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో అతి ప్రచారం కారణంగా పార్టీ భారీగా నష్టపోయింది. గత అనుభవాల నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక, ప్రచారం విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని పార్టీ నిర్ణయించింది. ఏ మాత్రం హడావిడి చేయకుండా పకడ్బందీగా ఉపఎన్నికకు సిద్దం కావాలని భావిస్తోంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలో దిగిన ప్రభాకర్ రెడ్డి ఓడిపోయారు. కానీ ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఆరు మండలాలకు గాను అయిదింటిలో టీఆర్ఎస్ ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులే ఉన్నారు. ఇక రెండు మున్సిపాల్టీల్లో కూడా టీఆర్ఎస్ పాలకవర్గం ఉన్నది. దీంతో కొంచెం కష్టపడితే గెలవడం ఈజీగానే ఉంటుందని ఒక అంచనాకు వచ్చింది. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్ , కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు మునుగోడు నుంచి టికెట్ ఆశిస్తున్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం గోషమహల్ సీటు మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. ఆ తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో విజయాలు సాధించి ఉత్సాహంగా ఉన్నది. ట్రిపుల్ ఆర్‌లకు తోడుగా ఇప్పడు మునుగోడులో 'రాజగోపాల్'ను గెలిపించి మరో ఆర్‌తో అసెంబ్లీలో బలం పెంచుకుంటామని బీజేపీ రాష్ట్ర నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇవి ప్రీఫైనల్‌గా భావిస్తున్న బీజేపీ.. ఇక్కడ గెలవడం ద్వారా టీఆర్ఎస్‌పై పై చేయి సాధించాలని భావిస్తోంది. గతంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. 2009, 2014, 2018 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన గంగిడి మనోహర్ రెడ్డి కేవలం మూడో స్థానానికికే పరిమితం అయ్యారు. అయినా సరే క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటూ బీజేపీ ముందుకు సాగింది. ఇప్పటికే 300 పోలింగ్ బూత్ కమిటీలను వేశామని.. పార్టీకి అంతగా బలం లేకపోయినా.. కోమటిరెడ్డి రాజగోపాల్ వంటి బలమైన అభ్యర్థి వల్ల తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. రాజగోపాల్ వెంట కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు రావడంతో గెలుపుపై బీజేపీ ఒక అంచనాకు వచ్చింది.

Next Story